మహిళా భద్రతకు ‘సహచరి’

– మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ రూప‌క‌ల్ప‌న‌
– రేపు ‘మీ సురక్ష–సహచరి’ కార్య‌క్ర‌మం ప్రారంభం

మ‌ల్కాజ్‌గిరి, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష–సహచరి అనే వినూత్న క‌మ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. క‌మిష‌న‌ర్‌ బి.సుమ‌తి ఆధ్వ‌ర్యంలో రెండు కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.ఈ కార్యక్రమం ద్వారా స్వ‌యంస‌హాయ‌క సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో భాగ‌స్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడాన్ని పోలీస్ క‌మ్యూనిటీ లక్ష్యంగా పెట్టుకుంది. మల్కాజిగిరి జోన్ పరిధిలోని ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం బోయిన్‌ప‌ల్లిలోని ఇంపీరియ‌ల్ గార్డెన్ లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఎల్‌బి న‌గ‌ర్, ఉప్ప‌ల్ జోన్ ప‌రిధిలోని ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం నాగోల్‌లోని శివం క‌న్బెన్ష‌న్ లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. ఈ కార్యక్రమంలో మొదటి దశగా 3,195 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడ‌ర్లుగా శిక్షణ ఇస్తారు. మ‌హిళా శిశు సంక్షేమం, సైబ‌ర్ నేరాల నిరోధం, డ్ర‌గ్స్ వాడ‌కానికి వ్య‌తిరేకంగా చైత‌న్య ప‌ర‌చ‌డం, రోడ్డు భ‌ద్ర‌త‌, న్యాయ‌ప‌ర‌మైన ప‌రిజ్ఞానం, క‌మ్యూనిటీ పోలీసింగ్ వంటి  అంశాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలు కమిషనరేట్ పరిధిలోని సుమారు 2.70 లక్షల ఎస్‌హెచ్‌జీ మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా నేర నిరోధంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పోలీస్‌-క‌మ్యూనిటీ సంబంధాలను బలోపేతం చేయడం, సురక్షితమైన సమాజ నిర్మాణానికి తోడ్పడడం ప్రధాన లక్ష్యం. సామాజిక భ‌ద్ర‌తా అంబాసిడ‌ర్లు తమ పరిధిలోని ఎస్‌హెచ్ఓల‌తో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నేరాలను సకాలంలో పోలీసులకు తెలియజేసేలా ప్రజలను ప్రోత్సహించడం, గ్రామీణ స్థాయిలో పోలీస్‌-క‌మ్యూనిటీ భాగ‌స్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం వంటి బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు పోలీస్ స్టేష‌న్లు, మ‌హిళా పోలీస్ స్టేష‌న్లు, భ‌రోసా కేంద్రాలు, మ‌హిళాభివృద్ధి మ‌రియు శిశు సంక్షేమ కేంద్రాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్లను సంద‌ర్శించి పోలీస్ సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు ఆయా సంస్థల పనితీరును తెలుసుకుంటారు. ప్రారంభ కార్యక్రమాల అనంతరం పాల్గొనే ఎస్‌హెచ్‌జీ మహిళలు బేగంపేట మ‌హిళా పోలీస్‌స్టేష‌న్ రియు తమ పరిధిలోని శాంతి భ‌ద్ర‌త‌ల పోలీస్ స్టేష‌న్ ను సందర్శించి క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా  పోలీస్ సేవలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *