“దేశానికి వెన్నెముక యువతే” అంటారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి కేవలం యువతకే ఉంది. గాంధీజీ ఆశించిన శాంతియుత, స్వయంసమృద్ధి గల, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణం కేవలం నినాదాల వల్లే సాధ్యం కాదు. యువత తమలోని సోమరితనాన్ని, స్వార్థాన్ని విడనాడి, దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈ గాంధీ జయంతి రోజున మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం… బాపూజీ కలల సాకారానికి సైనికులా అడుగులు వేద్దాం!
గాంధీజీ ఆశయాల నుంచి వికసిత్ భారత్ 2047 వరకు
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా

గాంధీజీ తన యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కానీ నేటి తరం యువతీయువకులు పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి, బాధ్యతలను విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. లక్ష్యం లేని జీవితం, సోషల్ మీడియా వ్యసనాలు, క్షణికానందాల కోసం కాలాన్ని వృథా చేయడం నేడు సర్వ సాధారణమైపోయింది. గాంధీజీ నమ్మిన శ్రమదానం, సామాజిక సేవ, స్వదేశీ భావన వంటి విలువలు నేడు మరుగున పడుతున్నాయి. చేతిలో డిగ్రీలు ఉన్నా సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత, నైతికత లోపించడం దేశ భవిష్యత్తుకు పెద్ద సవాల్‌గా మారుతోంది.
యూత్ దశ మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో నేర్చుకున్న విద్య, సంపాదించుకున్న నైపుణ్యాలే జీవితాంతం నిలబడతాయి. కానీ దీన్ని విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: ఆర్థిక అభద్రత: సరైన విద్య, ఉపాధి లేకపోవడం వల్ల భవిష్యత్తులో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతుంది. మానసిక ఒత్తిడి: ఏపనీ చేయకుండా ఖాలీగా ఉండటం వల్ల మానసిక ఆందోళన, నిరాశ నిస్పృహలు పెరిగే ప్రమాదం ఉంది. సమాజంపై భారం: దేశ మానవ వనరులు వృథా కావడంతో పాటు, దేశ ఆర్థిక పురోగతికి ఇది పెద్ద అవరోధంగా మారుతుంది.
గాంధీజీ కేవలం మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన నాయకుడు మాత్రమే కాదు; ఆయనో గొప్ప దార్శనికుడు. ఆయన కేవలం రాజకీయా స్వరాజ్యాన్నే కోరుకోలేదు. గ్రామాలు స్వయంసమృద్ధి సాధించాలని, కులమత భేదాలు లేని సమసమాజం ఏర్పడాలని, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని ప్రజలు గడపాలని ఆయన కలలు కన్నారు. నేడు ఆ ‘గ్రామ స్వరాజ్యం’, ‘రామరాజ్యం’ కలలు సాకారం కావాలంటే దేశ యువత తీవ్రంగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది.
చదువును కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడానికి మాత్రమే పరిమితం చేయకూడదు. విద్య అంటే ఆలోచించే శక్తి. ప్రశ్నించే స్వభావం. సమస్యను పరిష్కరించే సామర్థ్యం. మంచి చెడులను గుర్తించే వివేకం. సమాజం పట్ల బాధ్యత. అందుకే విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు జీవిత చరిత్రలు, విజ్ఞాన పుస్తకాలు, వార్తాపత్రికలు, మంచి వ్యాసాలు, పరిశోధనా రచనలు చదవాలి. పుస్తకం మనిషికి జ్ఞానాన్ని ఇస్తే, పఠనం ఆ జ్ఞానాన్ని ఆలోచనగా మార్చుతుంది. ఆలోచన లక్ష్యాన్ని సృష్టిస్తుంది. లక్ష్యం క్రమశిక్షణను పెంచుతుంది. క్రమశిక్షణ చివరకు విజయానికి దారి తీస్తుంది. యువతను విమర్శించడం మాత్రమే పరిష్కారం కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు కూడా యువతకు సరైన దిశ చూపాలి.
చదువు కోసం ఉపయోగించే డిజిటల్ వనరులు, ఆన్‌లైన్ కోర్సులు, ఈ-పుస్తకాలు, విద్యా వీడియోలు వంటి వాటిని ప్రోత్సహించాలి. అదే సమయంలో వినోదం కోసం స్క్రీన్ వినియోగానికి పరిమితులు ఏర్పరచుకోవాలి. చదువు కోసం ఉపయోగించే డిజిటల్ వనరులు, ఆన్‌లైన్ కోర్సులు, ఈ-పుస్తకాలు, విద్యా వీడియోలు వంటి వాటిని ప్రోత్సహించాలి. అదే సమయంలో వినోదం కోసం స్క్రీన్ వినియోగానికి పరిమితులు ఏర్పరచుకోవాలి. అంటే పరిష్కారం “టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం” కాదు; “టెక్నాలజీపై నియంత్రణ సాధించడం.”
ప్రతి విద్యార్థి లక్ష్యం, సమయపాలన, మొబైల్ నియంత్రణ, పుస్తక పఠనం, రోజువారీ ఆత్మపరిశీలన, ఈ ఐదు విషయాలను పాటించగలిగితే మార్పు సాధ్యమే.
యువత మారితే… దేశం మారుతుంది, యువతను తప్పుపట్టడం సులభం. కానీ యువతలోని శక్తిని సరైన దిశలో మళ్లించడం సమాజం బాధ్యత.
యువతకు జీవితం ఎంతో విలువైన అవకాశం. ఆ అవకాశాన్ని రీల్స్‌లో స్క్రోల్ చేస్తూ, నిరర్థకమైన చర్చల్లో, అంతులేని వినోదంలో కరిగించకుండా, జ్ఞానం సంపాదించడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి, భవిష్యత్తును సృష్టించుకోవడానికి ఉపయోగించాలి.
డిగ్రీ కోసం కాదు… జ్ఞానం కోసం చదవాలి, విద్యార్థి చదువు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడానికి మాత్రమే కాదు. చదువు: ఆలోచించే శక్తిని పెంచాలి. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచాలి. ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించాలి. కొత్త ఆలోచనలను సృష్టించేలా చేయాలి. సమాజం పట్ల బాధ్యతను కలిగించాలి. దేశ అభివృద్ధిలో తన పాత్రను అర్థం చేసుకునేలా చేయాలి. డిగ్రీ ఒక పత్రం. నైపుణ్యం ఒక శక్తి. జ్ఞానం ఒక సంపద. వికసిత్ భారత్@2047 దిశగా ప్రయాణించాలంటే యువతకు డిగ్రీలతో పాటు డిజిటల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనా సామర్థ్యం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు అవసరం.
రీల్‌లో కనిపించే విజయాన్ని చూస్తూ సమయం గడపడం కంటే, నిజ జీవితంలో విజయాన్ని సాధించడానికి కష్టపడటం ముఖ్యం. ఇతరుల జీవితాలను స్క్రోల్ చేయడం కంటే మన జీవితానికి మనమే ఒక దిశను రూపొందించుకోవాలి. నేటి యువత పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటే—జ్ఞానం పెరుగుతుంది. నైపుణ్యాన్ని నేర్చుకుంటే—ఉపాధి సామర్థ్యం పెరుగుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే—దిశ ఏర్పడుతుంది. సమయాన్ని గౌరవిస్తే—అవకాశాలు పెరుగుతాయి. దేశాన్ని ఆలోచిస్తే—వికసిత్ భారత్ నిర్మాణంలో తన వంతు మొదలవుతుంది. “యువత సమయాన్ని గెలిస్తే… భవిష్యత్తును గెలుస్తుంది.” “నీ ఈరోజు అలవాట్లే… నీ రేపటి భారతదేశాన్ని నిర్మిస్తాయి.”
“దేశానికి వెన్నెముక యువతే” అంటారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి కేవలం యువతకే ఉంది. గాంధీజీ ఆశించిన శాంతియుత, స్వయంసమృద్ధి గల, నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణం కేవలం నినాదాల వల్లే సాధ్యం కాదు. యువత తమలోని సోమరితనాన్ని, స్వార్థాన్ని విడనాడి, దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈ గాంధీ జయంతి రోజున మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం… బాపూజీ కలల సాకారానికి సైనికులా అడుగులు వేద్దాం!





