రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

  • రెండు డీఏల విడుదలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
  • 235 మండలాల్లో కరువు పరిస్థితులు.. అఖిలపక్ష భేటీకి నిర్ణయం
  •  కొత్తగా 7,800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్య పెంపు..
  • సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్ , ప్రజాప్రతంత్ర, అక్టోబర్1: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ( State Cabinet ) సమావేశం (కేబినెట్ భేటీ) అత్యంత కీలక నిర్ణయాలతో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ డిమాండ్, ధాన్యం కొనుగోళ్లు, నూతన ప్రాజెక్టులు తదితర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి స్పష్టమైన విధివిధానాలను ఖరారు చేసింది.

ఉద్యోగులకు డీఏల ఊరట:

2024  నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లిస్తారు.   ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది.

కరువు పరిస్థితులు 

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసిందని, రాష్ట్రంలో దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేబినెట్ చర్చించింది. కరువు పరిస్థితులపై చర్చించేందుకు త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రానికి తగిన సాయం కోరేందుకు త్వరలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది.
ఖరీఫ్ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించారు.

 కొత్త విద్యుత్ ప్రాజెక్టులు

ఎల్‌నినో పరిస్థితులు, ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్లకు చేరినట్లు కేబినెట్ గుర్తించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ , 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.

మరిన్ని కీలక నిర్ణయాలు:

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, ప్రయోజనం లేని 10 అసంపూర్తి ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో డిజిటల్ మీడియా సంస్థలకు ప్రత్యేక అడ్వర్టైజింగ్ పాలసీని తీసుకురానున్నారు.
దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుతో పాటు, సమన్వయం కోసం నలుగురు గ్రూప్-1 అధికారులను నియమించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *