ముప్పై ఏడు శాతం వోటర్లు అనుమానాస్పదులా?!

“అయితే రానున్న మహా ప్రమాదానికి సూచనలు, ప్రమాద ఘంటికలు మోగడం అప్పుడే మొదలయింది. సర్ ప్రక్రియకు ముందస్తుగా జరిపిన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో ఇప్పటికి వోటర్ల జాబితాలలో ఉన్న మూడు కోట్ల ముప్పైతొమ్మిది లక్షల మందిలో, రెండు కోట్ల ముపై రెండు లక్షల మందిని ఎన్యూమరేటర్లు కలిశారు. జూన్ 4 నాటికి జరిగిన మ్యాపింగ్ ప్రకారం, 88,13,207 మంది వోటర్ల వివరాల్లో తేడాలున్నాయని, అంటే ఆ 88 లక్షల మంది తగిన పత్రాలతో ధ్రువీకరించుకుంటే తప్ప వోటర్లుగా గుర్తించడానికి అనుమానాస్పదులని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం వోటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసే పని జరగనే లేదు. ఉన్న మొత్తం వోటర్ల సంఖ్యలో కేవలం 68.7 శాతం మందిని మాత్రమే మ్యాపింగ్ చేశారు. అలా మ్యాపింగ్ జరిగిన వారిలోనే 37 శాతం మందిని అనుమానాస్పదులుగా ప్రకటించారు!.”

తెలంగాణలో ఇప్పటివరకూ ఉన్న వోటర్ల జాబితాలో ప్రతి మూడు పేర్లలో ఒక పేరు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే నూటికి ముప్పై ఏడు పేర్లు, అనుమానాస్పదమని స్వయంగా ఎన్నికల సంఘమే అంటున్నది. అంటే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలూ దొంగ వోట్ల నిలయాలుగా, అక్రమాల పుట్టలుగా ఉండి ఉండాలి. లేదా ప్రస్తుతం ఎన్నికల సంఘం చేస్తున్న నిర్ధారణ పచ్చి అబద్ధమైనా అయి ఉండాలి. ఒకవేళ అది నిజమే అయితే, అయినప్పటికీ అది ప్రభుత్వ అసమర్థతకు విస్పష్టమైన చిహ్నం అవుతుంది గాని, ప్రజల వోటుహక్కు కొల్లగొట్టడానికి కారణం కాగూడదు. మూడో వంతు వోటర్లు, ప్రజలు కొత్తగా తమ గుర్తింపు పత్రాలు సమర్పించి, తమను తాము ధ్రువీకరించుకోవలసి ఉందని అంటున్న ప్రభుత్వమే అసలు ముందు తనను తాను ధ్రువీకరించుకోవలసి ఉంది.  

మామూలుగా ఎక్కడైనా పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల విధానంలో ప్రజలు, వోటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులలో ఎక్కువ మంది ఏ రాజకీయపక్షానికి చెందినవారైతే ఆ రాజకీయ పక్షం ప్రభుత్వం స్థాపించి ఐదు సంవత్సరాలు పాలిస్తుంది. ఈ సాధారణ ఆనవాయితీని సంఘ్ పరివార్ తలకిందులు చేయదలచుకున్నట్టుంది. వోటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకునే బదులు, ప్రభుత్వమే తనకు ఇష్టం వచ్చిన వోటర్లను ఎన్నుకునే, తనకు నచ్చని వోటర్లను తొలగించే ఒక వినూత్న పద్ధతిని సంఘ్ పరివార్ కనిపెట్టింది. సంఘ్ పరివార్ పెద్ద గుమాస్తాగా పని చేస్తున్న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఈ కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. బిహార్ లో 2025 జూలైలో మొదలై, 2026 జనవరిలో పశ్చిమ బెంగాల్ దాకా సాగి, లక్షలాది మంది వోటర్లను జాబితాల నుంచి తొలగించి, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంలో సర్ నిర్వహించిన పాత్ర గణనీయమైనది.  

ఇప్పుడు ఆ సర్ సర్పం తెలంగాణలో ప్రవేశించి, బుసలు కొట్టడం మొదలయింది. దాని కాటుకు రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది వోటర్లు బలి అయిపోతారో తెలియదు. వాస్తవంగా సర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ బూత్ లెవల్ ఆఫీసర్స్ వచ్చి, వోటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చి, వోటర్ల జాబితాలను సవరించే పని రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరుగుతుంది. ఈ సవరణ ఆధారంగా ముసాయిదా వోటర్ల జాబితాను జూలై 31న ప్రకటిస్తారు. అప్పుడు గాని తెలంగాణ మీద ఈ సర్ పం ఎంత విషం చిమ్మదలచుకున్నదో, ఎంత మంది వోటర్ల ప్రాథమిక హక్కును చోరీ చేయదలచుకున్నదో, సంఘ్ పరివార్ తెలంగాణలో ఎంత ప్రమాదానికి పథక రచన చేస్తున్నదో పూర్తి చిత్రం బైటపడదు.  

అయితే రానున్న మహా ప్రమాదానికి సూచనలు, ప్రమాద ఘంటికలు మోగడం అప్పుడే మొదలయింది. సర్ ప్రక్రియకు ముందస్తుగా జరిపిన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో ఇప్పటికి వోటర్ల జాబితాలలో ఉన్న మూడు కోట్ల ముప్పైతొమ్మిది లక్షల మందిలో, రెండు కోట్ల ముపై రెండు లక్షల మందిని ఎన్యూమరేటర్లు కలిశారు. జూన్ 4 నాటికి జరిగిన మ్యాపింగ్ ప్రకారం, 88,13,207 మంది వోటర్ల వివరాల్లో తేడాలున్నాయని, అంటే ఆ 88 లక్షల మంది తగిన పత్రాలతో ధ్రువీకరించుకుంటే తప్ప వోటర్లుగా గుర్తించడానికి అనుమానాస్పదులని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం వోటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసే పని జరగనే లేదు. ఉన్న మొత్తం వోటర్ల సంఖ్యలో కేవలం 68.7 శాతం మందిని మాత్రమే మ్యాపింగ్ చేశారు. అలా మ్యాపింగ్ జరిగిన వారిలోనే 37 శాతం మందిని అనుమానాస్పదులుగా ప్రకటించారు!

“సర్ ప్రక్రియలో గతంలో బిహార్, పశ్చిమ బెంగాల్ లలో వోటర్ల పేర్లు తొలగించడానికి పెట్టిన ముద్దు పేరు లాజికల్ డిస్క్రెపెన్సీ (తార్కిక అసంబద్ధత). తెలంగాణలో కూడా వోటర్ల పేర్లు తొలగించడానికి అదే సాధనాన్ని వాడుతున్నారు. పైకి చూడడానికి ఈ లాజికల్ డిస్క్రెపెన్సీ అనే మాట చాలా హేతుబద్ధమైన, సమంజసమైన మాటగా కనబడుతుంది. నిజంగానే వోటర్ల జాబితాలో ఎటువంటి అసంబద్ధత ఉండడానికి వీలు లేదు. అయితే ఈ తార్కిక అసంబద్ధత పేరుతో ఎన్నికల సంఘం ఇచ్చిన పది రకాల అసంబద్ధతలు అధికారులకు తమ ఇష్టం వచ్చిన పేర్లు తొలగించే అవకాశం ఇస్తాయి. అలా ఎవరి పేర్లు తొలగించాలో నాగపూర్ నుంచో, దిల్లీ నుంచో అప్రకటిత సూచనలు కూడా ఉండే ఉంటాయి.”

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లా పూర్ నియోజకవర్గంలో అనుమానాస్పదుల సంఖ్య 78 శాతంగా ఉందని అంటున్నారంటే, అర్హులైన వోటర్ల పేర్లు కూడా తొలగించడానికి సాకులు వెతికే కుట్ర ప్రారంభమయిందన్నమాట. పత్రాలు చూసిన తర్వాత ఈ అనుమానాస్పదులలో 90 శాతం పేర్లు తిరిగి జాబితాలోకి ఎక్కవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్నారు గాని, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉదాహరణలు చూస్తే ఆ మాట నమ్మశక్యంగా లేదు. జూన్ 15 నుంచి ఎన్యూమరేటర్లకు శిక్షణ జరగనుండగా, జూన్ 11న ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రకటన హాస్యాస్పదమైనది, దిగ్భ్రాంతికరమైనది, ఎన్నికల సంఘపు దురాలోచనకు సంకేతాత్మకమైనది.

సర్ ప్రక్రియలో గతంలో బిహార్, పశ్చిమ బెంగాల్ లలో వోటర్ల పేర్లు తొలగించడానికి పెట్టిన ముద్దు పేరు లాజికల్ డిస్క్రెపెన్సీ (తార్కిక అసంబద్ధత). తెలంగాణలో కూడా వోటర్ల పేర్లు తొలగించడానికి అదే సాధనాన్ని వాడుతున్నారు. పైకి చూడడానికి ఈ లాజికల్ డిస్క్రెపెన్సీ అనే మాట చాలా హేతుబద్ధమైన, సమంజసమైన మాటగా కనబడుతుంది. నిజంగానే వోటర్ల జాబితాలో ఎటువంటి అసంబద్ధత ఉండడానికి వీలు లేదు. అయితే ఈ తార్కిక అసంబద్ధత పేరుతో ఎన్నికల సంఘం ఇచ్చిన పది రకాల అసంబద్ధతలు అధికారులకు తమ ఇష్టం వచ్చిన పేర్లు తొలగించే అవకాశం ఇస్తాయి. అలా ఎవరి పేర్లు తొలగించాలో నాగపూర్ నుంచో, దిల్లీ నుంచో అప్రకటిత సూచనలు కూడా ఉండే ఉంటాయి.

ప్రకటిత సూచనల్లో 1. తల్లిదండ్రులకు ఆరుగురి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు. 2. తల్లికీ, పిల్లలకూ మధ్య తేడా 15 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు. 3. తల్లిదండ్రులకూ పిల్లలకూ వయసు తేడా 50 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు. 4. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు పిల్లల మధ్య తొమ్మిది నెలల కన్నా తక్కువ తేడా ఉన్నప్పుడు. 5. గత వోటర్ల జాబితా సవరణలో తల్లిదండ్రుల పేర్లకూ ప్రస్తుతం పేర్లకూ తేడా ఉన్నప్పుడు. 6. 2002 వోటర్ల సవరణలో వయసుకూ ప్రస్తుత వయసుకూ తేడా ఉన్నప్పుడు. 7. ధ్రువీకరణ పత్రాలలో కేవలం ఆధార్ మాత్రమే సమర్పించినప్పుడు. 8. తాత వయసుకూ మనవడి వయసుకూ మధ్య 40 సంవత్సరాల కన్న తక్కువ తేడా ఉన్నప్పుడు. 9. పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు తేడాగా ఉన్నప్పుడు. 10. పేరులో అక్షరాల తేడా ఉన్నప్పుడు.

వీటిలో కొన్ని ఎవరికైనా వర్తించేవీ, అవసరమైనవీ కావచ్చు. కాని ఆధార్ మాత్రమే ఇవ్వడం, పేర్ల పొరపాట్లు రావడం, పేరులో అక్షరాల పొరపాట్లు ఉండడం అనేవి అభ్యంతరకరమైనవి. ఆధార్ వచ్చినప్పటి నుంచీ దాన్ని అనేక చోట్ల గుర్తింపు పత్రంగా లెక్కిస్తున్నారు. ఆ గుర్తింపు పత్రం ఒక్కటే ఇస్తే లాజికల్ డిస్క్రెపెన్సీ అవుతుందని ఎన్నికల సంఘం ఇప్పుడు అంటున్నది. భారత ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం గుర్తించడం లేదా? ఇక పేర్లలో, తండ్రి పేరులో మార్పులు, అక్షరాల తేడాలు, భారతీయ భాషల నుంచి ఇంగ్లిష్ లోకి మార్చినప్పుడు అనేక రకాలుగా మారే అవకాశం ఉంది. వోటర్ అవునా కాదా అనేది తేల్చడానికి పేర్ల, అక్షర క్రమాల ప్రామాణీకరణ ఎందుకు? ఇది కేవలం కొన్ని పేర్లు తీసి వెయ్యడానికి సాకుగా మాత్రమే మారుతుంది. నిజంగా వేరు వేరు రూపాల, వేరు వేరు అక్షరక్రమాల పేర్లు ఉన్నవారు కొందరు ఎటువంటి పరిశీలనా లేకుండా వోటర్ల జాబితాలో కొనసాగవచ్చు. ఎవరి పేరయినా తీసివేయదలచుకున్నప్పుడు, ఈ కారణాన్ని భూతద్దంలో చూపి, తార్కిక అసంబద్ధత పేరుతో తొలగించవచ్చు. అంటే తార్కిక అసంబద్ధత అనేది ఒక తార్కిక ప్రమాణం కాదు, ఒక ఇష్టారాజ్యపు ఆయుధం.

“దేశంలో వోటర్ల జాబితాలు సక్రమంగా లేని మాట నిజమే. తప్పనిసరిగా దొంగ వోట్లను, దొంగ వోటర్లను తొలగించవలసిందే. కాని ప్రస్తుత ఎన్నికల సంఘానికి, అధికార పార్టీకి, ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలన్నిటికీ కూడా దొంగ వోట్లు తొలగించాలనే కోరికేమీ లేదు. దొంగ వోట్ల రాజ్యం నడుస్తున్నదే రాజకీయ పార్టీల వల్ల. కాకపోతే, కచ్చితంగా తమకు వోటు వెయ్యరని అనుమానం ఉన్న వోటర్ల పేర్లు జాబితాలో లేకపోతే బాగుండునని ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటుంది. ఆ కోరికలో భారతీయ జనతా పార్టీ మరొక అడుగు ముందుకు వేసి, మరొక ఆకు ఎక్కువ చదివి, ఎన్నికల సంఘాన్ని తన చెప్పుచేతుల్లో పెట్టుకుని కొత్త ఎత్తు ప్రారంభించింది.”

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఆ పది కారణాలతో పాటు, రాష్ట్రంలో ఎనబై ఎనిమిది లక్షల మందిని అనుమానాస్పదులుగా ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పిన కారణాలలో, ఒక మహిళా వోటర్ కు ఒక కాగితంలో తండ్రి పేరు, మరొక కాగితంలో భర్త పేరు ఉన్నాయనే కారణం కూడా ఉంది. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుల బంధుత్వాలు భిన్నంగా ఉన్నాయనే కారణం కూడా ఉంది. ఇవి ఎంత హాస్యాస్పదమైన కారణాలో చెప్పనక్కరలేదు.

బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికీ వచ్చి, ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఇటువంటి లాజికల్ డిస్క్రెపెన్సీ పేరు చెప్పి  జాబితాలో పేరు అనుమానాస్పదమైనదనే నమోదు చేస్తే, జూలై 31న ప్రకటించే ముసాయిదా జాబితాలో ఆ పేరు ఉండదు. అప్పుడు వోటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవడం వోటర్ బాధ్యత అవుతుంది. తొలగించడం వాళ్లు అలవోకగా చేసే పని. వోటర్ మాత్రం చచ్చీ చెడీ అధికారుల చుట్టూ తిరగవలసి వస్తుంది. నెల రోజుల లోపు తనను తాను వోటరునేనని ధ్రువీకరించుకోవాలి. అలా ధ్రువీకరించుకోవడానికి ఎన్నికల సంఘం మొదట 11 రకాల గుర్తింపు కార్డులను ఆమోదిస్తానని ప్రకటించింది. ఆ పదకొండులో ఆధార్ లేదు. అన్నిటికీ ఆధార్ అని ఊదరకొట్టిన ప్రభుత్వం కింద, ఇప్పుడు వోటర్ గుర్తింపుకు అది చెల్లదంటే ఎట్లా అని కేసు సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆధార్ కార్డును కూడా చేర్చారు.

ఇప్పుడు ఎన్నికల సంఘం ఆమోదిస్తున్న 12 పత్రాల జాబితా చూస్తే నవ్వు వస్తుంది. వీటిలో ఏ ఒక్కటైనా అన్నారు గాని, ఒక్కటి కూడా ఉండని వాళ్లు కోట్లాది మంది ఉంటారు. ఇంకా విచిత్రం, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆ జాబితాలో, ఎన్నికల సంఘమే స్వయంగా జారీ చేసిన వోటర్ గుర్తింపు కార్డు లేదు! 1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే గుర్తింపు కార్డు. 2. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసి వంటి సంస్థలు ఇచ్చే గుర్తింపు కార్డు. 3. జనన ధ్రువీకరణ పత్రం. 4. పాస్ పోర్టు. 5. మెట్రిక్యులేషన్ లేదా ఇతర విద్యార్హతా పత్రం. 6. శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం. 7. అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం. 8. కుల ధ్రువీకరణ పత్రం. 9. జాతీయ పౌర పట్టిక. 10. కుటుంబ రిజిస్టర్ పత్రం, 11. ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఇంటి కేటాయింపు పత్రం. 12. ఆధార్. వీటిలో కొన్ని చిన్న సమూహాలకు మాత్రమే వర్తించేవి, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే ఉన్నవి. దేశంలో అందరికీ ఉన్న ఆధార్ నేమో పక్కన పెట్టారు, కొద్ది మందికి మాత్రమే ఉండగలవాటి జాబితా తయారు చేశారు!      

అంటే మౌలికంగా ఇదంతా వోటర్ల జాబితాను సవరించే ప్రక్రియ కాదు, కొత్త వోటర్లను చేర్చే, చనిపోయిన, ఊరు మారిన, రెండు మూడు చోట్ల నమోదై ఉన్న వోటర్లను పద్ధతి ప్రకారం తొలగించే ప్రక్రియ కాదు. అందుకు భిన్నంగా వోటర్ల జాబితానూ సవరణనూ సంక్లిష్టంగా, తిలకాష్టమహిషబంధనంగా, గూడుపుఠాణీగా మార్చే చాణక్య ప్రక్రియ.ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం జాబితాలో ప్రస్తుతం ఉన్న వోటర్లలో నుంచి ఎంపిక చేసిన కొందరిని తొలగించడం. ఆ తొలగింపుకు హేతుబద్ధ కారణాలుగా కనిపించే సాకులు చెప్పడం.  

దేశంలో వోటర్ల జాబితాలు సక్రమంగా లేని మాట నిజమే. తప్పనిసరిగా దొంగ వోట్లను, దొంగ వోటర్లను తొలగించవలసిందే. కాని ప్రస్తుత ఎన్నికల సంఘానికి, అధికార పార్టీకి, ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలన్నిటికీ కూడా దొంగ వోట్లు తొలగించాలనే కోరికేమీ లేదు. దొంగ వోట్ల రాజ్యం నడుస్తున్నదే రాజకీయ పార్టీల వల్ల. కాకపోతే, కచ్చితంగా తమకు వోటు వెయ్యరని అనుమానం ఉన్న వోటర్ల పేర్లు జాబితాలో లేకపోతే బాగుండునని ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటుంది. ఆ కోరికలో భారతీయ జనతా పార్టీ మరొక అడుగు ముందుకు వేసి, మరొక ఆకు ఎక్కువ చదివి, ఎన్నికల సంఘాన్ని తన చెప్పుచేతుల్లో పెట్టుకుని కొత్త ఎత్తు ప్రారంభించింది. గత మూడు ఎన్నికల గణాంకాలన్నిటినీ నిశితంగా అధ్యయనం చేసి ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని వోట్లను గల్లంతు చేస్తే తమకు గెలుపు సాధ్యమవుతుందో కచ్చితమైన పకడ్బందీ లెక్కలు వేసి తన ప్రాబల్యం తక్కువ ఉండే చోట్ల వోట్లు తొలగించే కార్యక్రమం పెట్టుకుంది. సాధారణంగా ముస్లింలు, మహిళలు, దళితులు తమకు వోటు వెయ్యరని సంఘ్ పరివార్ కు నమ్మకం గనుక వారి వోట్లనే పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ప్రతిపక్షానికి బలం ఉన్నచోట్ల వోటర్ల పేర్లు తొలగిస్తున్నారు. అందువల్ల సర్ కత్తి తెలంగాణ మెడ మీద పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి మూల్యం అనే సూక్తి గుర్తుంచుకోవలసిన సమయమిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *