ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన పాలకులు

– కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా మార్పు రాలేదు
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : స్వరాష్ట్రం కోసం, భావితరాల బాగుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, సమిధులైన అమరవీరులందరికీ ఈ శుభసందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఘన నివాళులు అర్పించారు. కోట్లమంది ప్రజల శతాబ్దాల కల, వందలాదిమంది యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దురదృష్టవశాత్తు గత 12ఏళ్ళ కాలంలో పాలకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి కేవలం తమ ‘బంగారు కుటుంబాన్ని’ మాత్రమే సృష్టించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులైన నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షను తుంగలో తొక్కి రాష్ట్ర సంపదను దోచుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా గాలికొదిలేసి, రాష్ట్రాన్ని కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అవినీతి, దోపిడీ, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఆరోపించారు. గత పాలకుల అహంకార అవినీతి పాలన నుంచి విముక్తి లభిస్తుందని, తమ జీవితాలలో మార్పు వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే గత రెండున్నరేళ్లలో ఆశించిన మార్పు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. కాంగ్రెస్ కూడా అదే అవినీతి, దోపిడీ బాటలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ భూముల దందాలతో దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తోందని ఆరోపించారు. అమరవీరులు ఏ ఆశయాల కోసమైతే ప్రాణత్యాగం చేశారో ఆ నిజమైన ప్రజాస్వామిక, సామాజిక సమృద్ధివంతమైన తెలంగాణ ఇంకా సాకారం కావాల్సి ఉందన్నారు. కేవలం ఒక కుటుంబం కోసమో, లేదా కొందరు రాజకీయాల ముసుగులో చేసే వ్యాపారాల కోసమో తెలంగాణ ఏర్పాటు కాలేదంటూ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కాపాడేందుకు, అమరవీరుల కలలు నిజం చేసేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *