– ఒత్తిళ్లను తట్టుకుని నిలబడడమే గొప్ప విషయం
– మరసం 40 వసంతాల మహా సభలో బీఆర్ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : సంఘాలు పెట్టడం సులువే కానీ ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని 40 ఏళ్లపాటు మంజీరా రచయితల సంఘం(మరసం) నిలబడిందంటే అందులోని కవుల నిబద్ధత, నిజాయతీయే కారణం అని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు పేర్కొన్నారు. మరసం 40 వసంతాల మహా సభలో ఆయన ప్రసంగించారు. మరసంతో తనకు రెండు దశాబ్దాలకు పైగా దగ్గరి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాల ఒత్తిళ్లు, ఆకాశ రామన్న లేఖల బెదిరింపులు వచ్చినా, ఉద్యోగాల నుంచి తీసేస్తామని అధికారులు భయపెట్టినా, రామలింగన్న లాంటి వారిని టాడా చట్టం కింద జైల్లో పెట్టినా భయపడకుండా నిలబడ్డ గొప్ప చరిత్ర మరసం సొంతం అన్నారు. మరసం కేవలం పుస్తకాలు, కవిత్వానికే పరిమితం కాలేదని, 1992 నాటి మద్యపాన నిషేధ ఉద్యమం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, గుట్కా నిషేధం వంటి ఎన్నో ప్రజా, సామాజిక సమస్యల మీద పోరాడిన గొప్ప సంస్థ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ కవులు, మేధావులు లేరని చిన్నచూపు చూసిన వారికి తెలంగాణ రచయితల వేదిక ద్వారా నందిని సిద్ధారెడ్డి గట్టి సమాధానం చెప్పారని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి ప్రిన్సిపాల్‌గా వచ్చిన ప్రమోషన్‌ను సైతం వదులుకుని సిద్దిపేట మట్టి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం సిద్ధారెడ్డి లెక్చరర్‌గానే ఉండిపోయారన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.కోటిని కూడా కాదనుకుని తన నిబద్ధతను చాటుకున్నారన్నారు. ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎన్ని సస్పెన్షన్ నోటీసులు వచ్చినా లెక్కచేయకుండా దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారన్నారు. తనలో రాజకీయ పరిణతి రావడానికి, భాష, ఉపన్యాస శైలి మెరుగుపడటానికి సిద్ధారెడ్డి, దేశపతి వంటి వారి కృషే కారణమన్నారు. సకల జనుల సమ్మెతో దేశ రాజకీయాలను, కేంద్రాన్ని కదిలించిన ఆనాటి 41 రోజుల చారిత్రక ఘట్టం వెనుక దేవీ ప్రసాద్ వ్యూహం, ఆయన పోషించిన ప్రధాన కార్యదర్శి భూమిక ఎంతో గొప్పదని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో మంజీరా నదిలో చుక్క నీరు వాడుకోవాలన్నా, కనీసం చెక్‌డ్యాం కట్టాలన్నా ఆంక్షలు ఉండేవని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మంజీరాపై పదుల సంఖ్యలో చెక్‌డ్యాంలు నిర్మించి దాన్ని జీవనదిగా మార్చారని, నేడు సింగూరు జలాలు మెదక్ జిల్లాలో గలగలా పారుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రద్దు చేసిన సాహిత్య అకాడమీని తెలంగాణ వచ్చాక కేసీఆర్ పునరుద్ధరించి సిద్ధారెడ్డిని తొలి చైర్మన్‌గా నియమించి ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించారన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కనీసం సాహిత్య అకాడమీకి చైర్మన్‌ను నియమించలేదని, అకాడమీకి తాళం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవించుకున్నామని చెప్పారు. నేటి డిజిటల్ యుగంలో ఉయ్యాలలో ఊగాల్సిన పిల్లలు ఫోన్లలో ఊగుతున్నారని, చందమామను చూపిస్తూ అన్నం తినిపించే రోజులు పోయి సెల్ ఫోన్ చూపిస్తూ తినిపించే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనివల్ల పుస్తక పఠనం బాగా తగ్గిపోతోందన్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ప్రయాణాల్లో కూడా పుస్తకాలు చదువుతారుని తెలిపారు. మన దగ్గర కూడా పుస్తక పఠనాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. రేపటి తరానికి తెలంగాణ ఉద్యమం గురించి, మన పోరాటాల గురించి తెలియాలంటే పుస్తకమే ఆధారమన్నారు. సమాజంలో అణచివేతపై పోరాడటానికి కవిత, పాట ఒక ఆయుధం.. అలాంటి సాహిత్యాన్ని, కవులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





