దక్షిణాదిలో భారీ వర్షాలు:వాతావరణ శాఖ సూచన

ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో వాయువ్య, మధ్య భారతదేశం అలాగే ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వేడి గాలుల (హీట్‌వేవ్) ప్రభావం కొనసాగవచ్చని హెచ్చరించింది.

ఆదివారం నాటికి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాలను కవర్ చేశాయి. వొచ్చే వారం పాటు దక్షిణ భారతదేశం మరియు ఈశాన్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఖరీఫ్ పంటల విత్తనాల సాగుకు అత్యంత కీలకమైన ఈ రుతుపవనాలు జూన్ 4న కేరళను చేరాయి. ఇది సాధారణ సమయానికి మూడు రోజుల ఆలస్యంగా వొచ్చినట్లు ఐఎండీ తెలిపింది.

జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు పశ్చిమ-మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని, అలాగే ఈశాన్య భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేశాయని ఐఎండీ వెల్లడించింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు పూర్తిగా రుతుపవనాల పరిధిలోకి వొచ్చాయని తెలిపింది. అలాగే త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు ప్రవేశించాయని పేర్కొంది.

వొచ్చే ఏడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా జూన్ 8 నుంచి 10 తేదీల మధ్య కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మరిన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

ఐఎండీ ప్రకటన ప్రకారం, “వొచ్చే  3-4 రోజులలో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం ప్రాంతాల కొంత భాగాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది” అని పేర్కొంది.

భారతదేశంలో సంవత్సరాంత వర్షపాతంలో 70 శాతం కంటే ఎక్కువ భాగం నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. అందువల్ల వ్యవసాయం, జలవనరులు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు ఈ రుతుపవనాలు అత్యంత కీలకమైనవి.

అయితే మరోవైపు, వాయువ్య భారతదేశంలోని పెద్ద ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పుల ప్రభావాన్ని కొనసాగించనున్నాయని ఐఎండి హెచ్చరించింది.

జూన్ 8న తీర ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాల్లో, జూన్ 10-11 తేదీలలో తూర్పు మధ్యప్రదేశ్‌లో, జూన్ 9-10 తేదీలలో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో, జూన్ 8 నుంచి 11 వరకు హర్యానా, చండీగఢ్, దిల్లీ ప్రాంతాల్లో, అలాగే జూన్ 9-10 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *