– రైతులు నష్టపోకుండా మూడు దశల ముందస్తు కార్యాచరణ
– ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల సమీక్ష
– కలెక్టర్లు, వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: ప్రస్తుత ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ ఇక్రిశాట్‌లో భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధరంగ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలను సమగ్రంగా పరిశీలించి, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా తుది కార్యాచరణపై మంత్రి చర్చించారు. ముందుగా వివిధ సంస్థల శాస్త్రవేత్తలు ఎల్-నినో పరిస్థితులను తట్టుకునేలా తాము సిద్ధం చేసిన కార్యచరణను మంత్రికి తెలియచేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, మధ్యలో దీర్ఘకాలిక పొడి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 15, 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పరిస్థితులకనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈనెల 15 వరకు వర్షాలు ఆలస్యమైతే 16.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 30 వరకు ఆలస్యమైతే 13.82 లక్షల క్వింటాళ్లు, ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే 12.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసి ముందుగానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇరిగేషన్, భూగర్భజల శాఖ, మిగతా శాఖల అధికారులు నీటి లభ్యత వివరాలు, విద్యుత్ సరఫరాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. అన్ని జిల్లాల వర్షపాతం పరిస్థితులను ప్రభుత్వం రోజువారీగా సమీక్షించాలని ఆదేశించారు. 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 20 జిల్లాల్లో లోటు ఉందన్నారు. వర్షాభావ జిల్లాల్లో కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. శాస్త్రీయ విధానాలతో ఎల్-నినోను ఎదుర్కోవాలని, దీనికి సంబంధించి డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్(డీఎసఆర్) విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు.
మండలాల వారీగా వారపు బులెటిన్
ఎల్-నినోను ఎదుర్కోవాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని మంత్రి తుమ్మల అన్నారు. భారత వాతావరణ శాఖ(ఐఎండీ), నీటిపారుదల, భూగర్భ జý, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో ప్రతి వారం మండలాల వారీగా సమగ్ర వ్యవసాయ-వాతావరణ బులెటిన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు ఆఖరు వరకు ప్రతీ వారం విడుదల చేసే ఈ బులెటిన్‌లో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రాబోయే వారానికి, నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలు, డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశాలు, గరిష్ఠ-కనిష్ఠ ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలతోపాటు నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో ఈ నెల, వచ్చే నెలకు సంబంధించిన వాతావరణ అంచనాలను విశ్లేషించి, ఆయా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉండే నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, సాగునీటి లభ్యతపై ఖచ్చితమైన అంచనాలను కూడా బులెటిన్‌లో పొందుపరచాలని మంత్రి స్పష్టం చేశారు.
శాస్త్రవేత్తల సూచనలు
వర్షపాతం నమోదై భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో (బీబీఎఫ్) లేదా రిడ్జ్ అండ్ ఫరో పద్ధతులను అనుసరించాలని, భూమిలో తేమ ఏర్పడే వరకు ఎరువుల వినియోగాన్ని వాయిదా వేయాలని, నేల తేమను కాపాడేందుకు తరచూ ఇంటర్ కల్టివేషన్ చేపట్టాలని, వర్షాలు కురిసిన తర్వాత మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులు వేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. పంటల కీలక ఎదుగుదల దశల్లో ప్రాణాధార నీటిపారుదల అందించడం, వరుస పంటల్లో స్కిప్ రో ఇరిగేషన్ అమలు చేయడం, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల్లో 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయడం, ప్రతి 3.6 మీటర్లకు ఒక డెడ్ ఫరో ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించడం, వ్యవసాయ కుంటల్లో నిల్వ చేసిన నీటిని అవసరమైన సమయంలో వినియోగించడం, అంతర పంటలను ప్రోత్సహించడం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారని మంత్రి తెలిపారు.
వరి రైతులకు ప్రత్యేక సూచనలు
ప్రస్తుతం వరి పంట నారుమడి దశలో ఉన్న రైతులు నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3సీజీ గ్రాన్యూల్స్ వేయాలని, నాటే సమయంలో నారు ఆకుల చివరలను కత్తిరించి నాటాలని, 15/10 సెంటీమీటర్ల దూరంతో దగ్గరగా నాటి ప్రతి గుంతలో 6-8 మొక్కలు ఉంచాలని, సిఫార్సు చేసిన మోతాదుతో పోలిస్తే 25 శాతం అదనపు నత్రజని ఇవ్వాలని, మొత్తం నత్రజనిలో 70 శాతం నాటే సమయంలో, మిగిలిన 30 శాతం పూత ప్రారంభ దశలో వేయాలని మంత్రి అన్నారు. నీటి పొదుపు కోసం ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ) పద్ధతిని అమలు చేయాలన్నారు. నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. కాల్వల ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి వరికి బదులు మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. మొక్కజొన్న, పత్తి పంటలు ప్రస్తుతం మొలక దశలో ఉన్నందున రాబోయే రెండు వారాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే నేల తేమను కాపాడేందుకు కలుపు నియంత్రణ చర్యలు రైతులకు సూచించాలని మంత్రి తెలిపారు.
విత్తనాల, ఎరువుల కొరత ఉండదు
అవసరమైన విత్తనాలు, ఎరువులపై ఇప్పటికే సమగ్ర అంచనా వేûశామని మంత్రి తెలిపారు. మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే సమీకరించామని, మార్క్‌ఫెడ్, విత్తన సంస్థలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఇక్రిశాట్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, కమిషనర్ కోఆపరేషన్ రాహుల్ రాజ్, హాకా ఎండీి చంద్రశేఖర్, గిడ్డంగుల శాఖ ఎండీ లక్ష్మి, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, అగ్రి, హార్టికల్చర్ యూనివర్సి టీల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, ఇక్రిశాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హరికిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





