ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై నిఘా

– విమానాశ్రయంలో అన్ని వ్యవస్థలు బలోపేతం
– ఇద్దరు అనుమానితులకు గాంధీలో ఐసోలేషన్
– తప్పుడు సమాచారం ఇచ్చే విదేశీయులపై చర్యలు
– ముందు జాగ్రత్తలు, పర్యవేక్షణపై మంత్రి దామోదర్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని, శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని అధికారులు చెప్పారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్, తదితర అంశాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సమీక్షించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజులపాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటివరకు ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్‌లో ఉంచి వారి శాంపిల్స్‌ను టెస్టుల కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎనఐవీ)కి పంపగా ఇద్దరికీ వైరస్ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఐసీఎంఆర్ సూచన మేరకు వారినుంచి మరోసారి శాంపిల్స్ సేకరించి ఎనఐవీకి పంపామని చెప్పారు. రెండోసారి నెగిటివ్ వస్తే వారిని ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు. శాంపిల్స్ సేకరణ, టెస్టుల్లో అలసత్వం ఉండకూడదని మంత్రి సూచించారు. ఆరోగ్య శాఖకు అవసరమైన సహకారం అందించాలని సీసీఎంబీ డైరెక్టర్‌ను కోరారు. ఐసీఎంఆర్ నుంచి ఎబోలా టెస్టింగ్ కిట్లు వచ్చాయని, టెస్టులు చేయడం ప్రారంభించామని సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. శాంపిల్ వచ్చిన వెంటనే టెస్టులు చేసి ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే కొంతమంది ప్రయాణికులు తమకు ఇచ్చిన అడ్రస్‌లో ఉండడం లేదని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ అంశంపై మంత్రి సీరియస్‌గా స్పందించారు. ఎబోల ప్రభావిత దేశాల ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలు, కేసుల నమోదు వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని విమానాశ్రయంలోనే ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని మంత్రి సూచించారు. విదేశీ ప్రయాణికులతో సమర్థవంతంగా మాట్లాడేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎబోలా ప్రభావిత దేశాల్లో ఎక్కువగా మాట్లాడే ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి సహా అవసరమైన విదేశీ భాషల్లో మాట్లాడగల సిబ్బందిని మూడు షిఫ్టుల్లో, 24 గంటలపాటు విమానాశ్రయంలో అందుబాటులో ఉంచి పర్యవేక్షణ, సమాచార సేకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ, జీహెచఎంసీ, విమానాశ్రయ అధికారులు, పోలీసు శాఖ తదితర విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచాలని ఆదేశించారు. ఎబోలా నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సంతోష్ చౌహాన్, కేంద్ర ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పావని, జీఎంఆర్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ సంజయ్ కుమార్, జీహెచఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి, ఐడీఎస్‌పీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శివ బాలాజీ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి డీసీపీ శిల్పవల్లి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు రాకేశ్ రంజన్, అన్న మేరీ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *