విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

. నాణ్యమైన విద్య, పౌష్టికాహారానికి ప్రాధాన్యం
– మునగాలలో రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్
– గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో ‘యంగ్ ఇండియా’ పాఠశాల
– వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పూర్తి కావాలి
– భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశం

సూర్యాపేట/మునగాల, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6 : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ విద్య, పౌష్టికాహార రంగాలలో శాశ్వత మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌కు మంగళవారం శంకుస్థాపన చేసిన మంత్రులు అనంతరం గడ్డిపల్లి గ్రామంలో రూ.200 కోట్లతో చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి సమీక్షించారు.

60 వేల మంది విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం

మునగాల వద్ద నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా సూర్యాపేట జిల్లా పరిధిలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టిక అల్పాహారం, రాగిజావ, పాలు అందించనున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఈ ప్రాజెక్టుకు, మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల విజ్ఞప్తి మేరకు సింగరేణి సంస్థ రూ.9.60 కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించింది. పిల్లలకు పౌష్టికాహారం అందించడం అనేది ఉచిత సంక్షేమం కాదని, అది వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న కీలకమైన పెట్టుబడి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ప్రణాళికతో గడ్డిపల్లి పాఠశాల పూర్తి చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో భాగంగా గడ్డిపల్లి స్కూల్‌ను రూ.200 కోట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాల పిల్లలు ఒకే ప్రాంగణంలో సమగ్రంగా అభ్యసించేలా ఆధునిక తరగతి గదులు, వసతి, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ప్రవేశాలు చేపట్టేలా అధికారులు, నిర్మాణ సంస్థలు వారాల వారీగా ప్రణాళికలు రూపొందించుకుని పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

హుజూర్ నగర్ నియోజకవర్గానికి అగ్రతాంబూలం

ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ విద్యార్థుల హాజరు శాతంతోపాటు విద్యా ప్రమాణాలు పెరుగుతాయని, హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే విద్యాపరంగా అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *