– గాడ్సే భావజాలాన్ని వ్యతిరేకించాలి
– గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితోనే ప్రజా పాలన
– డిప్యూటీ సీ¾ఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : అహింస, సత్యాగ్రహం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మహాత్మా గాంధీ ఆలోచనలే ప్రపంచానికి మార్గదర్శకాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీజీ చూపిన మార్గంలోనే అసమానతలు, వివక్ష, అవమానాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, టీపీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే భావజాలాన్ని సమర్థించే ధోరణులు దేశంలో కనిపించడం బాధాకరమన్నారు. గాంధీని విమర్శిస్తూ గాడ్సే విధానాలే సరైనవని మాట్లాడే సంస్కృతిని దేశభక్తులెవరూ అంగీకరించరాదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ నాయకత్వం, సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గాంధీతో కలిసి నడవని, ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని బీజేపీ నాయకులు నేడు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దక్షిణాఫ్రికాలో ఎదురైన అవమానం గాంధీజీ జీవితంలో కీలక మలుపుగా మారిందని చెప్పారు. చంపారన్ సత్యాగ్రహం నుంచి దండి సత్యాగ్రహం వరకు సామాన్య ప్రజల సమస్యలను ఉద్యమాలకు కేంద్రంగా మార్చారన్నారు. గుప్పెడు ఉప్పుతో, చిన్న నూలు పోగుతో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సవాల్ విసిరిన మహాత్ముడు ప్రజల శక్తిని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు.
సమానావకాశాలు కల్పించడమే ప్రజా పాలన లక్ష్యం
గాంధీజీ ఆలోచనల స్ఫూర్తితోనే ప్రజల అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా విధానాలను ప్రజా ప్రభుత్వం రూపొందిస్తున్నదని తెలిపారు. ప్రజలందరికీ సమానావకాశాలు, విద్య, సామాజిక గౌరవం కల్పించడమే ప్రజా పాలన లక్ష్యమన్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులు కలిసి చదువుకునేలా ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
గాంధీ ఆలోచనలే సామాజిక సమానత్వానికి పునాది
స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే గాంధీజీ సామాజిక అసమానతలు, అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించారని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆయన కృషి చేశారని తెలిపారు. హిందూ-ముస్లిం ఐక్యతను బలోపేతం చేసి స్వాతంత్య్ర ఉద్యమాన్ని విస్తృత ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దారని చెప్పారు. గాంధీ, నెహ్రూ తదితర జాతీయ నాయకులు వేసిన పునాదుల వల్లే స్వతంత్ర దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం వంటి రంగాల్లో పురోగతి సాధ్యమైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తొలుత భట్టి విక్రమార్కకు గాంధీ వేషధారణలో ఉన్న చిన్నారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీ భవన్‌లో..
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ఆధ్వర్యంలో నాంపల్లిలోని గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్, రవాణా, మైనారిటీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, గడ్డం వివేకానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా భవన్‌లో గాంధీకి నివాళులు 
ప్రజా భవన్‌ల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూల మాలలు వేసి నివాళులర్పించారు. కోపం కంటే శాంతిని, విభేదాల కంటే మంచితనాన్ని, నిర్లక్ష్యం కంటే కరుణను ఎంచుకుందామని పిలుపునిచ్చారు. నిజమైన ప్రగతి పట్టుదలతో, సహనంతో సాధ్యమవుతుందని, ఆ ప్రగతి అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని అన్నారు. ప్రతి మనిషికి గౌరవం, మర్యాద, మానవత్వం దక్కే సమాజమే మహాత్మా గాంధీకి మనం అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





