పార్టీలు పెట్టడం సులభమైపోయింది

– ‘ప్రశిక్షణ్ అభియాన్’లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.. కార్యకర్తల ఐక్యత, సిద్ధాంతం పట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’ను శనివారం నిర్వహించారు. ఈరోజు రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయంటూ పార్టీలు పెట్టడం సులభమైపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. కవిత పార్టీతో తెలంగాణకు ఒరిగేదే
లేదన్నారు. తమ కోసం నిజంగా పని చేసే పార్టీ ఏది అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమాన్ని నిజాయతీగా ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని చెప్పారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేర్లు మారినా పాలన మారలేదు.. రాష్ట్ర సంపదను దోచుకున్న వారే ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి రూ.1000 కోట్లు కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తామని చెబుతున్నారు.. అందులో కనీసం రూ.500 కోట్లు ఉద్యోగుల సంక్షేమానికి కేటాయించాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కీలక సమావేశంలో భాగంగా జిల్లాల స్థాయిలో కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని, మండలస్థాయిలో పొందిన అనుభవాలను జిల్లాస్థాయిలో మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యకర్తలకు సైద్ధాంతిక బోధన, పార్టీ కార్యపద్ధతి, క్రమశిక్షణ, రాజకీయ కార్యాచరణ, భవిష్యత్ రోడ్‌మ్యాప్ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే మండల స్థాయిలో 50 వేల మందికిపైగా కార్యకర్తలు శిక్షణ పొందారన్నారు. ఈ శిక్షణలో పార్టీ నిర్మాణం, సిద్ధాంతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సాంకేతిక అభివృద్ధి వంటి ఏడు ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న విశ్వాసంతో కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *