గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఒదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల/నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడం వరకు బాగానే ఉన్నది కానీ తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి (90 టీఎంసీలు), దిండి (20 టీఎంసీలు) వంటి పెండింగ్ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు (ఎన్ ఓసీలు) ఇస్తేనే, తదుపరి ఇతర అనుసంధాన ప్రాజెక్టుల చర్చ ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి షరతు విధించడంతో విపక్ష బీఆర్ ఎస్‌కు ఒక అస్త్రం ఇచ్చినట్లయింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీల కృష్ణా నది నీరు చట్టబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన హక్కు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేదా రాయితీలు ఆశించాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ‘గోదావరి-నల్లమల సాగర్’ ప్రాజెక్టుకు, తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ ఎల్ ఎస్) అనుమతులను లంకె (లింక్) పెట్టడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం తప్ప మరోటి కాదనేది హరీష్‌రావు వాదన. ఏపీ ప్రతిపాదించిన రూట్‌లో గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు పూర్తయితే, ఆంధ్రప్రదేశ్‌కు ‘జాతీయ ప్రాజెక్టు’ హోదా లభించి కేంద్రం నుండి వేల కోట్ల నిధులు అందడం ఖాయం.
దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఈ రూట్ మ్యాప్‌ను రూపొందించిందనుకోక తప్పదు. ఇచ్ఛంపల్లిని అనుసంధానిస్తూ రూపొందించిన ఒరిజినల్ డిపీఆర్‌ను కాదని ఏపీ ప్రభుత్వం కొత్త రూట్‌మ్యాప్ తయారు చేయడం వెనుక తెలంగాణకు అన్యాయం తలపెట్టాలన్న కుచ్చితపు ఆలోచన ఉన్నదనుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు తెలంగాణ భూభాగం (ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుండి నాగార్జున సాగర్) మీదుగా కాకుండా, కేవలం ఏపీ ప్రయోజనాల కోసం పోలవరం-నల్లమల మీదుగా వెళ్లేలా రేవంత్ సర్కార్ ఒప్పుకుంటోందని హరీష్‌రావు చేసిన విమర్శలో సహేతుకత కనిపిస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్తులో తెలంగాణ తన గోదావరి నీటి వాటాను శాశ్వతంగా కోల్పోవడం ఖాయం. అంతర్రాష్ట్ర ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం, గోదావరి జలాలను ఏపీ తన కృష్ణా బేసిన్‌కు తరలిస్తే, ఎగువన ఉన్న తెలంగాణకు కృష్ణా నదిలో అదనంగా 45 టీఎంసీల నీటిపై హక్కు లభిస్తుంది. రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను లంకె పెట్టడం ద్వారా ఆ చట్టబద్ధమైన హక్కును కూడా ఒదులుకుంటోందన్నది హరీష్‌రావు చేస్తున్న బలమైన ఆరోపణకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కుల నష్టం, ఆయకట్టు ఎండిపోవడం, మరియు పర్యావరణ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా (ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 968 టీఎంసీ) ఇంకా పూర్తిగా తేలలేదు. ఇలాంటి స్థితిలో మిగులు జలాల పేరుతో నీటిని కావేరికి తరలిస్తే, భవిష్యత్తు లో తెలంగాణ తన హక్కులను శాశ్వతంగా కోల్పోవాల్సి వొస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించినప్పుడు, అంతర్ రాష్ట్ర ఒప్పందాల ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా లభించాల్సిన 45 టీఎంసీల వాటాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ వద్ద నుండి నీటిని మళ్లిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్, దేవాదుల, సీతమ్మ సాగర్ వంటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. తెలంగాణలోని మెట్ట ప్రాంతాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
సమ్మక్క సాగర్ బ్యారేజ్‌కు కేవలం 24 కి.మీ ఎగువన మరో భారీ మళ్లింపు ప్రాజెక్టు కట్టడం వల్ల వరదల సమయంలో నీటి నిర్వహణ చాలా కష్టమవుతుందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లింక్‌ను పొలవరం – బనకచర్ల – నాగార్జునసాగర్ మీదుగా (తెలంగాణ భూభాగాన్ని దాదాపు దాటవేస్తూ) నిర్మించాలని ప్రతిపాదించిన మార్గం వల్ల తెలంగాణకు చుక్క నీరు కూడా దక్కకుండా పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నిరసన తెలపడమే కాకుండా అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించడంలో న్యాయం ఉంది . ఇచ్చంపల్లి వద్ద పూర్తి స్థాయి డ్యామ్ నిర్మిస్తే ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోని అటవీ ప్రాంతాలు, గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నది కనుక తెలంగాణ ఈ డ్యామ్ ఎత్తును తగ్గించాలని అంతేకాకుండా లింక్ ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50% వాటా తమకే దక్కాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ కాల్వల మార్గం కచ్చితంగా తెలంగాణ భూభాగం (ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్) నుంచే సాగాలి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, చండూరు వంటి మెట్ట ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగు నీరు అందించాలని తెలంగాణ పట్టుపడటం కూడా సమంజసమే.
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన వివాదాస్పద ‘గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు’ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను కేంద్రం పరిశీలించడాన్ని తెలంగాణ తప్పు పట్టడం కూడా న్యాయమే. ఎందుకంటే చంద్రబాబు కేంద్రంలో ఉన్న పలుకుబడితో, ఒత్తిడి తెచ్చి ఆపని చేయించి ఉండవొచ్చు. ఇది 1980 గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యుడీటీ) అవార్డును, మరియు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ను స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్ డబ్ల్యుడీఏ) కు అధికారికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది కూడా.
నిజం చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిందే ప్రధానంగా నీటి సమస్యపై! 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి తెలంగాణకు ఆంధ్రపాలకులు అన్యాయం చేస్తూనే ఉన్నారు. రెండు ప్రాంతాల విలీనం సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఇదే తెలంగాణ ఉద్యమానికి దారితీసింది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏపీ నాయకులు అవకాశమొచ్చినప్పుడల్లా తమ కుచ్చిత బుద్ధిని మానడంలేదు. చంద్రబాబు శిష్యుడిగా రేవంత్‌రెడ్డి ఈ నదుల అనుసంధానం విషయంలో ఆంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రాకుండా చూసుకోవాలి. చిత్తశుద్ధితో కచ్చితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. పైకి కచ్చితంగా మాట్లాడుతూ, లోపల మెత్తగా వ్యవహరిస్తే రాష్ట్రం నష్టపోతుంది! రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలను పక్కన బెట్టి వ్యవహరిస్తేనే రేవంత్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడుతుంది!





