క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాధాన్యం

– ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
– కొరియా తరహాలో క్రీడాకారులను తీర్చిదిద్దే దిశగా అడుగులు
– ఐజీపీఎల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్, ఎన్‌డీటీవీ, ఏఎం గ్రీన్, ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కోర్స్‌లో నిర్వహించిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ శనివారంనాటి ముగింపు కార్యక్రమానికి ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు ముఖ్యమంత్రి ఆహ్వానించారని, మెస్సీ ఫుట్‌బాల్ ఆడటంతోపాటు హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిందని గుర్తు చేశారు. దక్షిణ కొరియా వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాలు క్రీడల్లో వందలాది పతకాలు సాధిస్తున్న తీరును పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారని తెలిపారు. ఒకే విశ్వవిద్యాలయం వంద పతకాలు సాధించడం వెనుక ఉన్న శిక్షణా విధానాలు, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహకాలను అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దక్షిణ కొరియాలోని ఆ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వైస్ ఛాన్సలర్‌తోపాటు క్రీడా అధికారులతో చర్చలు జరిపారని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు క్రీడా శిక్షణ అందించేందుకు ఆ విశ్వవిద్యాలయంతో ఎంఓయూ కుదుర్చుకోవాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రాంతానికి సమీపంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ నిర్వహించడం నగరానికి మరింత ప్రాచుర్యం తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో కొనసాగుతున్న గోల్ఫ్ కోర్సును క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధికి ఉపయోగపడే ముఖ్యమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు పర్యాటక రంగానికి కూడా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

విజేతలకు అభినందనలు

ఐజీపీఎల్ టోర్నమెంట్‌లో పతకాలు, విజయాలు సాధించిన క్రీడాకారులను భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి తమ ప్రతిభతో దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎన్‌డీటీవీ ప్రతినిధులు, తన మిత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి, భాస్కర్ రెడ్డిలు ప్రత్యేకంగా ఆహ్వానించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఐదు నుంచి ఐదున్నర గంటల సమయం పడుతుందని, అయినప్పటికీ ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని గుర్తించి తన ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని వచ్చానని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫిలను ఉప ముఖ్యమంత్రి భట్టి అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *