– 700 ప్రత్యేక బస్సులు
– భక్తుల సౌకర్యార్థం 24 గంటలపాటు ప్రత్యేక బస్సులు
-26న తెల్లవారుజామున 1 గంట వరకు మెట్రో సేవల పొడిగింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్ర రాజధానిలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలకు, అక్కడి నుంచి తిరిగి వివిధ రూట్లకు 700 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు నిరంతరాయంగా బస్సు సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, ప్రయాణికుల రద్దీని సమన్వయం చేసేందుకు 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను నియమించారు. అలాగే ప్రయాణికుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జోనల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నిమజ్జన సమయంలో అత్యవసర సహాయం అందించేందుకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వి.వి.విగ్రహం వద్ద ఆర్టీసీ రిలీఫ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఖైరతాబాద్, లక్షీకాపూల్, కోటి, బషీర్ బాగ్, ఇందిరా పార్క్, ఏఐఆర్ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. బస్సుల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ల వద్ద 113 మంది డ్రైవర్లు. 87 మంది మెకానిక్ ను అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసులు అయిన ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సుల రూట్లలోనూ అవసరమైన మార్పులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిమజ్జనం శనివారం ఉదయం వరకు కొనసాగినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలతో టీజీఎస్ ఆర్టీసీ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
గణేష్ నిమజ్జన శోభాయాత్రకు తరలివచ్చే వేలాదిమంది భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని పురస్కరిం చుకుని మెట్రో రైలు సర్వీసుల వేళలను పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 25వ తేదీన ప్రారంభమయ్యే మెట్రో సర్వీసులు అర్థరాత్రి దాటాక 26న తెల్లవారు జామున 1 గంట వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





