విష విద్వేష ప్రచారం – పొరుగు పోలీసు దౌర్జన్యం

“తెలంగాణలో నానాటికీ సంఘ్ పరివార్ దుర్మార్గాలు, పోలీసు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అది సంఘ్ పరివార్ ప్రభుత్వమేమో అని అనుమానించే పరిస్థితి ఉంటున్నది. రాహుల్ గాంధీ నిత్యమూ చేతుల్లో పట్టుకుని ప్రదర్శిస్తూ తిరిగే రాజ్యాంగం అన్నా, చట్టబద్ధ పాలన అన్నా ఎంత మాత్రం గౌరవం లేని పాలన సాగుతున్నదని కాంగ్రెస్ అధిష్టానానికి తెలుస్తున్నదో లేదో తెలియదు. తెలంగాణాధీశుడు పైకి ఏమి చెప్పినా తమ పరివారంలో భాగమే అని సంఘ్ సంతృప్తి పొందగల పరిణామాలు మాత్రం అలవోకగా, యథావిధిగా జరిగిపోతున్నాయి.”

తెలంగాణ సమాజంలో మార్పులు, పరిణామాలు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయంటే ఈ శీర్షిక కింద రాయాలని వారం మొదట్లో అనుకున్న సమకాలీన అంశం వారం మధ్యకల్లా మారిపోతున్నది. చివరికి శీర్షిక రాసే సమయానికి మరొక కొత్త అంశం వచ్చి కూచుంటున్నది. ఈ వేగం మంచికా చెడ్డకా, ఈ పరిణామాలు సమాజ పురోగమనాన్ని సూచిస్తున్నాయా, ‘ఆకాశమునుండి శంభుని శిరమందుండి…’ అన్నట్టు నానాటికీ దిగజారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవన పరిణామాలను సూచిస్తున్నాయా?

తెలంగాణలో నానాటికీ సంఘ్ పరివార్ దుర్మార్గాలుపోలీసు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అది సంఘ్ పరివార్ ప్రభుత్వమేమో అని అనుమానించే పరిస్థితి ఉంటున్నది. రాహుల్ గాంధీ నిత్యమూ చేతుల్లో పట్టుకుని ప్రదర్శిస్తూ తిరిగే రాజ్యాంగం అన్నా, చట్టబద్ధ పాలన అన్నా ఎంత మాత్రం గౌరవం లేని పాలన సాగుతున్నదని కాంగ్రెస్ అధిష్టానానికి తెలుస్తున్నదో లేదో తెలియదు. తెలంగాణాధీశుడు పైకి ఏమి చెప్పినా తమ పరివారంలో భాగమే అని సంఘ్ సంతృప్తి పొందగల పరిణామాలు మాత్రం అలవోకగా, యథావిధిగా జరిగిపోతున్నాయి.

ఈ వారంలో జరిగిన రెండు ఘటనలనే చూద్దాం. ఒకటి ఆర్మూరులో ఒక మామూలు సంఘటనను సాకుగా తీసుకుని సంఘ్ పరివార్ శక్తులు సాగిస్తున్న విష, విద్వేష ప్రచారం. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు హైదరాబాద్ జర్నలిస్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అపహరించుకు పోయిన తీరు. ఈ రెండు ఘటనలకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంతో, పోలీసులతో, పాలక విధానాలతో సన్నిహిత సంబంధం ఉంది. ఇవి కేవలం అప్పటికప్పుడు జరిగిన ఘటనలు కావు. గతం నుంచీ జరుగుతూ వస్తున్న పరిణామాలలో భాగమే. ఈ ఘటనల ప్రభావం భవిష్యత్తు మీద మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే ఇవి వర్తమాన ఘటనలుగా కనబడుతున్నప్పటికీ గత వర్తమాన భవిష్యత్తుల గొలుసులో భాగమైన పరిణామాలు. తెలంగాణ సమాజ గమనం మీద లోతైన ప్రభావం వెయ్యగల పరిణామాలు.   

“నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్ గ్రామంలో భారత్ చంద్ర స్కూల్ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ నేర్పుతున్నారనేది సంఘ్ పరివార్ ఆరోపణ. ఆ పని చేయగూడదని ఆ పాఠశాల యాజమాన్యంతో చర్చించవచ్చు, విద్యాశాఖ అధికారులతో చర్చించవచ్చు. ప్రభుత్వ పెద్దలతో చర్చించవచ్చు. ఆపి వేయించవచ్చు. కాని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు గుంపుగా, పోలీసులను కూడా వెంట తీసుకుని పాఠశాల మీద దాడికి వెళ్లారు. అక్కడ పోలీసులు చూస్తుండగానే స్కూల్ హెడ్ మాస్టర్ మీద చెయ్యి చేసుకున్నారు.”

మొదటిది ఇప్పటికిప్పుడు జరిగిన ఒకానొక ఘటనగా కనిపిస్తుంది గాని, తెలంగాణ సమాజాన్ని విషపూరితం చేయడానికి, మతం పేరు మీద విభజించడానికిసాధారణ మానవుల్లో ఇతర మతస్తుల పట్ల విద్వేష బీజాలు నాటడానికిఅంతిమంగా రాష్ట్ర రాజకీయాధికారాన్ని చేపట్టడానికి సంఘ్ పరివార్ ఎంతో కాలంగా చేస్తున్న కుటిల ప్రయత్నాలలో అది ఒక భాగం. సారాంశంలో అన్ని మతోన్మాదాలూ ఒకటే అనీ, అవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరాన్నభుక్కుల్లా పెరుగుతాయనీ, ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైన సత్యమే ఇప్పుడు మరొకసారి ఆర్మూరులో వ్యక్తమయింది. ఒక మతానికి చెందిన వ్యక్తి చేసిన తెలివితక్కువ పనిని వాడుకుని సంఘ్ పరివార్ విజృంభించింది. ఆ పనిని అడ్డుకోవడానికి, అధికారిక చర్యలు తీసుకోవడానికి అన్ని అవకాశాలూ ఉండగా, అవి వదిలి సంఘ్ పరివార్ తన విష ప్రచారానికి, సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడానికి, ప్రజల్లో భయభీతావహం వ్యాపింపజేయడానికి ఆ అవకాశాన్ని వాడుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్ గ్రామంలో భారత్ చంద్ర స్కూల్ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ నేర్పుతున్నారనేది సంఘ్ పరివార్ ఆరోపణ. ఆ పని చేయగూడదని ఆ పాఠశాల యాజమాన్యంతో చర్చించవచ్చు, విద్యాశాఖ అధికారులతో చర్చించవచ్చు. ప్రభుత్వ పెద్దలతో చర్చించవచ్చు. ఆపి వేయించవచ్చు. కాని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు గుంపుగాపోలీసులను కూడా వెంట తీసుకుని పాఠశాల మీద దాడికి వెళ్లారు. అక్కడ పోలీసులు చూస్తుండగానే స్కూల్ హెడ్ మాస్టర్ మీద చెయ్యి చేసుకున్నారు.

ఒక పాఠశాల నడుస్తున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఆ పాఠశాలలో జొరబడిహెడ్ మాస్టర్ ను కొట్టడం శిక్షార్హమైన నేరం. పక్కన పోలీసులు ఉండగానే అలా జరగడం పోలీసుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి చిహ్నం. నిజానికి విద్యార్థులకు ఉర్దూ నేర్పించడం తప్పు కాదు. పిల్లలకు ఒక అదనపు భాషా నైపుణ్యం ఇచ్చినట్టు అవుతుంది. పిల్లల మీద భారం అయితే, ఉన్న పాఠాంశాలు వదిలి అది నేర్పితే, తప్పనిసరిగా పాఠ్యాంశాలలో లేని విషయం ఎందుకు బోధిస్తున్నారని అడగవచ్చు గాని, ఉర్దూ ఏదో ఒక మత భాష అనే విషపూరిత భావనతో ఈ దాడి జరిగింది. ఉర్దూ ఈ రాష్ట్రంలో రెండో అధికార భాష. ఈ రాష్ట్రంలో గణనీయమైన జనాభాకు మాతృభాష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 2018లోనే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఇంగ్లిష్, తెలుగులతో పాటుగా నేర్చుకోదగిన మూడో భాషగా హిందీ, ఉర్దూ, సంస్కృతాలను చేర్చింది.

ఉర్దూ నేర్పడం దానికదిగా తప్పు కాదు. పాఠ్యాంశాలలో భాగం కాకుండా నేర్పుతున్నారనే ఫిర్యాదు అధికారికంగా, ప్రజాస్వామికంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. కాని వెళ్లి హెడ్ మాస్టర్ ను కొట్టడం దౌర్జన్య స్వభావానికి, దౌర్జన్యం చేసినా తమను ఎవరూ ఏమీ చేయబోరనే అహంకారానికి చిహ్నం. ఆ ఘటన మీద బిజెపి నాయకుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు, అనధికారిక బోధన గురించి స్కూల్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేశారు.  నిజానికి ఈ రెండు ఘటనల్లో ఒకటి నమోదు చేయదగిన నేరం, మరొకటి ఎక్కువలో ఎక్కువ అత్యుత్సాహం. దాని మీద కేసు అనవసరం మాత్రమే కాక దౌర్జన్యపరులను సంతృప్తి పరచడానికి చేసిన బుజ్జగింపు.  

ఈ వ్యవహారం మీద విచారణ జరపమని జిల్లా అడిషనల్ కలెక్టర్, ఆర్మూరు సబ్ కలెక్టర్ ల ఆదేశాల మేరకు ఆర్మూరు రెవెన్యూ ఇనస్పెక్టర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్థానిక పోలీసులతో కలిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్ లతో సహా సంబంధిత వ్యక్తులందరినీ కలిశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హిందీ చెప్పడానికి నియమితులైన టీచర్, హిందీతో పాటు ఉర్దూ కూడా నేర్పించారని విచారణ కమిటీ గుర్తించింది. ఆ విషయంలో పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఉర్దూ నేర్పడం మానెయ్యమని ఆ టీచర్ ను ఆదేశించామని హెడ్ మాస్టర్, కరెస్పాండెంట్ చెప్పారని కూడా విచారణ కమిటీ తేల్చింది. 

“ఆ ఇద్దరు జర్నలిస్టు-యూట్యూబర్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటే చట్టప్రకారం వారిమీద దర్యాప్తు చేయవచ్చు, కేసు పెట్టవచ్చు, న్యాయస్థానంలో విచారించవచ్చు. అభ్యంతరకర వ్యాఖ్యలను రుజువు చేసి శిక్ష కూడా వేయించవచ్చు. ఈ ఇద్దరి మీద కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి గనుక ఆంధ్రప్రదేశ్ పోలీసులు పద్ధతి ప్రకారం తెలంగాణ పోలీసులకు, స్థానిక పోలీసులకు తెలిపి అధికారికంగా అరెస్టు చేసి తీసుకువెళ్లవలసి ఉంటుంది గాని దొంగతనంగా, అనధికారికంగా కిడ్నాప్ చేయడం, నిందితుల మీద, భార్యాబిడ్డల దౌర్జన్యం చేయడం పోలీసు రాజ్యానికి, చట్టవ్యతిరేక ప్రవర్తనకు, పోలీసు జులుంకు చిహ్నం. పొరుగురాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ఇంత జులుం చలాయిస్తుంటే తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకోకపోగా, వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడం మరింత అన్యాయం.”

ఇలా ఒక భాషా బోధన తప్పు కాదని, భాషా బోధన చేసినందుకే కొడతారా అని ఎవరైనా అంటారు గనుకదానికి చిలవలూ పలవలూ జోడించి పిల్లలకు నమాజ్ కూడా నేర్పుతున్నారని కొత్త ఆరోపణ జత చేశారు. అది నిజమో కాదో పిల్లలు చెప్పాలి. కాని ఇప్పటికే ఆర్మూరులో సమాజ విభజన, విషవ్యాప్తి జరిగిపోయింది గనుకతటస్థ వాతావరణం లేదు గనుక వాస్తవం ఎప్పటికీ బైటికి రాదు.

ఇంతకూ తెలంగాణలో ఉర్దూపట్ల ఇటువంటి విద్వేష వ్యాప్తి తీవ్రంగా అభ్యంతరకరమైనది, తెలంగాణ సమాజ చరిత్రకూ, వారసత్వానికీ వ్యతిరేకమైనది. సంఘ్ పరివార్ చెపుతున్నట్టుగా ఉర్దూ ఏదో ఒక మతపు భాష కాదు. అది ఒక భారతీయ భాష. రాజ్యాంగం ఆమోదించిన భాష, తెలంగాణ సమాజంలో వందల ఏళ్లుగా భాగమై పోయిన భాష. రెండు తరాల కింద చాలా మంది సాధారణ ప్రజలూ, సాహిత్యకారులూ, రాజకీయ నాయకులూ తమ కార్యకలాపాలను ఉర్దూలోనే నిర్వహించారు. మా బాపు తన దినచర్య ఉర్దూలోనే రాసుకునేవారు. అసలు మొత్తంగా భారత ఉపఖండంలోనే మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ఎందరో ఉర్దూ భాషాభిమానులు, సాహిత్యాభిమానులు ఉన్నారు. ఉర్దూ మీద విషం చిమ్మడం మన చరిత్రకూ, సంస్కృతికీ అవమానం.  

ఇక రెండో ఘటన, మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇద్దరు జర్నలిస్టుల మీద సివిల్ డ్రెస్ లో ఉన్న కొందరు వ్యక్తులు దాడి చేసి ఎత్తుకుపోయారు. ఆ దుండగులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చునని తెలుస్తున్నది. ఒక జర్నలిస్టు, కె వెంకటరామి రెడ్డి తన యూట్యూబ్ వీడియోలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొడుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీద ఏవో వ్యాఖ్యలు చేశారని విజయనగరంలో నమోదైన కేసులో ఇదివరకు ఒకసారి ఎత్తుకుపోయి, వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టి, తెలంగాణ సమాజంలో ఆందోళన తర్వాత విడిచి పెట్టారు. ఇప్పుడు ఆ కేసులోనో, మరొక కేసులోనో నాన్ బెయిలబుల్ వారంట్ ఉన్నదనే పేరుతో దాడి చేశారు.

నాన్ బెయిలబుల్ వారంట్ అనేది కోర్టు విచారణకు హాజరు కాకపోతే ఆ వ్యక్తిని తీసుకురమ్మని పోలీసులకు ఇచ్చే ఆదేశం. అది ఒక చట్టబద్ధమైన అరెస్టు. పోలీసుల బాధ్యత ఆ వ్యక్తికి వారెంటు చూపి, అదుపులోకి తీసుకుని కోర్టు ముందర హాజరు పరచడం మాత్రమే. అది అధికారికమైన పని గనుక ఆ పని చేసే పోలీసులు విధిగా యూనిఫామ్ లో ఉండాలి. నిందితుడిని తీసుకుపోవడానికి అధికారిక వాహనం వాడాలి. నిందితుల మీద బలప్రయోగం, దౌర్జన్యం చేయగూడదు. కాని వెంకటరామి రెడ్డిని అలా అధికారికంగా తీసుకుపోవడానికి వచ్చామని చెప్పినవారు ఆ అధికారిక పద్ధతిలో ప్రవర్తించలేదాని వీడియోలు చెపుతున్నాయి.

ఇంట్లో భార్యా పిల్లలతోషార్ట్స్ లో, బనీను మీద ఉన్న వ్యక్తిని బట్టలు కూడా వేసుకోనివ్వకుండా లాక్కుపోయారు. వచ్చినవారు యూనిఫామ్ లో లేకపోవడం మాత్రమే కాదు, కిరాయి గూండాల్లా కనబడుతున్నారు. వారు పోలీసులు అని చెప్పే ఆధారాలేమీ లేవు. అధికారిక పోలీసు వాహనంలో కూడా రాలేదు. తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న ఒక ప్రైవేటు కారులో వచ్చారు. అలా ఎత్తుకుపోవడాన్ని వ్యతిరేకించి వెంకటరామి రెడ్డి భార్య అడ్డుపడింది. గతంలో ఇలాగే తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారు గనుక ఈసారి ఏమి చేస్తారో అని ఆందోళన పడింది. ఆమెను పురుష పోలీసులు లాగిపడవేసి వెంకటరామి రెడ్డిని కారులోకి తోశారు. గుమిగూడిన ప్రజలు స్థానిక పోలీసులు లేకుండా మీరెవరో ఎలా నమ్మేదని అంటే, అప్పుడు సరూర్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. సరూర్ నగర్ పోలీసులు ఈ కిడ్నాప్ సజావుగా సాగిపోయేలా చూశారు.

ఈ కిడ్నాప్ అయినా రికార్డయి, సామాజిక మాధ్యమాలలో అందరికీ తెలిసింది గాని, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడారనే ఆరోపణపై ప్రశ్న యూట్యూబ్ చానల్ జర్నలిస్టు రావణ్ ను అర్ధరాత్రి ఇలాగే ఎత్తుకుపోయిన వార్త బుధవారం ఉదయం బైటపడింది. ఆ ఇద్దరు జర్నలిస్టు-యూట్యూబర్లు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటే చట్టప్రకారం వారిమీద దర్యాప్తు చేయవచ్చు, కేసు పెట్టవచ్చు, న్యాయస్థానంలో విచారించవచ్చు. అభ్యంతరకర వ్యాఖ్యలను రుజువు చేసి శిక్ష కూడా వేయించవచ్చు. ఈ ఇద్దరి మీద కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి గనుక ఆంధ్రప్రదేశ్ పోలీసులు పద్ధతి ప్రకారం తెలంగాణ పోలీసులకు, స్థానిక పోలీసులకు తెలిపి అధికారికంగా అరెస్టు చేసి తీసుకువెళ్లవలసి ఉంటుంది గాని దొంగతనంగా, అనధికారికంగా కిడ్నాప్ చేయడం, నిందితుల మీద, భార్యాబిడ్డల దౌర్జన్యం చేయడం పోలీసు రాజ్యానికి, చట్టవ్యతిరేక ప్రవర్తనకు, పోలీసు జులుంకు చిహ్నం. పొరుగురాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ఇంత జులుం చలాయిస్తుంటే తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకోకపోగా, వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడం మరింత అన్యాయం.

ఈ రెండు ఘటనలూ తెలంగాణ ప్రభుత్వం మీద, పోలీసుల మీద అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి. ఇక్కడ పాలిస్తున్నది రాజ్యాంగబద్ధంగా ఉంటానంటున్న కాంగ్రెస్ ప్రభుత్వమా, మనుధర్మపు, దౌర్జన్యపు, ఎన్ డి ఎ కూటమిలో భాగమైన ప్రభుత్వామా అని అనుమానం వస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *