టీఎంసీ పేరు, గుర్తు నిర్ణయంపై ఈసీఐకు గడువు

– మూడు నెలల సమయం నిర్దేశించిన సుప్రీం కోర్టు

న్యూదిల్లీ, సెప్టెంబర్ 28 : తృణమూల్ కాంగ్రెస్‌లోని రెండు వర్గాలలో ఏ వర్గానికి పార్టీ పేరు, గుర్తు(పూలు-గడ్డి)ను ఉపయోగించే హక్కు ఉందో నిర్ణయించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి సుప్రీంకోర్టు సోమవారం గడువును విధించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారానికి సంబంధించిన వాదనలు, పత్రాల సమర్పణ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని రెండు టీఎంసీ వర్గాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడు నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీఐని కోర్టు ఆదేశించింది. ఆరు నెలల సమయం కావాలని ఈసీఐ తరఫు న్యాయవాది కోరగా కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. మూడు నెలల సమయం సరిపోతుంది అని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. అది చాలా కష్టం అని న్యాయవాది పట్టుబట్టగా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే అప్పుడు మమ్మల్ని ఆశ్రయించండి అని కోర్టు బదులిచ్చింది. రెండు ప్రత్యర్థి టీఎంసీ వర్గాలలో ఏది అసలైనది అనే దానిపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరు, దాని పూలు-గడ్డి గుర్తును స్తంభింపజేస్తూ ఈసీఐ ఈనెల 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మేలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కొద్దికాలానికే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని పదిమంది టీఎంసీ ఎమ్మెల్యేలు మమత నాయకత్వంలోని పార్టీపై తిరుగుబాటు చేసి ఒక కొత్త టీఎంసీ వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ తిరుగుబాటు వర్గం తమను తాము ఏఐటీసీ-డెమోక్రటిక్‌గా పిలుచుకుంటోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఏఐటీసీ-మమత’ వర్గంగా వ్యవహరిస్తున్నారు. రెండు వర్గాలు కూడా తామదే అసలైన టీఎంసీ అని వాదిస్తున్నాయి. ఈ అంశం ఈసీఐ పరిశీలనలో ఉంది. తుది నిర్ణయం వెలువడే వరకు టీఎంసీ పేరు, గుర్తును స్తంభింపజేయాలని ఈసీఐ 17న నిర్ణయించింది. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరు, గుర్తును ఉపయోగించకుండా రెండు వర్గాలను ఈసీఐ మధ్యంతర ఉత్తర్వు నిరోధిస్తున్నది. ప్రస్తుతానికి రెండు టీఎంసీ వర్గాలకు కూడా ఈసీ సవరించిన పేర్లు, గుర్తులను కేటాయించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనే పేరు, ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తును ఇచ్చారు. ప్రత్యర్థి వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ అనే పేరు, ఎన్వలప్ గుర్తును కేటాయించారు. అక్టోబర్ 6న జరగనున్న నందిగ్రామ్, రేజినగర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఉప ఎన్నికల దృష్ట్యా ఈ ఏర్పాటు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈసీఐ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై గత విచారణలో ఈసీఐ తన నిర్ణయాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈసీఐ తుది తీర్పు కోసం ఒక కాలపరిమితిని సోమవారం నిర్దేశించింది. సీనియర్ న్యాయవాదులైన కపిల్ సిబల్, కళ్యాణ్ బెనర్జీలు మమతా బెనర్జీ తరఫున వాదించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *