నేను పోటీలో ఉన్నా..

  • తప్పుడు ప్రచారాలను నమ్మకండి
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ
  • పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు బరిలో నిలుస్తున్నా..
  • సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు అవాస్తవం
  • పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమన్న సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో దృఢంగా నిలుస్తున్నానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన ఆయన విడుదల చేశారు. తన పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింద‌ని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

అయితే త‌న‌ అభ్యర్థిత్వంపై కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను టికెట్ అడగలేదని , ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేనని చేతులెత్తేశారని, యూ టర్న్ తీసుకున్నారని అంటూ ప్రచారం చేయడం దుర్మార్గ‌మ‌ని అన్నారు. తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని ఎక్కడ కూడా చెప్పలేదని పేర్కొన్నారు.
పార్టీ త‌న‌కు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో స్వీకరిస్తున్నానని తెలిపారు. యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లడం త‌న‌ లక్ష్యమని తెలిపారు. త‌న దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల గురించి గతంలో చెప్పిన విషయాలను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, పట్టభద్రుల సమస్యలకు బలమైన ప్రాతినిధ్యం వహించడమేనని త‌న ప్ర‌స్తుత ల‌క్ష్య‌మ‌ని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఎన్నికల బరిలో ఉన్నానని, పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. ఇక “రెండు సీట్లు రెడ్లకే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చిందని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని మార్చబోతోందని” చేస్తున్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా త‌ప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని, అస‌త్య‌ ప్రచారాలు చేసే వారి పై చర్య తీసుకుంటానని సర్వోత్తం రెడ్డి హెచ్చ‌రించారు. తన అభ్యర్థిత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణుల‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *