– రాష్ట్ర, సౌత్‌జోన్ పోటీల్లో 15 పతకాలు
– 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు
– విజేతలను అభినందించిన డీజీపీ ఆనంద్
– 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు
– విజేతలను అభినందించిన డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 15 : షూటింగ్ క్రీడల్లో తెలంగాణ పోలీసు సిబ్బంది సత్తా చాటారు. రాష్ట్ర, సౌత్‌జోన్ స్థాయి పోటీల్లో కలిపి 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. విజేతలను తన కార్యాలయంలో డీజీపీ సి.వి.ఆనంద్ మంగళవారం అభినందించారు. క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో 11 పతకాలు
12వ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్-2026 జూన్ 20 నుంచి 28 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ, సాట్జీ షూటింగ్ రేంజ్లో జరిగింది. రైఫిల్, పిస్టల్ విభాగాల్లో తెలంగాణ పోలీసు షూటర్లు 4 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు సాధించారు. 13వ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన పీసీ 1304 జి.నిరంజన్‌రెడ్డి 50 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతాలు సాధించారు. డీజీ టెక్నికల్ సర్వీసెస్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ఎ.ప్రసన్నకుమార్ 50 మీటర్ల పిస్టల్ మాస్టర్ విభాగంలో స్వర్ణం, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో కాంస్యం సాధించారు. ఫ్యూచర్ సిటీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ బి.జేమ్స్‌బాబు రజతం, కాంస్య పతకాలు సాధించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వాసీ వి.సువర్ణ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో స్వర్ణం దక్కించుకున్నారు. సీఎస్‌డబ్ల్యూ హైదరాబాద్ సీఐ బి.శంకర్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ విభాగంలో స్వర్ణం సాధించారు.
సౌత్ జోన్లో 4 పతకాలు
17వ సౌత్ జోన్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026ను ఆగస్టు 31 నుంచి ఈనెల 8 వరకు కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించారు. తెలంగాణ పోలీసు షూటర్లు 2 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు. 3వ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన జి.నిరంజన్‌రెడ్డి 50 మీటర్ల ఫ్రీ పిస్టల్, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో రెండు స్వర్ణాలు, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్‌లో రజతం సాధించారు. ఫ్యూచర్‌సిటీ ఐటీ సెల్‌కు చెందిన ఇన్స్పెక్టర్ బి.జేమ్స్‌బాబు కాంస్య పతకం సాధించారు. పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను ఐజీ (పి అండ్ ఎల్) గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీఎస్పీ రామారావుతోపాటు పలువురు పోలీసు అధికారులు అభినందించారు.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





