కొవిడ్ తరహాలో ఎల్ నినో ఎఫెక్ట్‌

– సీఎం రేవంత్ సమీక్ష
– సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తం
– ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
– జూన్ వరకు తాగు, సాగునీటితోపాటు విద్యుత్ సమస్యలపై పకడ్బందీ వ్యూహం
– కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మార్కెట్లో విద్యుత్ కొరత

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటినుంచి వచ్చే జూన్ వరకు తాగు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో ముందస్తుగా సరైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని, అయితే విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నప్పటికీ మార్కెట్ లో విద్యుత్ అందుబాటులో లేదని తెలిపారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ సంక్షోభంలా ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతాలతోపాటు వివిధ మాధ్యమాల ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *