– ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ విద్యారంగం
– 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో భాగస్వాములు కావాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కహైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : విద్య ద్వారానే సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ భారీగా నిధులు కేటాయించడంతోపాటు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక తెలుగు న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు వందనం-ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అండ్ టీచర్స్ అవార్డ్స్-2026 కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులను ఉన్నతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు అభివృద్ధి సాధించడానికి విద్య కీలకమైన మార్గమని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.ఉపాధ్యాయ నియామకాలు.. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యంవిద్యారంగాన్ని బలోపేతానికి డీఎస్సీ ద్వారా పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల నియామకాలను కూడా పూర్తి చేశామని భట్టి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యాబోధన అందించడంతోపాటు విద్యార్థుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనికి అదనంగా వారానికి మూడు రోజులు పాలు లేదా రాగి జావ అందించే కార్యక్రమాన్ని కూడా విస్తరిస్తున్నామని చెప్పారు.105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలుఅంతర్జాతీయ ప్రమాణాలతో, ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసి నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రీడలు, మైదానాలు, ఇతర పాఠ్యేతర కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు సైతం పాఠశాలల ప్రాంగణాల్లో నివాస సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఉన్నత విద్యారంగ అభివృద్ధిపైనా దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో అవసరమైన నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సాంకేతిక విద్యలోనూ సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. ఐటీఐ కళాశాలలను ఆధునికీకరించడంతోపాటు పాలిటెక్నిక్ విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆధునిక యంత్రాలు, కంప్యూటరైజ్డ్ సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే లక్ష్య సాధనవిద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తులో గేమ్ ఛేంజర్గా మారుతాయని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘గురు వందనం’లో అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొంటూ 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్య సాధనలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే టి.హరీష్ రావు, జీ న్యూస్ సీఈవో, ఎడిటర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.—————————————————————————————————————————————————తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





