– ఉప ముఖ్యమంత్రి భట్టికి టీజీపీఈజేఏసీ కృతజ్ఞతలు
– జూలై నుంచి 2.543 శాతం అమలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : విద్యుత్ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెంపునకు ఆమోదం తెలపడంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల బృందం ప్రజాభవన్‌లో భట్టిని బుధవారం కలిసి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 2.543 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, దీంతో ఉద్యోగుల డీఏ గతంలో ఉన్న 19.272 శాతం నుంచి 21.815 శాతానికి పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల వివిధ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినందుకు కూడా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సెలవులు, గ్రాట్యుటీ, పదోన్నతులు తదితర సమస్యలపై దృష్టి సారించాలని ట్రాన్స్‌కో, జెన్కో, రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగి 20,018 మెగావాట్లకుపైగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంలో ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌ల ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు సమష్టిగా చేసిన కృషి అభినందనీయమన్నారు. రైతులు, గృహ వినియోగదారులు, పారిశ్రామిక సంస్థలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బంది సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పీఆర్సీ-2026 ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు కోరగా ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న రబీ సీజన్లోనూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ రంగ ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేస్తారని ఉప ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు టీజీపీఈజేఏసీ కోఆర్డినేటర్ పరికె సదానందం తెలిపారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, 1104 అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ వజీర్, సదానందం, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





