పార్లమెంట్ ఆమోదంతోనే తెలంగాణ ఏర్పాటు

– తేజస్విది మిడిమిడి జ్ఞానం
– బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. భారత రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా తెలంగాణ సిద్ధించింద‌ని  స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటం ఫలితంగా తెలంగాణ సాక్షాత్కరించిందని మాజీ మంత్రి చెప్పారు. మిడిమిడి జ్ఞానం, అవగాహన లోపంతో బీజేపీ ఎంపీలు తెలంగాణ ఏర్పాటుపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఏర్పాటు పక్రియపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన ఎనిమిదిమంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఎంపీ తేజస్వీ, బీజేపీ క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు తేజస్వి వ్యాఖ్యలను బీఆర్ఎస్ కూడా ఖండించింది. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగానికి అవమానం జరిగిందని దాసోజు శ్రవణ్ అన్నారు. రాష్ట్రాన్ని అవమానిస్తుంటే దిల్లీలో ఊడిగం చేస్తున్నారా అని రాష్ట్ర ఎంపీలపై మండిపడ్డారు. దిల్లీలో డప్పు కొట్టే ఎంపీలకు తెలంగాణ ఆత్మగౌరవం పట్టదా అని నిలదీశారు. తేజస్వి సూర్య అజ్ఞాన సూర్యుడు. తెలంగాణది బలిదానాల చరిత్ర.. అది నీ బుర్రకెక్కితేనే నోరు తెరువు అని హితవు పలికారు. మొరిగే ఎంపీలని ఆపండి.. లేదంటే తెలంగాణ గడ్డపై బీజేపీకి అడుగుపెట్టే అర్హత లేదు అని  హెచ్చరించారు. ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా అవమానం జరిగిందని, తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
————————————————————————————————————————————————————————————-తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *