– ‘సర్’పై కాంగ్రెస్, ఇండి కూటమి విష ప్రచారం ఆపాలి
– ఎన్నికల సంఘంపై బురదజల్లే అరాచక రాజకీయాలను తిప్పికొడదాం
– వికారాబాద్ మేధావుల సదస్సులో బీజేపీ చీఫ్ రామచందర్ రావు
వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఎన్నికల్లో వరుస ఓటములను తట్టుకోలేక కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు ప్రజాస్వామ్య సంస్థలపై విషం చిమ్ముతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్ చోరీ’ అంటూ ఎన్నికల సంఘంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఆ పక్షాలు చేస్తున్న నిరాధార ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణంలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ ‘ఎస్ఐఆర్’పై బుధవారం నిర్వహించిన మేధావులు, న్యాయవాదుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ ప్రక్రియ మోదీ ప్రభుత్వంలో కొత్తగా తెచ్చినది కాదని, దేశ చరిత్రలో ఇప్పటివరకు 12 సార్లు నిర్వహిస్తే అందులో 1952 నుంచి 2004 వరకు రాజీవ్ గాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానుల కాలంలోనే పలుమార్లు జరిగిందని గుర్తు చేశారు. 2002-2004 తర్వాత దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామానికి ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతగా ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టిందన్నారు. 13 కోట్ల ఓట్లు రాత్రికి రాత్రే తొలగించేశారంటూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 13 కోట్లు అనేది ముసాయిదా (డ్రాఫ్ట్) పరిశీలన దశలో గుర్తించిన ఏఎస్‌డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్) నమోదులు మాత్రమేనని, క్షేత్రస్థాయి విచారణలు పూర్తయిన తర్వాతే తుది జాబితా వస్తుందని తేల్చిచెప్పారు. వీరిలో 6.3 కోట్ల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, 3.0 కోట్ల మంది చిరునామాల్లో అందుబాటులో లేనివారు, 2.8 కోట్ల మంది మరణించినవారు, కోటిమంది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు ఉన్న డూప్లికేట్ ఓటర్లు అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏటా కోటిమంది వరకు మరణిస్తుంటే గత ఇరవై ఏళ్లలో చనిపోయిన వారి పేర్లను, హైదరాబాద్‌లోనూ, వికారాబాద్లోనూ ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఉన్న అక్రమ ఓట్లను తొలగించకుండా అలాగే ఉంచాలా అని రామచందర్ రావు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్ కుట్రలకు గండిపడుతుందనే ఈ నిరాధార ఆరోపణలని ఎద్దేవా చేశారు.
సర్వే చేసేది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందే
‘సర్’ ప్రక్రియలో కేంద్ర ప్రమేయం ఏమీ ఉండదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులైన రెవెన్యూ యంత్రాంగం, అంగన్వాడీ, ఉపాధ్యాయ సిబ్బంది అయిన బిఎల్వోలే ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారని తెలిపారు. ప్రతి బూత్లోనూ బీజేపీతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల ఏజెంట్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎవరి పేరైనా పొరపాటున తొలగిస్తే ఫారం-6 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు.
దేశ భద్రతపై రాజీపడేది లేదు
ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడ్డారని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారికి కార్డులు ఇచ్చి ప్రోత్సహించిన గత కాంగ్రెస్, తృణమూల్ ప్రభుత్వాల తీరును ధ్వజమెత్తారు. పౌరసత్వం లేని చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందేనన్నారు. 2014 నుంచి 2025 వరకు దేశంలో జరిగిన 56 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల చేతిలో ఘోరంగా తిరస్కరణకు గురైందని, ప్రజలు తమను విశ్వసించకపోవడంతోనే ఈవీఎంలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘంపై నిందలు మోపుతోందని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని మేధావులకు, విద్యావంతులకు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





