పర్యావరణ కోసం శాస్త్రాల సమన్వయం అవసరం 

– డాక్ట‌ర్‌ చంద్రశేఖర్కా, కతీయ విశ్వవిద్యాలయం
కాళోజి జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : భూగ్రహ శ్రేయస్సు, మానవాళి మనుగడ కోసం అన్ని శాస్త్రాల మధ్య సమన్వయం, అంతరశాఖ పరిశోధనలు, పరస్పర చర్చలు అవసరమని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పూర్వ డైరెక్టర్ డా. శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి కొనసాగితే 2075 నాటికి మానవుల జీవన ప్రమాణం 120 సంవత్సరాలకు చేరుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన ఫార్మసీ విభాగ విశ్రాంత ఆచార్యులు, విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య వి. మల్లారెడ్డి గౌరవార్థం ఏర్పాటు చేసిన తొలి ఎండోమెంట్ లెక్చర్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సగటు ఆయుర్దాయం సుమారు 40 సంవత్సరాలు ఉండగా ప్రస్తుతం 70 సంవత్సరాలు దాటిందన్నారు. వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతి మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేసినప్పటికీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను కూడా పెంచిందన్నారు. గ్లోబల్ వార్మింగ్, శిలాజ ఇంధనాల వినియోగం, పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. ప్లాస్టిక్ భూగ్రహానికి పెను ముప్పుగా మారిందని, ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగకరమైన ముడి పదార్థాలుగా మార్చేందుకు డీ పాలిమరైజేషన్ ప్రక్రియను ప్రోత్సహించాలని సూచించారు. ‘వ్యర్థాల నుంచి సంపద విధానాన్ని విస్తృతం చేయాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలని అన్నారు. మన ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు కూడా పర్యావరణ మార్పులపై ప్రభావం చూపుతాయని వివరించారు. వైద్య రంగంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సా విధానాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని, గుండె శస్త్రచికిత్సలు, స్టెంట్ల వినియోగం వంటి ఆధునిక సాంకేతికతలు ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో అవయవ మార్పిడి, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వంటి రంగాల్లో మరిన్ని పురోగతులు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని శాస్త్ర విభాగాల మధ్య సమన్వయంతోనే స్థిరమైన భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి ప్రారంభోపన్యాసంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో మానవుల సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు కూడా పెరుగుతున్నాయన్నారు. పర్యావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని, మానవుల ఆయుర్దాయాన్ని నిర్ణయించడంలో జన్యుపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఆచార్య వి. మల్లారెడ్డి ఫార్మసీ కళాశాల అభివృద్ధికి, విశ్వవిద్యాలయానికి అందించిన సేవలను కొనియాడారు. రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ, ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పూర్వ విద్యార్థుల సహకారంతో బంగారు పతకాలతోపాటు నాలుగు ఎండోమెంట్ లెక్చర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆచార్య వి. మల్లారెడ్డి, ఆచార్య డి. రాంబాబు, ఆచార్య సి.కె. కోకటే గౌరవార్థం, దివంగత ఆచార్య వై. మధుసూదన్ రావు స్మారకార్థం ఈ ఉపన్యాసాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎండోమెంట్ లెక్చర్ బాధ్యులు ఆచార్య బి. విజయకుమార్ మాట్లాడుతూ, ఆచార్య వి. మల్లారెడ్డి 45 మంది పరిశోధక విద్యార్థులు ఈ ఎండోమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆచార్య వి. మల్లారెడ్డి జీవిత విశేషాలను విశ్రాంత ఫార్మసీ ఆచార్యులు ఆచార్య ఎం. సారంగపాణి సభకు పరిచయం చేశారు. అనంతరం ఆచార్య వి. మల్లారెడ్డి దంపతులను విశ్వవిద్యాలయం తరఫున శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ముఖ్య వక్త డా. చంద్రశేఖర్‌ను కూడా విశ్వవిద్యాలయం తరఫున సత్కరించారు. విశ్రాంత సీనియర్ ఆచార్యులు ఆచార్య ఎస్.ఎం.రెడ్డి, ఆచార్య వి.మల్లారెడ్డి పరిశోధక విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య గార్లపాటి అచ్చయ్య, డీన్ ఆచార్య ఎన్. ప్రసాద్, ఆచార్య వి. కిషన్, ఆచార్య రవీందర్, ఆచార్య సంజీవ రెడ్డి, ఆచార్య సోము శ్రీహరి, ఆచార్య సదానందం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————-తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *