– పాలేరు ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు
– సమస్య ఎవరు చెప్పినా పరిష్కరించడమే ప్రధానం
– పార్టీలకతీతంగా ప్రజా సేవ
– సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే
– ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి
హైదరాబాద్/నేలకొండపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అన్నిచోట్ల తాగునీరు, విద్యుత్, ధరణి వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు పాలేరును మోడల్ నియోజకవర్గంగా ఎంచుకున్నామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో వినూత్నంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రాయిగూడెం క్లస్టర్ పరిధిలో శనివారం నిర్వహించారు. రాయినిగూడెం, అజయ్‌తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో మంత్రి పొంగులేటి ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఇలాంటి దర్బార్‌లను నిర్వహించడానికి ప్రధాన కారణం అవి ప్రజా విశ్వాసాన్ని చూరగొనడమేనన్నారు. పల్లెలు, తండాలు, గ్రామాలు ఇలా అన్ని స్ధాయిల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే తీర్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించవచ్చు. మరికొన్నింటికి వారం, నెల, లేదా మూడు నెలలు పట్టవచ్చు. అయితే సమస్యలను కూడా గుర్తించే కార్యక్రమం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే అధికారులను ప్రజల వద్దకు పంపించే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చునని, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని చూడం. .అక్కడ కేవలం సమస్య పరిష్కారమే ప్రధానం అని చెప్పారు. అధికారంలో ఎవరున్నా ప్రజా సమస్యలను తీర్చడమే పార్టీల ప్రధాన కర్తవ్యం కావాలి. ఇందుకోసం ప్రతిచోటా సమావేశం జరగాలి. అది ఆ గ్రామానికి, ప్రాంతానికి ఉపయోగపడాలి అని అన్నారు. గతంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక ఇబ్బందులు పడ్డారని, కానీ నేడు అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు వింటున్నారని మంత్రి తెలిపారు. ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు.. నిరంతరం జరిగే ప్రక్రియ. మీ కష్టాలను వినే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టే ధైర్యంగా మీ మధ్యకు రాగలుగుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌ను కేవలం సభలా కాకుండా ప్రతి పంచాయతీకి ఒక క్లాస్‌రూమ్ కేటాయించి అధికారులను కూర్చోబెట్టడం ద్వారా సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. స్పాట్‌లోనే పరిష్కరించే వీలున్న సమస్యలను వెంటనే తేల్చేయాలంటూ అధికారులకు సూచించామన్నారు. ఈనెల 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి సమస్యలను పారదర్శకంగా, వడివడిగా పరిష్కరించి ప్రజలకు మేలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




