ఘనంగా కిట్స్ 43వ స్నాతకోత్సవం

– ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి హాజరు
– సాంకేతిక ఆవిష్కరణలకు పట్టం కట్టాలని పిలుపు
– 2030 నాటికి క్వాంటం కంప్యూటింగ్, ఎంబెడెడ్ ఏఐ రంగంలో ముందడుగు

హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 24: వరంగల్ కిట్స్ 43వ స్నాతకోత్సవం మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. 2026 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసిన ఈ వేడుకకు కిట్స్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, గౌరవ అతిథిగా కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, కిట్స్ కోశాధికారి పి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ స్నాతకోత్సవం విద్యార్థుల జీవితంలో ముగింపు కాదని, నూతన అవకాశాలు, బాధ్యతలతో కూడిన మరో ప్రయాణానికి ఆరంభమని పేర్కొన్నారు. కాకతీయుల చారిత్రక వారసత్వం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఏఐతో సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, విద్యార్థులు కేవలం సాంకేతికతను వినియోగించేవారిగా కాక సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే సృజనకర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల సాధనలో యువ ఇంజనీర్లు భాగస్వాములు కావాలని సూచించారు. కిట్స్ చేపడుతున్న యుఆర్ఆర్-26 ప్రోగ్రామ్, వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ కొత్త కోర్సులు, ఏఐసీటీఈ-ఐడియా ల్యాబ్, ఎంఎస్ఎంఈ బిజినెస్ ఇంక్యుబేటర్, పరిశ్రమలతో కుదుర్చుకున్న 26 అవగాహన ఒప్పందాలను ఆయన అభినందించారు. విద్యార్థులు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారిగా కాక నూతన ఆవిష్కరణలు చేసి సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే సృజనకర్తలుగా ఎదగాలని సూచించారు. స్వయం సమృద్ధ భారతదేశం, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో యువ ఇంజనీర్లు భాగస్వాములు కావాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పిలుపునిచ్చారు..

ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా ఎదగాలి: కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు

కిట్స్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. పట్టభద్రులు భవిష్యత్తులో ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథి, కిట్స్ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ ఎన్. రమణ మాట్లాడుతూ.. విద్యార్థులు నిరంతర అభ్యాసంతో పాటు నిజాయితీ, క్రమశిక్షణ, మానవతా విలువలను జీవితాంతం పాటించాలని సూచించారు. ట్రెజరర్ పి. నారాయణరెడ్డి విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

1,098 మంది విద్యార్థులకు డిగ్రీ అర్హత

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి వార్షిక నివేదికను సమర్పిస్తూ, 2025-26 విద్యా సంవత్సరంలో సంస్థ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ ఏడాది మొత్తం 1,098 మంది విద్యార్థులు డిగ్రీలకు అర్హత సాధించగా, వారిలో 998 మంది బీటెక్, 44 మంది ఎంటెక్, 56 మంది ఎంబీఏ విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. స్నాతకోత్సవానికి నమోదు చేసుకున్న 750 మంది విద్యార్థులకు కార్యక్రమంలో ఒరిజినల్ డిగ్రీలను ప్రదానం చేసినట్లు వెల్లడించారు. విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 16 బంగారు పతకాలు, 17 అకాడమిక్ మెరిట్ అవార్డులు అందజేసినట్లు తెలిపారు. అలాగే తొమ్మిది మంది విద్యార్థులు బీటెక్ ఆనర్స్ డిగ్రీలు పొందినట్లు పేర్కొన్నారు.

ప్లేస్‌మెంట్లలో విద్యార్థుల ప్రతిభ

ఉద్యోగ నియామకాల వివరాలను వెల్లడిస్తూ, 78 కంపెనీల ద్వారా 468 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ఒరాకిల్ సంస్థ అత్యధికంగా ఏడాదికి రూ.15.50 లక్షల వేతన ప్యాకేజీని అందించిందని పేర్కొన్నారు. అదేవిధంగా 2,104 మంది విద్యార్థులు వివిధ పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

పరిశోధన, ప్రచురణల్లో విశేష పురోగతి

పరిశోధన రంగంలో సంస్థ సాధించిన విజయాలను వివరిస్తూ, స్కోపస్‌లో సంస్థ హెచ్-ఇండెక్స్ 21గా, 11,618 సైటేషన్లతో నమోదైందని, వెబ్ ఆఫ్ సైన్స్‌లో హెచ్-ఇండెక్స్ 15గా, 6,000 సైటేషన్లు సాధించిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 62 ఎస్‌సీఐ ఇండెక్స్ జర్నల్ ప్రచురణలు, 51 స్కోపస్ ఇండెక్స్ జర్నల్ ప్రచురణలు, 55 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయని వివరించారు. అధ్యాపకులు ఐదు పుస్తకాలు, ఎనిమిది పుస్తక అధ్యాయాలు రచించారని, ఒక పేటెంట్ మంజూరవగా, మరో 17 పేటెంట్ దరఖాస్తులు ప్రచురణ దశకు చేరుకున్నాయని తెలిపారు.

2030 స్వర్ణోత్సవం లక్ష్యంగా భవిష్యత్ సాంకేతిక విద్య

కిట్స్ సంస్థ 2030లో నిర్వహించుకోనున్న స్వర్ణోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ సాంకేతిక విద్యకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులను ‘ఏఐ-రెడీ, క్వాంటం-రెడీ, ఫ్యూచర్-రెడీ’గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో రెండు నూతన బీటెక్ కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా క్వాంటం కంప్యూటింగ్, ఎంబెడెడ్ ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఎలెక్టివ్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు వివరించారు. 1980లో ఏకశిల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్థాపించబడిన కిట్స్ వరంగల్, నాణ్యమైన సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం దిశగా కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏకశిల ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ సభ్యులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *