‘‘యాదగిరి గుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు, భక్తకోటికి తెలిసిన ఆత్మీయ స్థలం, దివ్యక్షేత్రం. అనాది నుంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్ర మయినది. పరమ ఉత్కృష్టమయినది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పేరు వినగానే, యాదగిరి లక్ష్మినరసింహాస్వామిని దర్శించగానే కన్నుల ముందు కన్పించేది తెలంగాణ స్వరూపం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ అస్తిత్వం..’’
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(మార్చి 1-11) సందర్బంగా …
పంచాననోద్భూత పావక జ్వాలల భూనభోంతర మెల్ల బూరితముగ
దంష్ట్రాంకురాభీల ధగధగాయితదీప్తి నసురేంద్రు నేత్రము లంధములుగ
గంటక సన్నిభోత్కటకేసరాహితి నభ్ర సంఘము భిన్నమై చరింప
బ్రళయాభ్ర చంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖణోచులు గ్రమ్ముదేర
వటలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడిరచి లంఘించి చేతనొడిసి
పట్టె నరసింహుడా దితి పట్టి…!
‘ఇందుగల డందులేడని సందేహమువలదు చక్రి సర్వరోపగతుండు’ అని ప్రహ్లాదుడు అన్న మాట నిజమని నిరూపించడానికి ఒక స్తంభములో వన సింహావతారము ఆవిర్భవించిన దైవ సంఘటనను బమ్మెర పోతన మహాకవి వర్ణించిన తీరు ఇది. ఈ వర్ణనలో, మహాభాగవత కల్పతరువు, లలితక్కుధము, కృష్ణమూలము, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు రచనలో, ఆవిష్కరణలో పోతనకు పోతనే సాటి. పోతనామాత్యుని మహోన్నత స్థానాన్ని మరొకరు ఆక్రమించలేరు. ఆయన మహర్షి. మను జేశ్వరాధములను వినయగర్వంతో తృణీకరించిన మహాపురుషుడు ఆయన. కనుకనే పురుషోత్తముడు స్వయంగా దిగివచ్చి భక్తకవి పోతన చేత శ్రీమద్భాగవతము పలికించినాడు.
బమ్మెర పోతనకు సాక్షాత్కరించిన మహోజ్వల నరసింహుడు యాదగిరి పల్లెగుట్టపై ఆసీనుడయి శాంతించినాడు. బమ్మెరకు దగ్గరి ఊరు పల్లె యాదగిరి. తాత ముత్తాతల కాలం నుంచి వింటున్నాం యాదగిరి పల్లె గురించి, యాదగిరి గుట్ట గురించి. యాదగిరి గుట్టపై ఒక చిన్న గుహలో నారసింహుడు వెలసి కొన్ని వందలు, వేల సంవత్సరాలయి ఉంటుంది. కొన్ని యుగాలయి ఉంటుంది. ‘‘కృతేతు నరసిం హెరీభూత్, త్రేతాయం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వేంకటనాయక…’’ అని అన్నారు. యాదగిరి గుట్ట తరతరాల నుంచి తెలంగాణ లక్షలాది సామాన్య ప్రజలకు, భక్తకోటికి తెలిసిన ఆత్మీయ స్థలం, దివ్యక్షేత్రం. అనాది నుంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకలలో పవిత్ర మయినది. పరమ ఉత్కృష్టమయినది యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట పేరు వినగానే, యాదగిరి లక్ష్మినరసింహాస్వామిని దర్శించగానే కన్నుల ముందు కన్పించేది తెలంగాణ స్వరూపం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ అస్తిత్వం. పండితులు, పరమహంసలు, పరివ్రాజకులు ఇంకే పేరు పెట్టినా, ఇంకే నామకరణం చేసినా, పాలకులు ఎన్ని శాసనాలు జారీ చేసినా ప్రజల గుండెలలో నిలిచేది ఒక్కటే- అది యాదగిరి గుట్టే, యాదగిరిపల్లె. పాలకుల శాసనాలు శిధిలం కావొచ్చు కాని ప్రజల హృదయాలలో హత్తుకున్న పేరు (యాదగిరి గుట్ట) చెరిగిపోదు ఒక పల్లెగానే యాదగిరి గుట్ట భక్త కోటిని ఆకర్షించింది.
ఆధునిక సదుపాయాలు లేకపోయినా యాదగిరి గుట్ట దివ్యత్వం తరుగలేదు. ఆధ్యాత్మిక తేజస్సు యాదగిరి గుట్టలో హెచ్చిందే గాని తగ్గలేదు. ఎక్కడ ఎన్ని కొండలున్నాయో గాని, భక్తజనావళికి ఒక దివ్యధామంగా కన్పిస్తున్నది ఒకే ఒక కొండ- అది యాదగిరి గుట్ట. ఆ రోజులు మరపురానివి – తెలంగాణా నలుమూలల నుంచి ఒక పాసెంజర్ రైలులోనో లేక బస్సులోనో, ఇంకేదయినా వాహనంలోనో రాత్రిగాక ముందే భక్తులు రాయగిరి చేరేవాళ్ళు . సమీపం లో ఉండే రాయగిరి స్టేషన్ ఆ సమయానికి నిర్మానుష్యం. రాయగిరి స్టేషన్ ప్లాట్‌ఫామ్ మీద కొన్ని గంటలు ఆ రాత్రి గడిపి తెల్లారక ముందే టాంగాలలో యాదగిరి చేరేవాళ్ళు. పల్లె వాతావరణం స్పష్టంగా, కాలుష్యరహితంగా, సహజ రామణీయకతలో సొగసులను విరజిమ్మేది. గుట్ట పైకి వెళ్లడానికి (వాహనాలలో) రోడ్డులేని రోజులవి. మూటలు, ముల్లెలు, సంచులు పట్టుకుని మెట్లమీదికి నడువడం యాదగిరీంద్రుని దివ్యదర్శనం కోసం రాత్రంతా నిద్రలేక అలసి సొలిసి కొండ మెట్లమీద నడిచినప్పుడు ఆయాసం అన్పించకపోయేది. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరు కాలినడకన గుట్ట ఎక్కే వాళ్లు. గుట్ట ఎక్కడంలో అదొక ఆనందం, ఉత్సాహం ఏదో ఘనకార్యం – సాధించిన అనుభూతి. గుట్ట ఎక్కిన పిదప సత్రాలలో గదుల కోసం అన్వేషణ, ప్రయత్నాలు.
కొన్ని సమయాలలో గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద క్యూలలో ఉత్కంఠ – గదుల కోసం ఎంతసేపు. ఎన్ని గంటలు ఓపికతో నిరీక్షించవలసి వస్తుందోనన్న ఆందోళన. ఇదంతా సామాన్యుల సంగతి. గుట్ట మీద తిండి, టిఫిన్ల హోటళ్లు గూడ ఉండకపోయేవి. చాలా మంది గదులలో ఎవరి వంటలు వాళ్లు చేసుకునేవాళ్లు. తెల్లారకముందే, గుట్ట మీద బాల భానుకి రణాలు ప్రసరించకముందే చుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి పాలు, పెరుగు, కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తుండేది. చన్నీళ్ల స్నానం చేయలేని భక్తులకు వేడినీళ్లను బకెట్లతో ఇచ్చే కట్టెలపో యిలు కన్పించేవి. ఇంత కష్టపడుతున్నది దేని కోసం? ఎన్నడో స్తంభంలో అవతారమెత్తి రాక్షస బాలుడు భక్త ప్రహ్లాదుని రక్షించి, యాదగిరిగుట్టపై ఒక మూల గుహలో నారసింహుని దివ్యదర్శనం కోసం యాదగిరీందుని దర్శన భాగ్యంతో తమ కోర్కెలు నెరవేరినాయని అమిత సంతృప్తితో వివరించే భక్తులు అసంఖ్యాకులు. సహజ ప్రకృతి సౌందర్యంతో, అనిర్వచనీయ గాంభీర్యంతో, అక్షరాలకు అందరి ఆధ్యాత్మిక అనుభూతిని, స్ఫూర్తిని, భక్తిని, ముక్తిని కల్గిస్తూ భక్తకోటిని పరవశింపచేస్తున్న మన యాదగిరిగుట్ట, మన తెలంగాణ నేల మీద దివ్య శిఖరం..తెలంగాణ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే యాదగిరీంద్రుడు భక్తకోటికి ఆరాధ్యుడు. తెలంగాణ ఊరూర కొన్ని వేల క దేవాలయా లున్నాయి.
ఆర్చకులు, నిత్యధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలే వీటిలో ఎక్కువ. భద్రాచలం తదితర దేవాలయాల విలువయిన భూములను సైతం పాపభీతి లేకుండా కబ్జా చేసిన వాళ్లున్నారు. దేవుడి భూములను, ఆస్తులను తిరిగి దేవుడికి అప్పగించడం ( సచివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయకపోయినా, మంత్రులు, అధికారుల వద్దకు వెళ్లి పైరవీలు చేయకపోయినా) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పవిత్ర బాధ్యత.విపరీత ఆధునికత, విలాస అవసరాల పేరిట యాదగిరి గుట్ట తన సహజత్వాన్ని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కోల్పోరాదు. వందల కోట్ల రూపాయల సద్వినియోగంతో యాదగిరిగుట్ట ప్రపంచమంతటిని ఆకర్షించగలిగే పావన ధామంగా రూపొందాలె – ఒక వాణిజ్య, విలాస కేంద్రంగా మారొద్దు. మన యాదగిరి గుట్టను మనమే అభివృద్ధి పరిచామన్న సంతృప్తి, గౌరవం, గర్వం తెలంగాణ ప్రజలకు మిగిలి ఉండాలె.