– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ వైఖరిని ఖండించిన న్యాయవాదులు
– హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదుల భారీ నిరసన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు సుప్రీంకోర్టు వద్ద సోమవారం ప్రదర్శించిన నాటకీయ వైఖరిని యావత్ దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. భారత న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను నిరసిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు మంగళవారం చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో ఆయన ఒక న్యాయవాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన న్యాయవ్యవస్థ స్వతంత్రతను, రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడేందుకు న్యాయవాద లోకమంతా ఏకతాటిపైకి వచ్చిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ), రాష్ట్రపతి వ్యవస్థ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవం, ఆదరణ, విశ్వాసం ఉండాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్మెంట్ అడిగి రాజకీయ మెమొరాండాలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్లో పేరుమోసిన సీనియర్ న్యాయవాదులు ఉన్నప్పటికీ న్యాయస్థానాల్లో పిటిషన్లు ఎలా దాఖలు చేయాలో రాహుల్కు కనీస సలహా కూడా ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టుల వద్ద ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను అప్రతిష్ఠపాలు చేసే సంస్కృతిని సమాజం ఎన్నటికీ హర్షించబోదని రామచందర్రావు తేల్చిచెప్పారు. మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను లక్ష్యంగా చేసుకుని కేరళం కాంగ్రెస్ అధికారికంగా పోస్టులు పెడుతూ సీజేఐ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం న్యాయవ్యవస్థపై సాగిస్తున్న ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. దిల్లీలో రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ ర్యాలీలు తీయడం వెనుక దాగి ఉన్న శక్తులెవరో దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. గతంలో అనేకసార్లు కోర్టుల్లో క్షమాపణలు చెప్పిన చరిత్ర కలిగిన రాహుల్కు న్యాయవ్యవస్థ అన్నా, న్యాయవాదులు అన్నా, ప్రజాస్వామ్య విలువలు అన్నా ఎలాంటి గౌరవం లేదని విమర్శించారు. ‘సర్’ ద్వారా 13 కోట్ల వోట్లను అక్రమంగా తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు బీజేపీ తరఫున సవాల్ విసిరామని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశిత రాజ్యాంగ నిబంధనల ప్రకారమే వోట్ల నమోదు, తొలగింపు ప్రక్రియ జరుగుతుందని, ఒక్క వోటు కూడా చట్టవిరుద్ధంగా తొలగించలేదని తేల్చిచెప్పారు. అసత్య ప్రచారాలను మానుకోకపోతే ప్రజలే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని రామచందర్రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





