“హైడ్రా ఒక కల్పన, దానికి నాజీ మూలాలున్నాయనేది మరొక కల్పన. అది పూర్తి స్థాయి కట్టుకథ. రేవంత్ రెడ్డికి ఆ మార్వెల్ కామిక్స్ సిరీస్ గురించి తెలుసునని కూడ అనుకోలేం. ఎక్కడో వినికిడి జ్ఞానంలో అది చేరి ఉంటుంది. ‘చరిత్ర అనవసరం’ అన్న చంద్రబాబు నాయుడి శిష్యరికం, అభూత కల్పనలనే, పుక్కిటి పురాణాలనే చరిత్ర అనుకునే, వాస్తవ చరిత్రను వక్రీకరించే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లో అక్షరాభ్యాసం, ఇటువంటి చరిత్ర పట్ల చిన్నచూపు ఉండే మనిషిని తయారు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.”
‘విరబూసిన ఆపిల్ చెట్ల గురించి రాద్దామనుకుంటాను, కాని జనరల్, తారుపూసిన నీ ఉపన్యాసాలు నా చేత ఈ కవిత్వం రాయిస్తున్నాయి’ అన్నాడు హిట్లర్ ను ఉద్దేశించి రాసిన ఒక కవితలో జర్మన్ కవి బెర్తోల్ట్ బ్రెహ్ట్. ఆపిల్ చెట్లు తెలంగాణలో ఎట్లాగూ లేవు, అసలు ఇప్పుడు విరబూసే చెట్లే లేవు. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోటి నుంచి గ్రీష్మపు వార్తలూ శిశిరపు వార్తలూ వస్తున్నాయి. లక్షలాది మంది శ్రామికులకు “కనీస వేతనాలు” పేరుతో కనీస స్థాయిలో బతకడానికి కూడా సరిపోని జీతభత్యాలను ప్రకటించిన ప్రభుత్వ విధాన ప్రకటన ఔదార్యం మీద ఈ వారం రాద్దామనుకున్నాను. కాని ఈలోగా స్థానిక జనరల్ తారుపూసిన ఉపన్యాసం ఒకటి తోసుకొచ్చింది. ఇక ఆ ఉపన్యాసపు పొట్టవిప్పి పురుగులు చూపక తప్పడం లేదు.
శనివారం నాడు బెంగళూరులో ‘ద హిందూ’ దినపత్రిక నిర్వహించిన సదస్సులో ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క తెలంగాణలో సుపరిపాలన’ అనే అంశం మీద ‘ద హిందూ’ గ్రూపు సంస్థల డైరెక్టర్ ఎన్ రామ్ తో సంభాషణలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ఒక దౌర్జన్యాన్ని ఒక అవాస్తవంతో సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ప్రపంచమంతా అసహ్యించుకున్న, అసహ్యించుకుంటున్న నాజీ నియంత హిట్లర్ ను తాను అభిమానిస్తానని, అనుసరిస్తున్నానని చెప్పుకున్నారు.
మొట్టమొదట ఆయన చెప్పిన అబద్ధం దగ్గర ప్రారంభిద్దాం: “హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం, ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ద్వారా వేగంగా, దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ హైడ్రా అనే పేరు వెనుక మీ ఆలోచన ఏమిటి? దాని మూలం ఏమిటి” లాంటి ప్రశ్న ఎన్ రామ్ అడిగారు. దానికి జవాబుగా, “పేద ప్రజలు చెరువులు, నాలాలు ఆక్రమించారంటే అర్థం చేసుకోవచ్చు. కాని, ధనవంతులు తమ వైభవం కోసం, ఫార్మ్ హౌజుల కోసం నీటి వనరులను ఆక్రమిస్తున్నారు… ఒక బలమైన టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలనుకుని హైడ్రా తీసుకొచ్చాను. హైడ్రా అనే పదం హిట్లర్ కు చాలా ఇష్టమైన పదం. ఎవరినైనా మట్టుబెట్టగల తన కీలక బృందాన్ని ఆయన హైడ్రా అని పిలిచేవారు. నేను హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేశాను…” అని రేవంత్ రెడ్డి జవాబిచ్చారు.
ఇందులో హిట్లర్ కు హైడ్రా అనే మాట ఇష్టం అనేది పచ్చి అబద్ధం. తనకు హిట్లర్ స్ఫూర్తి అనేది తన్నుకొచ్చిన పచ్చి నిజం. హైడ్రా అనే మాట అడాల్ఫ్ హిట్లర్ జీవితంలో ఎక్కడా లేదు. హిట్లర్ నేషనల్ సోషలిస్ట్ పార్టీ (నాజీ పార్టీ), షుట్జ్ స్టాఫే (ఎస్ ఎస్), గెస్టపో, వెహ్ర్ మాక్ట్ లాంటి సంస్థలు నిర్మించాడు గాని, నాజీ జర్మనీ చరిత్రలో హైడ్రా అనేదేమీ లేదు. హిట్లర్ అంతమైన తర్వాత రెండు దశాబ్దాలకు 1960లలో అమెరికాలో మార్వెల్ అనే ప్రచురణ సంస్థ ప్రచురించిన, ఆ తర్వాత తెరకు కూడా ఎక్కిన బొమ్మల కథల – కామిక్స్ – సిరీస్ లో, ‘కెప్టెన్ అమెరికా’ కథల్లో, ‘అవెంజర్’ కథల్లో హైడ్రా అనే రహస్య, ఫాసిస్ట్, సైన్స్ ఫిక్షన్ తీవ్రవాద బృందాన్ని ఆ సిరీస్ రచయితలు సృష్టించారు. ఆ తీవ్రవాద బృందానికి నాజీ మూలాలున్నాయని కల్పన కూడా చేశారు. హైడ్రా ఒక కల్పన, దానికి నాజీ మూలాలున్నాయనేది మరొక కల్పన. అది పూర్తి స్థాయి కట్టుకథ. రేవంత్ రెడ్డికి ఆ మార్వెల్ కామిక్స్ సిరీస్ గురించి తెలుసునని కూడ అనుకోలేం. ఎక్కడో వినికిడి జ్ఞానంలో అది చేరి ఉంటుంది. ‘చరిత్ర అనవసరం’ అన్న చంద్రబాబు నాయుడి శిష్యరికం, అభూత కల్పనలనే, పుక్కిటి పురాణాలనే చరిత్ర అనుకునే, వాస్తవ చరిత్రను వక్రీకరించే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లో అక్షరాభ్యాసం, ఇటువంటి చరిత్ర పట్ల చిన్నచూపు ఉండే మనిషిని తయారు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
“ప్రజాస్వామ్యం” పేరుతో ఊరేగిన పాలనలన్నీ, పాలకులందరూ ఏదో ఒక స్థాయిలో హిట్లర్ అంశ పుణికి పుచ్చుకున్న వారే. చెప్పుకొని కొన్నిసార్లూ, చెప్పుకోకుండా అన్నిసార్లూ హిట్లర్ స్ఫూర్తిని కొనసాగించినవాళ్లే. రేవంత్ రెడ్డి తెలివితక్కువగా, ఒక జాతీయ దినపత్రిక సదస్సులో, ప్రపంచమంతా చూస్తుండగా ఒక అబద్ధమూ, ఒక రాజకీయంగా అపసవ్యమైన మాటా నిర్లజ్జగా బైటపెట్టారు. బహుశా ‘నాతో కలువు’ అని హిట్లర్ పరమావతారం బహిరంగ సభావేదిక మీద ఆహ్వానం పలికాక, ఆధునిక హిట్లర్ తో కలవడంతో పాటు, నిర్జీవ హిట్లర్ స్ఫూర్తిని కూడా ఆవాహన చేయాలని అనిపించినట్టుంది..”
ఎంత అన్యాయంగానైనా, అక్రమంగానైనా ఎదుటివారిని మట్టుపెట్టడం, మట్టి కరిపించడం అనేదే హైడ్రా లక్షణమని, అది హిట్లర్ కు ఇష్టమైనదని, తాను హిట్లర్ స్ఫూర్తితో అది వాడుకున్నానని అనడంలో రేవంత్ రెడ్డి హైడ్రా నిజానిజాలతో ప్రమేయం లేకుండానే, ఎదుటివారిని మట్టి కరిపించడం, హిట్లర్ స్ఫూర్తి అనేవే ప్రధానాంశాలుగా తీసుకున్నారనుకోవాలి. ‘కావాలంటే నా కూల్చివేతల చిత్రాలు గూగుల్ లో చూడండి, గాజాలో ఇజ్రాయెల్ చేసిన పనిని తలపిస్తాయి’ అని తన బీభత్సాన్ని సగర్వంగా చూపుకునే తెంపరితనం కూడా అందరికీ తెలిసినదే.
వీరోచితమైన ప్రజా ఉద్యమాల చరిత్ర ఉన్న తెలంగాణ మాగాణానికి ఏలిక, ప్రజాస్వామిక ప్రభుత్వానికి అధినేత అయిన వ్యక్తి ఇంత బహిరంగంగా తనకు స్ఫూర్తి ప్రదాత హిట్లర్ అని చెప్పుకోవచ్చునా అనేది ప్రశ్న. అసలింతకూ ఆయనకు హిట్లర్ అంటే ఎవరో తెలుసునా?
అడాల్ఫ్ హిట్లర్ చరిత్రకు తెలిసిన అత్యంత దుర్మార్గుడైన, క్రూరుడైన నియంత. అరవై లక్షల మంది యూదులను కేవలం భిన్న మతానికి చెందినవారనే కారణంతో ఊచకోత కోయించిన నరహంతకుడు. భిన్న మతం అని మాత్రమే కాదు, భిన్నంగా కనబడుతున్నారని, ఆలోచిస్తున్నారని, తమ పవిత్ర ఆర్యజాతి భూమిలో ఉండగూడనివారని తాను అనుకున్న ప్రతి ఒక్కరినీ జిప్సీలను, వికలాంగులను, రాజకీయ ప్రత్యర్థులను, స్లావ్ జాతికి చెందినవారిని లక్షలాది మందిని హత్య చేయించాడు. వేలాది మందిని గ్యాస్ చాంబర్లలోకి తోలి, విషవాయువు పంపి మూకుమ్మడిగా మట్టుబెట్టాడు. సామూహికంగా నిలబెట్టి కాల్చి చంపించాడు. నిర్బంధ శ్రమ ద్వారా ఆకలి చావులకు గురి చేసి చంపించాడు. ఆష్విట్జ్, ట్రెబ్లింకా, దాచౌ వంటి కుఖ్యాతి పొందిన నిర్బంధ శిబిరాలు నడిపాడు. యూరప్ దేశాలను ఆక్రమిస్తూ రెండో ప్రపంచ యుద్ధానికీ, అందులో కనీసం ఐదు కోట్ల మంది సైనికుల, ప్రజల మరణాలకూ కారణమయ్యాడు. అసమ్మతి స్వరాలను అణచివేశాడు. కమ్యూనిస్టుల పట్ల, కార్మికుల పట్ల, మహిళల పట్ల అత్యంత దారుణమైన దమన నీతిని అమలు చేశాడు. మానవజాతి అసహ్యించుకోదగిన అటువంటి నేరాలు అనేకం చేశాడు. అటువంటి నరహంతకుడిని ఏ కారణంగానైనా సరే, స్ఫూర్తిగా తీసుకుంటున్నానని చెప్పడం నాగరికతకే, మానవతకే సిగ్గుచేటు. తెలంగాణ ధిక్కార సంస్కృతికి అవమానం.
అయితే హిట్లర్ జీవితపు చివరి దశాబ్దంలోనూ, మరణానంతరం ఎనిమిదిన్నర దశాబ్దాలలోనూ హిట్లర్ ను స్ఫూర్తిగా ప్రకటించిన రేవంత్ రెడ్డి సోదరులు కొందరు లేకపోలేదు. హిట్లర్ మరణానికి ఆరు సంవత్సరాల ముందే 1939లో ‘వి, ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్’ అనే పుస్తకం రాస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ హిట్లర్ మీద ప్రశంసలు గుప్పించాడు. “మైనారిటీలను తొలగించడం ద్వారా జాతి ఔన్నత్యాన్నీ, గర్వాన్నీ, ఐక్యతనూ ఎలా సాధించవచ్చో జర్మనీ చూపింది” అని హిట్లర్ ఊచకోతల గురించి, జాతి నిర్మూలనల గురించి పొగడ్తలు గుప్పించి, అది హిందూ జాతికి ఆదర్శం అని కూడా అన్నాడు. తర్వాత 1966లో వెలువడిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ (తెలుగులో పాంచజన్యం) లో అప్పటి వాతావరణం వల్ల హిట్లర్ పేరు ఎత్తలేదు గాని మైనారిటీల పట్ల హిట్లర్ వైఖరినే కొనసాగించాడు.
అంతకుముందే ఆర్ఎస్ఎస్ మరొక గురువు వినాయక్ దామోదర్ సావర్కర్ 1930ల చివరా, 1940ల మొదట్లోనూ ఇచ్చిన ఉపన్యాసాలలో, రచనలలో హిట్లర్ మీద, హిట్లర్ “జాతీయవాద” విధానాల మీద ప్రశంసలు చేశాడు. హిట్లర్ సంస్థా నిర్మాణాలనూ, పని తీరునూ, భావజాల వ్యాప్తినీ ఆర్ఎస్ఎస్ నాయకులెందరో పొగిడారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన కొద్ది సంవత్సరాలకే, 1931లో హిందూ మహాసభ నాయకుడు, సావర్కర్ గురువు డా. బాలకృష్ణ శివరాం మూంజే ప్రత్యేకంగా ఇటలీ వెళ్లి హిట్లర్ కు సరిజోడి, ఫాసిస్టు పార్టీ స్థాపకుడు, నియంత బెనిటో ముస్సోలినీని కలిశాడు. ఫాసిస్టు పార్టీ యువకులకు ఇస్తున్న సైనిక శిక్షణా సంస్థలను పరిశీలించాడు. హిందూ సమాజాన్ని సైనికీకరించడానికి అటువంటి పద్ధతులే అవలంబించాలని రాశాడు, మాట్లాడాడు. ఇటలీ నుంచి తిరిగి వచ్చాక 1935లో కేంద్రీయ హిందూ సైనిక విద్యా సంస్థ ఏర్పాటు చేసి, భోసలా సైనిక పాఠశాల స్థాపించాడు. ముస్సోలినీ ఫాసిస్టు పార్టీ సైనిక, భావజాల శిక్షణను అనుసరించి ఆర్ఎస్ఎస్ కు శాఖ పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ శాఖలో ఎంతో కొంతకాలం శిక్షణ పొందిన రేవంత్ రెడ్డికి హిట్లర్ మీద అభిమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు.
“తెలంగాణ ప్రజలు హిట్లర్ బతికి ఉన్నరోజుల్లోనే, చనిపోయిన కొత్తలోనే ఒక స్థానిక హిట్లర్ ను “నాజీల మించినవురో” అని సంబోధించి, గోరీ కడతామని హెచ్చరించారు, గోరీ కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినవారు, ఈ మహోజ్వల తెలంగాణ చరిత్రను కాస్తయినా గుర్తుంచుకుంటే మంచిది.”
విడి విడిగా హిట్లర్ అమలు చేసిన క్రమశిక్షణనో, “దృఢ సంకల్పాన్నో”, “జాతీయవాదాన్నో” ప్రశంసించిన బాల్ ఠాక్రే, హిట్లర్ అనుకూల సాంస్కృతిక ప్రదర్శనను మెచ్చుకుని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా సెనేటర్ రాల్ఫ్ బాబే, “ఇవాళ్టి పరిస్థితుల్లో అవసరమైన నాయకుడు” అని ప్రకటించి, తర్వాత విమర్శలతో పొరపాటయిందని నాలిక కరచుకున్న అమెరికన్ రిపబ్లికన్ అభ్యర్థి కార్ల్ పలడినో, “హిట్లర్ కు ఉండినవి సదుద్దేశాలే” అని, ఆ తర్వాత ఆ మాట ఉపసంహరించుకున్న జపాన్ ఆర్థిక మంత్రి టారో ఆసో వంటి కొన్ని ఉదాహరణలు లేకపోలేదు గాని, ప్రపంచవ్యాప్త కుఖ్యాతి తర్వాత హిట్లర్ పట్ల సానుకూలంగా, స్ఫూర్తితో ఫలానా పని చేశాను అని చెప్పడానికి చాలా తెంపరితనం ఉండాలి.
నిజానికి హైడ్రా ప్రకటిత లక్ష్యాలు రేవంత్ రెడ్డి ఈ జవాబులోనే చెప్పినట్టుగా, పేదవారి ఆక్రమణలను చూసీ చూడనట్టు పోనిచ్చి, ధనికుల ఫార్మ్ హౌజులను లక్ష్యంగా చేసుకున్నట్టయితే, అవాస్తవం మీద ఆధారపడిన హిట్లర్ స్ఫూర్తిని దానికి కలపడం ఆ లక్ష్యానికి అవమానం. ఇంతకూ హైడ్రా అందరికీ తెలిసిన బడా రాజకీయ నాయకుల, సంపన్నుల కబ్జాలను, ఆక్రమణలను తొలగించలేదు. చెరువుల ఆక్రమణలను తొలగించడంలో కూడా స్పష్టమైన పక్షపాతం కనబడుతూనే ఉంది. న్యాయస్థానాలు అడ్డుకున్న, విమర్శించిన, తీవ్రమైన అభ్యంతరాలు తెలిపిన వందలాది కేసులే హైడ్రా పని సందేహాస్పదంగా ఉన్నదని చెపుతున్నాయి. అంటే అబద్ధపు ఉదాహరణ అయినప్పటికీ, తప్పుడు సమర్థన అయినప్పటికీ, హిట్లర్ అనుసరించిన “దృఢదీక్ష” పాటిస్తున్నాము అనడానికి కూడా ఇక్కడ వీలు లేదు.
ఇంతకూ ఎంతో కొంత హిట్లర్ అంశ లేని రాజకీయ నాయకులు ఎవరూ లేరు. వర్గ సమాజంలో అది సాధ్యమే కాదు. ఏకీభవించనోని పీకనొక్కే ఉత్సాహం చూపని, హిట్లర్ వారసత్వం పుణికి పుచ్చుకోని నాయకులు చాలా అరుదు. ప్రత్యర్థుల మీద, భిన్న స్వరాల మీద ఉక్కుపాదం మోపని, ఊచకోత కోయని, నిర్బంధాల పాలు చేయని ఏలికను చూపెట్టడం కష్టం. “ప్రజాస్వామ్యం” పేరుతో ఊరేగిన పాలనలన్నీ, పాలకులందరూ ఏదో ఒక స్థాయిలో హిట్లర్ అంశ పుణికి పుచ్చుకున్న వారే. చెప్పుకొని కొన్నిసార్లూ, చెప్పుకోకుండా అన్నిసార్లూ హిట్లర్ స్ఫూర్తిని కొనసాగించినవాళ్లే. రేవంత్ రెడ్డి తెలివితక్కువగా, ఒక జాతీయ దినపత్రిక సదస్సులో, ప్రపంచమంతా చూస్తుండగా ఒక అబద్ధమూ, ఒక రాజకీయంగా అపసవ్యమైన మాటా నిర్లజ్జగా బైటపెట్టారు. బహుశా ‘నాతో కలువు’ అని హిట్లర్ పరమావతారం బహిరంగ సభావేదిక మీద ఆహ్వానం పలికాక, ఆధునిక హిట్లర్ తో కలవడంతో పాటు, నిర్జీవ హిట్లర్ స్ఫూర్తిని కూడా ఆవాహన చేయాలని అనిపించినట్టుంది. ఇన్నాళ్లూ చేతిలో కనబడకుండా ఉన్న జెండాను కనిపించేలా పట్టుకోవడానికి ప్రయత్నించినట్టున్నారు.
తెలంగాణ ప్రజలు హిట్లర్ బతికి ఉన్నరోజుల్లోనే, చనిపోయిన కొత్తలోనే ఒక స్థానిక హిట్లర్ ను “నాజీల మించినవురో” అని సంబోధించి, గోరీ కడతామని హెచ్చరించారు, గోరీ కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినవారు, ఈ మహోజ్వల తెలంగాణ చరిత్రను కాస్తయినా గుర్తుంచుకుంటే మంచిది.





తెలంగాణ భూమిపుత్రులది, ఎవరి జాగీరూ కాదు!