ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి..

మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌
బొల్లారం ప్రభుత్వ ద‌వాఖ‌నలో త‌నిఖీలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 : బొల్లారం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు. శ‌నివారం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో డాక్టర్లు, సిబ్బందిని కలిసి మాట్లాడారు.  ఇన్ పేషంట్ విభాగంలో ప్రతి బెడ్ వద్దకు వెళ్లి రోగులతో మాట్లాడి వారికి వచ్చిన వ్యాధులు, అక్క‌డ అందుతున్న చికిత్స గురించి  అడిగి తెలుసుకున్నారు. కాగా ద‌వాఖాన‌లో అనేక స‌మ‌స్య‌లు త‌మ‌దృష్టికి వ‌చ్చాయ‌ని ఈటల రాజేంద‌ర్ వివ‌రించారు. ఇక్క‌డ‌ అల్ట్రాసౌండ్, రేబిస్ వాక్సిన్, ఇత‌ర ముఖ్య‌మైన మందులు అందుబాటులో లేవ‌ని తెలిపారు. ఎక్స్ రే, బ్లడ్ టెస్టులకు డబ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని తెలిపారు. రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని,  అత్యవసర పరిస్థితులలో ఇబ్బంది అవుతుందని స్థానికులు త‌మ వివ‌రించార‌ని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్ల‌డం కంటే ప్రభుత్వ ద‌వాఖాన‌కు రావడమే మంచిదని వొస్తున్నామ‌ని . కానీ ఇక్క‌డ ఎలాంటి వ‌స‌తులు లేవ‌ని రోగులు చెబుతున్నార‌ని ఎంపీ ఈట‌ల‌ తెలిపారు.
రోగుల‌కు చికిత్స, మందులు అందించేందుకు డాక్టర్లు నర్సులు సరిగ్గా అందుబాటులో ఉండ‌డంలేద‌నే వార్తల నేపథ్యంలో హాస్పిటల్ ను సంద‌ర్శించాన‌ని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. గాంధీ, ఉస్మానియా లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారని మల్కాజిగిరి పరిధిలోని కంటోన్మెంట్ హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించి ప్రజలు, సిబ్బందితో మాట్లాడానని చెప్పారు. డాక్టర్‌కు చూపించడానికి రూ.50 సర్వీస్ చార్జీలు వ‌సూలు చేస్తున్నార‌ని ఆరోపించారు. పూర్తి స్థాయిలో మందులు అందించే యత్నం చేస్తామని ఆయ‌న తెలిపారు. ఈ హాస్పిట‌ల్‌లో డెలివరీలు తక్కువ అవుతున్నాయని, నెలకు 4-5 మాత్రమే చేస్తున్నార‌ని తెలిపారు. ఇది కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ద‌వాఖాన అని ఎంపీగా తాను కూడా కంటోన్మెంట్ బోర్డులో మెంబర్ అయినందున డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే యత్నం చేస్తాన‌ని ఈట‌ల రాజేంద‌ర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *