– ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు
– బీఆర్ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాల్సిన విషయం అని అన్నారు. ఏళ్లతరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలలతరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణమని అన్నారు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20-30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు అంటే కమీషన్లు ఇవ్వలేదనే కారణంతోనే వారి బిల్లులు ఆపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలేనా అన్నారు. మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆవేదన వినే సమయం కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగారు. వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా అన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెన్ఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. సర్వీసులో ఉన్ననాడు దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం.. అనైతికం అని అన్నారు. సమస్యలు వినడానికే సిద్ధంగా లేని ప్రభుత్వం పరిష్కారం ఎలా చూపుతుందని అడిగారు. ప్రజల సమస్యలు వినాల్సి ఉండగా తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను పోలీసులతో అడ్డుకునే పరిస్థితి దారుణమన్నారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజా పాలన అని అడిగారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఇది ప్రజా పాలనా లేక కాంగ్రెస్ మార్క్ వంచనా అని హరీష్‌రావు ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





