విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

– దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్మించిన ప్రజల ఆస్తులివి
– కాంగ్రెస్ జాతీయ విధానం ఒకలా, తెలంగాణలో మరోలా ఏంటి?
– రాయ‌పూర్ ఆర్థిక తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందా?
– రాహుల్ గాంధీకి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖstopped
stopped
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2:  టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలు, ఇతర వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలపై కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాష్ట్ర‌ ప్రభుత్వ ప్రతిపాదిత టీజీ-ట్రాన్స్‌కో 26 శాతం ఈక్విటీ డైల్యూషన్‌/ఐపీఓ (వాటా తగ్గింపు) నిర్ణయం మొత్తం ప్రభుత్వ విద్యుత్ సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నదన్నారు. ఇది రాష్ట్రంలోని వ్యూహాత్మక విద్యుత్‌ మౌలిక వసతుల భవిష్యత్‌ యాజమాన్యం, నియంత్రణకు సంబంధించిన కీలక అంశమని, టీజీ-ట్రాన్స్‌కో ఒక సాధారణ వాణిజ్య సంస్థ కాదని, తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కీలక ప్రజా సంస్థ అని గుర్తు చేశారు. టీజీ-ట్రాన్స్‌కో పరిధిలో 29,400 కేవీ సబ్‌స్టేషన్లు, 107, 220 కేవీ సబ్‌స్టేషన్లు, 337, 132 కేవీ సబ్‌స్టేషన్లు, 31,420కు పైగా సర్క్యూట్‌ కి.మీ ఈహెచ్ టీ లైన్లు, 1,184 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 43,848 ఎంవీఏ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సామర్థ్యం ఉన్నాయని తెలిపారు. దశాబ్దాలుగా ప్రజాధనంతో, గత ప్రభుత్వాల కృషితో నిర్మించిన ఈ ప్రభుత్వ ఆస్తులను రాత్రికి రాత్రి ప్రైవేట్‌ యాజమాన్యానికి అప్పగించే హక్కు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్ర‌శ్నించారు. 26 శాతం వాటా తగ్గింపు మొదటి అడుగు మాత్రమే.. భవిష్యత్తులో మిగిలిన వాటాను కూడా ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే మార్గాన్ని సుగమం చేస్తున్నారు.. అంటే టీజీ-ట్రాన్స్‌కో తర్వాత టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలు కూడా ఇదే బాట పట్టనున్నాయా అని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఢిల్లీలో కాంగ్రెస్‌ ఒక మాట.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో మరో మాటా అని నిల‌దీశారు. కాంగ్రెస్‌ 2019 మేనిఫెస్టోలో వ్యూహాత్మకేతర, నాన్‌-కోర్‌ ప్రభుత్వ రంగ సంస్థలకే డిజ్ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిమితం చేయాలని పేర్కొందన్నారు. 2023 రాయ్‌పూర్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ ఆర్థిక తీర్మానంలో కూడా డిజ్ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో ప్రైవేట్‌ మోనోపొలీలు, డ్యూపొలీలు ఏర్పడకూడదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మరి రాష్ట్రంలో వ్యూహాత్మక విద్యుత్‌ సంస్థ అయిన టీజీ-ట్రాన్స్‌కోలో ఈక్విటీ డైల్యూషన్‌ ఏ కాంగ్రెస్‌ విధానం ప్రకారం చేస్తున్నారు.. కాంగ్రెస్‌ సీడబ్ల్యుసీ తీర్మానాలు ఢిల్లీకి మాత్రమే పరిమితమా.. తెలంగాణలో వర్తించవా  అని నిల‌దీశారు. మీరు కేంద్ర ప్రభుత్వ ప్రజా ఆస్తుల మానిటైజేషన్‌, ప్రైవేటీకరణ విధానాలను పదేపదే ప్రశ్నించారు.. ఎల్ఐసీ, విద్యుత్‌ రంగం వంటి వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా తగ్గింపుపైనా మీరు ఆందోళనలు వ్యక్తం చేశారు.. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌తో పాటు కాంగ్రెస్‌ అధికారంలో లేని ఇతర రాష్ట్రాల్లో విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణను కాంగ్రెస్‌ వ్యతిరేకించింది.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో అదే సూత్రం వర్తించాలి అని స్ప‌ష్టం చేశారు.
టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణపై రాహుల్‌గాంధీ మౌనం వహిస్తే.. కాంగ్రెస్‌ జాతీయ విధానం, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం ఒక్కటి కానట్లేనా? తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం..టీజీ-ట్రాన్స్‌కోలో 26 శాతం వాటా ఎందుకు తగ్గిస్తున్నారు? టీజీ-జెన్‌కోకు సంబంధించి ఏం చేయబోతున్నారు?సింగరేణిపై ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి? డిస్కంల భవిష్యత్‌ యాజమాన్యంపై ప్రభుత్వం ఆలోచన ఏమిటి? ప్రజల ఆస్తులను ప్రజల అనుమతి లేకుండా ప్రైవేట్‌ ప్రయోజనాలకు అప్పగించే నిర్ణయాలు తీసుకోవద్దు.
ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యం లేదా నియంత్రణను ప్రభావితం చేసే నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలి. టీజీ-ట్రాన్స్‌కో ఐపీఓ, 26 శాతం ఈక్విటీ డైల్యూషన్‌ను తక్షణమే నిలిపివేయాలి.టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలు, ఇతర వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలపై ఐపీఓ, ఈక్విటీ డైల్యూషన్‌, ప్రైవేటీకరణ ఆలోచనలను ఉపసంహరించుకోవాలి. ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్‌ 2019 మేనిఫెస్టో, 2023 రాయ్‌పూర్‌ ఆర్థిక తీర్మానాలకు ఎలా అనుగుణంగా ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ విధానం మారితే బహిరంగంగా ప్రకటించాలి.. విధానం మారకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించాలి.. ఒక జాతీయ పార్టీ విశ్వసనీయత తీర్మానాలు చేయడంలో కాదు.. వాటిని అమలు చేయడంలో ఉంటుంది అని పేర్కొన్నారు. అందుకే రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ వెంటనే జోక్యం చేసుకుని టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు.  టీజీ-ట్రాన్స్‌కోతో మొదలయ్యే ప్రైవేటీకరణకు ఇక్కడే అడ్డుకట్ట వేయాలి.. టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలను కూడా ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ద్వంద్వ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తించి వ్యవహరించండి అని హ‌రీష్‌రావు హితవు ప‌లికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *