– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– రూ.60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు
– రూ.450 కోట్లతో 1.30 లక్షల మందికి స్కాలర్‌షిప్‌ల జమ
– ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు అక్టోబరు 15 వరకు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ పథకానికి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా ఫూలే) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేయగా ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద మొదటి, రెండవ విడతలుగా 180 మంది విద్యార్థులకు రూ.18 కోట్ల 40 లక్షలను విడుదల చేశామని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే(డీబీటీ పద్ధతి ద్వారా) జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటివరకు 1,30,000 మంది విద్యార్థులకు రూ.450 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.60 కోట్లతో కాటమయ్య రక్షణ కవచాలు
గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన కాటమయ్య రక్షణ కవచాలు పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్లు భట్టి విక్రమార్క వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో పదివేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక ఈ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాý మాయాదేవి, ఎంజేపీ సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, పద్మ, ఇందిరా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





