– తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి
– పోలీసు ఉద్యోగాలకు గతంలో ఉన్న వయోపరిమితిని పునరుద్ధరించాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని అసెంబ్లీలో బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు మండిపడ్డారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఆయనను గురువారం కలిసి నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతి పత్రం సమర్పించారు. నిరుద్యోగుల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆరఎస్ హయాంలో పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి ఒకేసారి 16 వేలు, 17 వేల చొప్పున నోటిఫికేషన్లు ఇచ్చామని, పోలీస్ శాఖలో దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 19వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి, డీజీపీ చెబుతూనే కేవలం ఐదు వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను వంచించడమేనన్నారు. తక్షణమే మొత్తం 19 వేల ఖాళీల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే అందులో రెండు వేలు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని, మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదని, దీనివల్ల గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుదించిన వయో పరిమితిని రద్దు చేసి బీఆరఎస్ హయాంలో ఉన్నట్లు కానిస్టేబుల్‌కు 36, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈవెంట్స్‌లో కూడా నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత బీఆరఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్‌పుట్‌లలో దూరం పెంచి మూడింటికి మూడు క్వాలిఫై కావాలనడం అన్యాయమన్నారు. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చి ఇప్పుడు భారీగా ఫీజుల వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలని డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్ నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాదిమంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ లేవని, కొంత సమయంపాటు సమీపంలోని పోలీసు లేదా ఇతర గ్రౌండ్స్ కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆరఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 19 వేల పోస్టులతోపాటు మేనిఫెస్టోలో చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీశ్ రావు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



