– జవాబుదారీతనం మాత్రం శూన్యం
– రాజ్యాంగ సంస్థలపై రాహుల్ దుష్ప్రచారం మరోసారి బట్టబయలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ప్రజల్లో వాటిపై అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేయడం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక అలవాటుగా మారిపోయిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కనీసం చట్టపరమైన వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, ఎలాంటి ఆధారాలు పరిశీలించకుండా తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఇచ్చిన స్పష్టమైన వివరణతో రాహుల్ దుష్ప్రచారం బట్టబయలైందన్నారు. రాజకీయంగా తనకు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, రాజ్యాంగ సంస్థలను అనుమానాల నీడలోకి నెట్టడం ఆయనకు ఒక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘చౌకీదార్ చోర్ హై’ అనే తన రాజకీయ నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదించే ప్రయత్నం చేశారని, దీనిపై క్రిమినల్ కంటెప్ట్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొని చివరకు సుప్రీంకోర్టుకు క్షమాపణ పత్రాన్ని సమర్పించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా మోదీ ఇంటి పేరుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా క్రిమినల్ డిఫమేషన్ కేసులో దోషిగా తేలారన్నారు. ఆ వ్యవహారంలో తీర్పు వెల్లడిస్తున్న సందర్భంలో ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం, అదే ఎన్నికల వ్యవస్థలో కాంగ్రెస్ గెలిచినప్పుడు మౌనంగా ఉండటం, ‘సర’ ప్రక్రియపై నిరాధారమైన ఆరోపణలు చేయడం.. ఇప్పుడు ఫాం-6 విషయంలో మరో అసత్య ప్రచారానికి తెరతీయడం.. ఇవన్నీ కాంగ్రెస్ మార్క్ అబద్ధాల ప్రచార పర్వంలో భాగమేనన్నారు. ఓ ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కంటే.. రాజకీయ ఓటములను జీర్ణించుకోలేని నాయకుడి నిస్సహాయ, నిరాశ, నిస్పృహలతో కూడిన ప్రవర్తనే రాహుల్‌లో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. ఇకనైనా రాహుల్ గాంధీ కల్పిత కుట్రల వెనుక దాక్కోవడం మానుకుని తన రాజకీయ వైఫల్యాలను నిజాయతీగా అంగీకరించాలని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





