– రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి తుమ్మల
– క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలి
– పామాయిల్ ధరపై కమిటీ వేస్తామన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్
న్యూదిల్లీ, సెప్టెంబర్ 29 : పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో గత ఏడాది ఖరీఫ్ కంటే 36% అధికంగా సాగుచేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతితోపాటు రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను మంగళవారం జరిగిన జాతీయ రబీ సదస్సులో ఆయన వివరించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో 36% వృద్ధితో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు మొక్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) పరిధిలోకి తీసుకురావాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అనేక మండలాలు లోటు, తీవ్ర లోటు వర్షపాత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ట్ర సగటు వర్షపాతం ఆధారంగా కాక మండలాల స్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని లోటు, తీవ్ర లోటు వర్షపాత మండలాలకు ప్రత్యేక కేంద్ర సహాయం అందించాలని కోరారు. సూక్ష్మ సాగునీరు, రక్షిత సాగునీరు, నీటి సంరక్షణ నిర్మాణాలకు ప్రత్యేక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్ సాగు విషయంలో తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు విస్తరించిందని, సుమారు 72 వేల మంది కొత్త రైతులు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చారని వివరించారు. రైతులకు స్థిరమైన, గిట్టుబాటు ధరలు ఎంతో ముఖ్యమని, రైతుల్లో నమ్మకాన్ని కొనసాగించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు. దిగుమతుల విధానం కూడా రైతులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆయిల్‌పామ్ ధరలపై ప్రత్యేక కమిటీని నియమించి రైతుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు. తెలంగాణలో మట్టి ఆరోగ్య పరీక్షల లక్ష్యాన్ని ప్రస్తుతమున్న సుమారు లక్ష నుంచి రెండు లక్షలకు పెంచాలని కోరారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఆర్‌ను కోరారు. కొడంగల్‌లో అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ క్రాప్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లను సమర్పించిందని మంత్రి తెలిపారు. కీలకమైన ఈ రెండింటికి కేంద్రం సహకారం అందించాలని కోరారు. రైతులకు కేవలం విత్తనాలు, ఎరువులే కాక సాంకేతిక పరిజ్ఞానం, నేల ఆరోగ్య సమాచారం, సకాలంలో రుణాలు, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, వ్యవసాయ విస్తరణ సేవలు, మౌలిక వసతులు, నమ్మకమైన మార్కెట్లు అవసరమని మంత్రి పేర్కొన్నారు. పరిశోధన, వ్యవసాయ విద్య, విస్తరణ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే కొత్త సాంకేతిక పరిజ్ఞానం రైతులకు వేగంగా చేరుతుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





