పోలీసుల ఫిట్‌నెస్‌కు క్రీడలే బలమైన పునాది

– సిబ్బందిని క్రీడల వైపు ప్రోత్సహించండి : డీజీపీ ఆనంద్
– 5వ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 ప్రారంభం
– మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు క్లస్టర్లలో పోలీస్ క్రీడల నిర్వహణ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: పోలీసు శాఖలో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, క్రీడా ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి.ఆనంద్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. పోలీస్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల ద్వారా పోలీసు సిబ్బందిలో ఫిట్‌నెస్‌ను పెంపొందించడంతోపాటు రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ జాతీయస్థాయి పతక విజేత ఆర్‌ఎస్‌ఐ గోవిందరెడ్డికి స్పోర్ట్స్ టార్చ్‌ను అందజేశారు. అనంతరం శాంతి, ఐక్యత, క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా తెల్లపావురాలు, రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి విడుదల చేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలకు తమ కమిషనరేట్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. పోలీసింగ్‌లో క్రమశిక్షణ, అంకితభావం, జట్టు భావన, క్రీడా స్ఫూర్తి ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ పోటీలు పోలీసు సిబ్బందిలో పరస్పర సహకారం, శారీరక సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డీజీపీ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీస్ క్రీడలు ఒకే వేదికపై నిర్వహించేవారని, ఈసారి తొలిసారిగా ఐదు క్లస్టర్లుగా విభజించి 21 జట్లతో, 34 ఈవెంట్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరహాలో వివిధ సమయాల్లో వివిధ ప్రాంతాల్లో, వివిధ క్రీడలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పాల్గొనే అవకాశం లభిస్తుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి అఖిల భారత పోలీస్ క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం సులభమవుతుందని పేర్కొన్నారు. అఖిల భారత పోలీస్ గేమ్స్ తరహాలో శాస్త్రీయ ప్రణాళికతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నా మని, ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ, కోచింగ్, ఫిట్‌నెస్ నిర్వహణ సదుపాయాలు కల్పించి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. గత సంవత్సరo అఖిల భారత పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ బృందం 21 పతకాలు సాధించిందని గుర్తు చేస్తూ, రాబోయే పోటీల్లో బంగారు పతకాల సంఖ్యను మరింత పెంచేలా కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా డీజీపీ వివరించారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.3 లక్షల నగదు బహుమతి, మూడు ప్రత్యేక ఇంక్రిమెంట్లు, వెండి పతకం సాధించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి, రెండు ప్రత్యేక ఇంక్రిమెంట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి, ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్ర‌క‌టించారు. ప్రతి యూనిట్‌లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని, క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమయ వృథాగా భావించవద్దని ఉన్నతాధికారులకు సూచించారు. తనకు గోల్ఫ్ ఆడటం ధ్యానం చేసినంత ప్రశాంతతను ఇస్తుందని, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా క్రీడలు తనకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. ‘నేను ఒకరోజు పోలీసింగ్‌ను ఆపవచ్చేమో కానీ క్రీడలు ఆడటం మాత్రం ఎప్పటికీ ఆపను’ అని చేసిన వ్యాఖ్యలు సభలో చప్పట్లతో మార్మోగాయి.

ఐదు క్లస్టర్లలో రాష్ట్ర పోలీస్ క్రీడలు

క్లస్టర్–ఏ: (జూలై) 7,8, 9 నుంచి సరూర్‌నగర్‌లో బాక్సింగ్, రెజ్లింగ్, యోగ , ఫెన్సింగ్‌తో పాటు 14 ఇండోర్ క్రీడలు.
క్లస్టర్–బీ: నవంబర్ 17, 18, 19 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో టీ-20 క్రికెట్ టోర్నమెంట్.
క్లస్టర్–సీ: సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ పోలీస్ అకాడమీలో లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్ తదితర పోటీలు.
క్లస్టర్–డీ: నవంబర్ 3, 4, 5 తేదీల్లో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు.
క్లస్టర్–ఇ: క్యానోయిగ్, రోయింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఆర్చరీ క్రీడలు నిజామాబాద్ కమిషనరేట్ లో నవంబర్ 25-28, 2026 తో ముగియనున్నాయి.

దేవుడి తర్వాత ప్రజల భరోసా పోలీసులే : నవీన్ పోలిశెట్టి
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు నవీన్ పోలిశెట్టి తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది దేవుడు, పోలీసులేనని వ్యాఖ్యానిస్తూ, సమాజం పోలీసులపై ఉంచిన విశ్వాసాన్ని ప్రశంసించారు. తనదైన హాస్యశైలిలో మాట్లాడుతూ, గెలుపు–ఓటములు సహజమని, కానీ పాల్గొనడం, క్రీడా స్ఫూర్తిని కొనసాగించడమే ముఖ్యమని పోలీసు సిబ్బందికి సూచిం చారు.

పోలీసుల క్రీడా స్పూర్తి

రాష్ట్రంలోని వివిధ పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీసు యూనిట్లు, ప్రత్యేక విభాగాలకు చెందిన వందలాదిమంది పోలీసు క్రీడాకారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం బాక్సింగ్, రెజ్లింగ్, ఫెన్సింగ్ తదితర ఇండోర్ క్రీడ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్,, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, ఐజీ (పి & ఎల్) గజారావు భూపాల్, పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది, పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులు, వివిధ కళాశాల విద్యార్థులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *