ఫీనిక్స్ ఇన్విటేషనల్‌లో భుల్లార్‌తో బైసోయా ఢీ

– 11 నుంచి 13 వరకు ఏఎంగ్రీన్ ఐజీపీఎల్ టోర్నీ
– ట్రోఫీని ఆవిష్కరించిన నిర్వాహకులు
– గోల్ప్ అభివృద్ధికి స్పెషల్ ఒలింపిక్స్ తో భాగస్వామ్యం
– ఇప్పటివరకు విజయవంతంగా పది టోర్నమెంట్ల నిర్వహణ
– ఏఎం గ్రీన్ ఐజీపీఎల్ సీఈఓ ఉత్తమ్ సింగ్ ముండీజూబ్లీహిల్స్, ప్రజాతంత్ర నవంబర్ 10: వూటీ గోల్ఫ్ కౌంటీలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఏఎం గ్రీన్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) ఫీనిక్స్ ఇన్విటేషనల్ 2026 టోర్నమెంట్ జరగనుంది. హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ జీసీ సమర్పణలో నవంబర్ 11 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు. గత వారం వైజాగ్‌లో జరిగిన పోటీల్లో చివరి వరకు ఉత్కంఠభరితంగా పోరాడి ప్లేఆఫ్‌లో గగన్‌జీత్ భుల్లార్ చేతిలో ఓటమి పాలైన సచిన్ బైసోయాకు ఈ టోర్నీ ద్వారా ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించనుంది. హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ జట్టుకు కీలక ఆటగాడైన బైసోయా, రంజిత్ సింగ్, రాఘవ్ చుగ్, అర్జున్ భాటిలతో కలిసి బరిలోకి దిగనున్నారు. ఏఎం గ్రీన్ ఐజీపీఎల్ సీఈఓ ఉత్తమ్ సింగ్ ముండీ మాట్లాడుతూ.. 2026లో ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ వేదికలతో సహా మొత్తం 10 టోర్నమెంట్లను విజయవంతంగా నిర్వహించామని, వూటీలో 11వ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నామని తెలిపారు. పురుషులు, మహిళా ప్రొఫెషనల్ గోల్ఫర్లు సమాన ప్రైజ్‌మనీ కోసం ఒకే వేదికపై పోటీపడేలా లీగ్ కృషి చేస్తోందన్నారు. గోల్ఫ్ అభివృద్ధికి గోల్ఫ్ బోర్డులు, స్పెషల్ ఒలింపిక్స్‌తో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నామని, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ జీసీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సచిన్ బైసోయా మాట్లాడుతూ.. రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని హెచ్‌జీఏలో తమ జట్టు విజయం సాధించిందని, వైజాగ్‌లో ఆశించిన ఫలితం రాకపోయినా మంచి ఫామ్‌లో ఉన్నామని పేర్కొన్నారు. ఎక్స్‌-గోల్ఫ్ వంటి కొత్త ఫార్మాట్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయని, అమెరికాలో నాలుగేళ్లు ఉన్న సమయంలో అక్కడ క్రీడలకు అభిమానులు ఇచ్చే ప్రాధాన్యతను గమనించానని తెలిపారు. భారత్‌లో గోల్ఫ్‌కు అపారమైన అవకాశాలున్నాయని, అభిమానులు బౌల్డర్ హిల్స్‌లో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వీక్షించాలని కోరారు. వైజాగ్‌లో జరిగిన గ్రీన్ ఫ్యూయల్స్ మారిటైమ్ ఇన్విటేషనల్‌లో వర్షం కారణంగా చివరి రౌండ్ కుదించినప్పటికీ బైసోయా ఏడు అండర్ స్కోరుతో అద్భుతంగా ఆడి భుల్లార్ ఆధిక్యాన్ని సమం చేశారు. అయితే ప్లేఆఫ్‌లో 40 అడుగుల దూరం నుంచి అద్భుతమైన పుట్ సాధించిన భుల్లార్ విజయం అందుకున్నారు. 11 సార్లు ఆసియా టూర్ విజేతగా నిలిచిన భుల్లార్, ఈ సీజన్‌లో మూడు సహా ఇప్పటివరకు ఆరు ఐజీపీఎల్ టైటిళ్లు సాధించారు. తొలి రౌండ్‌లో భుల్లార్ ఉదయం 10.42 గంటలకు వరుణ్ పరీఖ్, కపిల్ కుమార్‌లతో కలిసి, బైసోయా ఉదయం 11.04 గంటలకు ఆర్యన్ రూపా ఆనంద్, సుఖ్‌మన్ సింగ్‌లతో కలిసి ఆట ప్రారంభించనున్నారు. ఐజీపీఎల్‌లో అరంగేట్రం చేసిన టోర్నీలోనే విజయం సాధించిన అర్జున్ ప్రసాద్ ఉదయం 9.14 గంటలకు రవి కుమార్, హర్షజిత్ సింగ్ సేథీలతో పోటీకి దిగనున్నారు. సీనియర్ ఆటగాడు శివ్ కపూర్ ఉదయం 11.15 గంటలకు కణవ్ చౌహాన్, డానిష్ వర్మలతో కలిసి బరిలోకి దిగనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *