తెల్ల చొక్కా వెనుక కన్నీటి నిజాలు!

“ఎన్నిక ముగుస్తుంది, పదవి మారుతుంది, ఫ్లెక్సీ చిరిగిపోతుంది. అప్పు మాత్రం మిగులుతుంది. పిల్లలతో గడపని బాల్యం, కుటుంబానికి ఇవ్వని సమయం తిరిగిరావు. అందుకే రాజకీయాల్లో ఎదుగుతున్నానా, లేక ఆ ప్రయాణంలో కుటుంబ భద్రతను కోల్పోతున్నానా అని ప్రశ్నించుకోవాలి. తెల్ల చొక్కా వెనుక కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి. ప్రజాసేవను స్థోమతలో కొనసాగించాలి. పదవిని ఆశించవచ్చు; జీవితాన్ని పణంగా పెట్టకూడదు. రాజకీయాలు జీవితంలో భాగంగా ఉండాలి, మొత్తం జీవితాన్ని మింగేయకూడదు.”

జీడిపల్లి రాంరెడ్డి
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌
9666680051

తెల్ల చొక్కా కనిపిస్తుంది. చేతిలో పార్టీ జెండా, నాయకులతో దిగిన ఫొటోలు, సభల్లో నినాదాలు, సోషల్‌ మీడియాలో హోరు కనిపిస్తాయి. కానీ ఆ చొక్కా వెనుక కష్టాలు, కుటుంబం చేస్తున్న త్యాగాలు, పార్టీ కార్యక్రమాల కోసం చేసిన అప్పులు కనిపించవు. ప్రజల కోసం పరుగులు తీసే నాయకుడు తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు ఎంత సమయం కేటాయిస్తున్నాడో ఎవరూ పట్టించుకోరు. కిందిస్థాయి రాజకీయాల్లో వెలుగుల వెనుక దాగిన చీకటి ఇది. బయట గుర్తింపు పెరుగుతున్నా ఇంట్లో ఆర్థిక భద్రత కరిగిపోతున్న జీవితాలెన్నో.

జగిత్యాల జిల్లా ఎడంపల్లి మండలం గుల్లకోటకు చెందిన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్‌ ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన లేఖ ఈ వాస్తవాన్ని గుర్తుచేస్తున్నది. పార్టీ కోసం అప్పులు చేశానని, భార్యాపిల్లలకు తగిన భద్రత కల్పించలేకపోయానన్న ఆయన ఆవేదన కలచివేస్తుంది. ఒక మరణానికి కారణాలను ఒక్క అంశానికే పరిమితం చేయలేం. అయితే ఆ లేఖలో ప్రస్తావించిన ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన క్షేత్రస్థాయి రాజకీయ కార్యకర్తల పరిస్థితిపై చర్చ అవసరమని చెబుతున్నాయి.

గ్రామ, మండల స్థాయిలో కొందరు తమ వృత్తి, వ్యాపారం, వ్యవసాయం కొనసాగిస్తూ రాజకీయాల్లో పాల్గొంటారు. మరికొందరు పూర్తికాలం ప్రజలకు, పార్టీకి అంకితమవుతారు. స్థిరమైన ఆదాయం లేనప్పుడు రెండో వర్గం పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. ఉదయం నుంచి ఫోన్లు మోగుతూనే ఉంటాయి. భూ వివాదం, రేషన్‌కార్డు, పింఛన్‌, పోలీస్‌స్టేషన్‌ పని, దవాఖానలో సహాయం అంటూ ప్రజలు ఆశ్రయిస్తారు. సమస్య పరిష్కారానికి తిరుగుతూ సొంత పనులను వాయిదా వేస్తుంటారు. ఆదాయం తగ్గినా బాధ్యతలు మాత్రం తగ్గవు.

పార్టీ సమావేశాలు, ధర్నాలు, కార్యకర్తల శుభకార్యాలు, పరామర్శలు, పండుగల విరాళాలు, క్రీడాపోటీల బహుమతులు, ఫ్లెక్సీలు, జనసమీకరణకు ఖర్చులు అదనం. రోజంతా తిరిగి ఇంటికి చేరేసరికి పిల్లలు నిద్రపోతారు. మరుసటి రోజూ అదే పరుగు. సేవకు పనిగంటలు ఉండవు; ఖర్చుకు పరిమితి కనిపించదు. చేసిన వ్యయానికి ప్రతిఫలం వస్తుందన్న హామీ ఉండదు. అయినా కార్యక్రమానికి వెళ్లకపోతే పలుకుబడి తగ్గుతుందనే భయం వెంటాడుతుంది. క్రమంగా ప్రజాసేవతోపాటు రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవడం కూడా భారంగా మారుతుంది.

వార్డు సభ్యుడు, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, సొసైటీ చైర్మన్‌, పార్టీ అధ్యక్షుడు కావాలన్న ఆశ తప్పుకాదు. కానీ పదవి పొందాలంటే ముందుగా డబ్బు ఖర్చు చేయాలనే సంస్కృతి ప్రమాదకరం. పెద్ద నాయకుడి గుర్తింపు కోసం, ప్రత్యర్థికంటే బలంగా కనిపించేందుకు స్థోమతకు మించి వెచ్చించడం మొదలవుతుంది. ప్రజల విశ్వాసంలో జరగాల్సిన పోటీ ఖర్చులోకి మారుతుంది. ఒకరు వందమందిని సభకు తీసుకెళ్తే మరొకరు రెండొందలమందిని తరలించాలనే పట్టుదల చివరకు కుటుంబాలపై భారం మోపుతుంది.

పదవి ఆశలో అప్పుల భారం

జగన్‌ ఉదంతాన్ని ఒక్క వ్యక్తి కథగా చూడలేం. రాజకీయాల కోసం భూములు అమ్ముకున్నవారు, కుటుంబ ఆస్తులు కరిగించినవారు, అప్పులతో వలసబాట పట్టినవారు ఉన్నారు. పిల్లల చదువుకు దాచాల్సిన సొమ్మును రాజకీయ పరువు కోసం ఖర్చు చేస్తున్నవారూ ఉన్నారు. బయట నాయకులుగా గుర్తింపు ఉన్నా ఇంట్లో అవసరాలకు డబ్బు సర్దలేని పరిస్థితి. సంపాదనకు మరో మార్గమున్నవారు కొంత తట్టుకుంటారు. రాజకీయాలపైనే ఆశలు పెట్టుకున్నవారు మరింత ఇబ్బందిపడతారు. అప్పుల వడ్డీ వారి స్వేచ్ఛనూ హరిస్తుంది.

మధ్యలో వెనక్కి తగ్గుదామంటే ఇన్నేళ్ల శ్రమ, పెట్టిన డబ్బు వృథా అవుతాయన్న భావన అడ్డుకుంటుంది. వచ్చే అవకాశమైనా తనదేనన్న ఆశతో మరింత ఖర్చు చేస్తారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనే ప్రయత్నంలో కొత్త అప్పులు చేరతాయి. రాజకీయ ఎదుగుదలకు నిరీక్షిస్తూ వ్యక్తిగతంగా నిలదొక్కుకోవాల్సిన సమయాన్ని కోల్పోతారు. ఉపాధి వెతకాల్సిన వయసులో సమావేశాలు, వ్యాపారం చూసుకోవాల్సిన సమయంలో నాయకుల వెంట ప్రయాణాలు జీవితాన్ని ఆక్రమిస్తాయి. కాలం గడిచినా ఆర్థిక స్థిరత్వం మాత్రం దూరంగానే ఉంటుంది.

సోషల్‌ మీడియా ఈ ఒత్తిడికి మరో పొరను జోడించింది. సేవ చేయడమే కాకుండా ప్రతిరోజూ చేస్తున్నట్లు కనిపించాలనే పోటీ పెరిగింది. పగలు కార్యక్రమాలు, రాత్రి పోస్టులు, ఫొటోలు, ప్రచారంతో వ్యక్తిగత సమయం కుదించుకుపోతున్నది. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యం, జీవిత భాగస్వామితో సంభాషణ వెనక్కి వెళ్తున్నాయి. సొంత ఆరోగ్యం, విశ్రాంతిపైనా శ్రద్ధ తగ్గుతుంది. రాజకీయ పరిచయాలు విస్తరిస్తున్న కొద్దీ కుటుంబ సంబంధాలు బలహీనపడితే దానిని సమగ్ర ఎదుగుదలగా భావించలేం. ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ప్రజాపనులకు సొంత డబ్బు వెచ్చించి బిల్లుల కోసం ఎదురుచూసే స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితీ ఆందోళనకరమే. సిద్దిపేట జిల్లా మహ్మదాపూర్‌ మాజీ సర్పంచ్‌ పిట్టల సంపత్‌ మరణం నేపథ్యంలో పెండింగ్‌ బిల్లుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రజాపనులకు వ్యక్తులు అప్పులు చేసి ముందుగా నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి ఎందుకు? పూర్తయిన పనులకు చెల్లింపులు సకాలంలో ఎందుకు జరగవు? స్థానిక పాలనలో ఆర్థిక బాధ్యతలను స్పష్టంచేసి, ప్రజాప్రతినిధుల కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వ్యవస్థాగత మార్పులు చేయాలి.

రాజకీయాలపై ఇంత మక్కువ ఎందుకు?

ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందకపోవడం రాజకీయ మధ్యవర్తిత్వానికి ప్రధాన కారణం. పని కోసం ప్రజలు నాయకుడిని ఆశ్రయిస్తారు. అధికారులతో మాట్లాడి పని చేయిస్తే అతనిపై నమ్మకం పెరుగుతుంది. తన ప్రమేయం లేకుండా పనులు జరగవన్న భావన నాయకుడిలోనూ ఏర్పడుతుంది. దీనికి పదవి, పలుకుబడి, సామాజిక గౌరవం, ఎన్నికల్లో అవకాశం వస్తుందనే ఆశ తోడవుతాయి. అందువల్ల సమస్యను వ్యక్తిగత మక్కువకే పరిమితం చేయలేం. ప్రభుత్వ సేవల అందుబాటును మెరుగుపరచడం కూడా పరిష్కారంలో భాగమే.

కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రజాసేవ

నాయకుడు బయటకు వెళ్లినప్పుడు ప్రజలు చూస్తారు; ఇంట్లో కుటుంబం ఎదురుచూస్తుంది. పిల్లల వయసుతోపాటు విద్యా ఖర్చులు, తల్లిదండ్రుల వైద్య అవసరాలు పెరుగుతాయి. పదవి కోసం నిరీక్షించవచ్చు; జీవితం మాత్రం ఆగదు. ప్రజాసేవ అవసరమే, గ్రామాలకు నాయకత్వమూ అవసరమే. అయితే కుటుంబ అవసరాలను పక్కనపెట్టి, పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టడం అనివార్యమైన త్యాగంగా భావించకూడదు. ఆర్థిక పరిమితులు నిర్ణయించుకోవడం బలహీనత కాదు. దీర్ఘకాలం ప్రజల మధ్య పనిచేయడానికి అవసరమైన భద్రత అది.

మారాల్సింది కార్యకర్త మాత్రమే కాదు; పార్టీలు, ప్రజలు, ఓటర్లూ మారాలి. ఎవరు ఎంత ఖర్చు చేశారన్నదానికంటే ఎవరు ఎంత పనిచేశారన్నది ముఖ్యం కావాలి. పార్టీ కార్యక్రమాల వ్యయాన్ని కిందిస్థాయి నాయకుల వ్యక్తిగత బాధ్యతగా మోపకూడదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను గుర్తించి సహాయం అందించాలి. ప్రజలు కూడా ప్రతి కార్యక్రమానికి నాయకుడే డబ్బు ఇవ్వాలనే అంచనాను సమీక్షించుకోవాలి. సేవకు విలువనిచ్చే రాజకీయ సంస్కృతి పెరిగినప్పుడే సామాన్యులకు నాయకత్వ అవకాశాలు నిలుస్తాయి.

ప్రతి కార్యకర్త స్థిరమైన జీవనోపాధిని కాపాడుకోవాలి. రాజకీయ ఖర్చులకు కుటుంబంతో చర్చించి పరిమితి పెట్టుకోవాలి. అప్పుతో పరువు నిలబెట్టుకోవాలనే ఒత్తిడిని తిరస్కరించాలి. తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఒంటరిగా మోయకుండా విశ్వసనీయుల సహాయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, సహచరులు కూడా ఆవేదనను వినాలి; అవసరమైన తోడ్పాటును అందించాలి. కష్టాన్ని చెప్పుకోవడానికి సంకోచం లేని వాతావరణం పార్టీల్లో ఉండాలి. కార్యకర్తల క్షేమం కూడా సంస్థాగత బాధ్యతేనని నాయకత్వాలు గుర్తించాలి.

ఎన్నిక ముగుస్తుంది, పదవి మారుతుంది, ఫ్లెక్సీ చిరిగిపోతుంది. అప్పు మాత్రం మిగులుతుంది. పిల్లలతో గడపని బాల్యం, కుటుంబానికి ఇవ్వని సమయం తిరిగిరావు. అందుకే రాజకీయాల్లో ఎదుగుతున్నానా, లేక ఆ ప్రయాణంలో కుటుంబ భద్రతను కోల్పోతున్నానా అని ప్రశ్నించుకోవాలి. తెల్ల చొక్కా వెనుక కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి. ప్రజాసేవను స్థోమతలో కొనసాగించాలి. పదవిని ఆశించవచ్చు; జీవితాన్ని పణంగా పెట్టకూడదు. రాజకీయాలు జీవితంలో భాగంగా ఉండాలి, మొత్తం జీవితాన్ని మింగేయకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *