ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్ దే

– పంట వేయొద్దన్న‌ సీఎం అధికారంలో వుండొద్దు
– జిల్లాలో ఒక్క ఎకరానికీ నీరివ్వని బీఆర్ఎస్
– చనఖా–కొరటా ప్రాజెక్టులో భారీ అవినీతి
– సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తున్నాం
– రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీలనే నిలబెట్టాం
– ఆదిలాబాద్ పొంచజన్య సభలో కవిత

ఆదిలాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ఆదివాసీల దీవెనలు ఉండాలని..మీ ఆశీర్వాదం కోసమే ఈ జిల్లాకు వచ్చామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పాంచజన్య సంకల్ప సభల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి వద్ద నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. పంటలు కాపాడుకునేందుకు మీటింగ్ పెట్టుకోవాలనుకున్న ఆదివాసీలను కనికరం లేకుండా పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.తెలంగాణ సాధించుకోని 12 ఏళ్లు అవుతున్న సరే ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి లేదని, 750 ఊళ్లలో కనీసం స్కూల్స్ లేని పరిస్థితి ఉందన్నారు. తలసరి ఆదాయంలో ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో రోడ్లు, ప్రాజెక్ట్ లు, అభివృద్ధిని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యం చేశాయన్నారు.  12 ఏళ్లుగా తుమ్మడి హెట్టి ప్రాజెక్ట్ పేరుతో ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మురిపించాయే తప్ప చేసేందేమీ లేదన్నారు. కాగజ్ నగర్ లో కాగజ్ నగర్ లో లక్షా 5 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే 6 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఏళ్లకు ఏళ్లుగా ప్రాజెక్ట్ లను పెండింగ్ పెట్టారన్నారు. తుమ్మిడి హెట్టిని పూర్తి చేసి ఉంటే రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు. చరిత్రలో రైతులను పంటలు వేయవద్దని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని కవిత అన్నారు. వ్యవసాయం మాత్రమే తెలిసిన రైతులను పంటలు వేయవద్దంటున్న ముఖ్యమంత్రి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఇంద్రవెల్లి వీరులకు రూ. 25 లక్షలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి వీరులను కూడా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు.
ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ గర్జన సభ నిర్వహిస్తామని చెబుతోందని, కానీ వారిది గర్జన కాదు, తర్జన భర్జన అని కవిత ఎద్దేవా చేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్..పత్తి ఎక్కువగా పండే ఆదిలాబాద్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయకపోవటానికి కారణం ఏంటన్నారు. చనఖా కొరటా ప్రాజెక్ట్ లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. రూ. 368 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ను ఏకంగా 2100 కోట్లకు పెంచారని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధించటమే టీఆర్ఎస్ లక్ష్యమని..ఆ లక్ష్యం దిశగా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని కవిత చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు స్థానాలను తమ పార్టీ బీసీలకే ఇచ్చిందన్నారు.  ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు, జిల్లా ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోగానే ముందుగా ముత్నూర్ లో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంద్రవెల్లిలోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి ప్రత్యేక బస్సులో సభ ప్రాంగణానికి అభిమానుల కేరింతలు, నృత్యాలు, డప్పుల కొలహలం మధ్య ర్యాలీగా తరలి వెళ్లారు. దారి పొడువునా ఆదివాసీలు కవితకు స్వాగతం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *