– పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలి
– అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
ఫ్రాంక్ఫర్ట్(జర్మనీ), సెప్టెంబర్ 29 : రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, గ్రేటర్ హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చెప్పారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిందని ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు. జర్మనీలో ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటన కొనసాగుతోంది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, తెలుగు ప్రవాసులతో అనుసంధానం అంశాలపై సమావేశం నిర్వహించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్, టెక్నాలజీ వంటి వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌లను భారత కాన్సులేట్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు తమ మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే తెలంగాణ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. జర్మనీతోపాటు యూరప్‌లోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కోరారు. ప్రవాస తెలంగాణ వాసులు రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను తీసుకురావడంలో గొప్ప వారధిగా నిలవాలని స్పీకర్ సూచించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు తమ ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకోవడం చాలా గర్వకారణమని, వారు జన్మభూమి అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ ఆర్.తిరుపతి, లేజిస్లేచర్ ప్రతినిధి బృందం సభ్యులు, భారత కాన్సులేట్ అధికారులు, తెలుగు ప్రవాసులు తదితరులు పాల్గొన్నారు. జర్మనీ-భారత పార్లమెంటరీ మైత్రి కార్యక్రమంలో భాగంగా 2024లో జర్మనీలోని రైన్‌ల్యాండ్ రాష్ట్ర స్పీకర్ హెండ్రిక్ హెరింగ్ బృందం హైదరాబాద్‌లోని అసెంబ్లీని సందర్శించింది. ఇప్పుడు దానికి రిటర్న్ విజిట్‌గా తెలంగాణ స్పీకర్ బృందం జర్మనీలో పర్యటిస్తోంది. యూరప్‌లోని జర్మనీ తర్వాత ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లో ఈ బృందం పర్యటించనుంది. వచ్చే నెల 9న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. విదేశీ పర్యటనలో భాగంగా అసెంబ్లీ ప్రతినిధి బృందం ఆయా దేశాల పార్లమెంట్లను సందర్శించి అక్కడి పార్లమెంటరీ విధానాలను పరిశీలిస్తుంది.
————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





