– పోచారంలో రూ.600 కోట్లతో ఇన్ఫోసిస్ నూతన డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక కేంద్రంగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని పోచారం ఇన్ఫోసిస్ ప్రాంగణంలో రూ.600 కోట్ల వ్యయంతో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్వేర్ అభివృద్ధి భవనాన్ని (10,000 సీట్ల సామర్థ్యం) శుక్రవారం వారు కలసి ప్రారంభించారు.
హైదరాబాద్‌పై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం: డిప్యూటీ సీఎం భట్టి
నగరంలో ఇప్పటికే 48 వేల మందికి పైగా ఉద్యోగులతో సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్, మరో 10 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవడం హైదరాబాద్‌పై ఆ సంస్థకున్న నమ్మకానికి ప్రతీక అని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ప్రాక్టికల్ అనుభవం అందించాలన్నారు. పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య అనుసంధానం పెంచి, జిల్లాల్లోని కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఐటీ రంగంలో సమాన అవకాశాలు కల్పించాలని ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగవంతమైన పరిపాలన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు పర్యావరణహిత అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం: మంత్రి శ్రీధర్ బాబు
పోచారంలో 450 ఎకరాల్లో విస్తరించిన ఇన్ఫోసిస్ ప్రాంగణ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.3,200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని, కొత్త సెంటర్ రాకతో గ్లోబల్ ఐటీ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ సేవలు భవిష్యత్తు ఐటీ వృద్ధికి కీలకంగా మారతాయని వెల్లడించారు. కొత్త భవనంలో రేడియంట్ కూలింగ్ వ్యవస్థ, స్మార్ట్ లైటింగ్, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి పునర్వినియోగం మరియు సహజ కాంతి వినియోగం వంటి పర్యావరణహిత వసతులు కల్పించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేశ్ సంఘరాజ్కా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు సునీల్ కుమార్ ధారేశ్వర్, రాజనీష్ మాల్వియా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిలాద్రి ప్రసాద్ మిశ్రా, డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ప్రణబ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





