రూ.39 లక్షలకు బాలాపూర్ లడ్డూ వేలం

– ద‌క్కించుకున్న‌ ప్రణీత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఎంతో ప్రత్యేకత గల 21 కిలోల బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.39 లక్షలకు అర్బన్ గ్రూప్‌నకు చెందిన వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌ సామ ప్రణీత్ రెడ్డి వేలంలో దక్కించుకున్నారు. వేలం పాటలో మర్రి రవికిరణ్ రెడ్డి(చంపాపేట్), కేవీఏ ఫ్లవర్ మర్చంట్ కందాడ శాలిని వీరేందర్ రెడ్డి (చంపాపేట్), కంచర్ల శివారెడ్డి(హస్తినాపురం), ది సుషీ కో- సామ దయానంద్ రెడ్డి అండ్ సామ వరణంద్ రెడ్డి(లండన్), జీఎనఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి(హస్తినాపురం), శ్రీకాంత్- పీఎస్‌కే గ్రూప్, ఇబ్రాం ప్రత్యూష్(బాలాపూర్) పాల్గొన్నారు. చివరకు రూ.39 లక్షలకు ప్రణీత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ కోసం తొమ్మిదిమంది దరఖాస్తు చేసుకోగా అందులో ఐదు కంపెనీలు ఉండటం విశేషం. లడ్డూ కోసమే ఎన్‌ఆరఐలు బాలాపూర్‌కు తరలివచ్చారు. గతేడాది రూ.35 లక్షలు పలకగా ఈ ఏడాది రూ.4 లక్షల అదనపు ధ‌ర‌ వచ్చింది. వినాయకుడి లడ్డూను సొంతం చేసుకుంటే సుఖసంతోషాలతోపాటు సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. లడ్డూ వేలం అనంతరం గణేశ్ విగ్రహం ఊరేగింపు (మొత్తం 19 కిలోమీట‌ర్లు) ప్రారంభం కాగా చార్మినార్ మీదుగా సాగింది. వినాయకుడిని పొద్దుపోయాక‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.

1994లో లడ్డూ వేలం పాట ప్రారంభం 

1994లో బాలాపూర్ ఉత్సవ సమితి లడ్డూ వేలం పాట ప్రారంభించగా తొలిసారి రూ.450 ధర పలికింది. అప్పటినుంచి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. మొదటిసారి రైతు కొలను మోహన్‌రెడ్డి వేలంలో దక్కించుకుని కుటుంబ సభ్యులు, బంధువులకు పంచి మిగతాది పొలాల్లో చల్లారు. భగవంతుడు సుఖసంతోషాలను అందించారనే నమ్మకంతో మరుసటి ఏడాదితోపాటు 1998, 2004, 2008లోనూ ఆయనే పోటీ పడి దక్కించుకున్నారు. 2009లో సరిత అనే మహిళ రూ.5.10 లక్షలకు సొంతం చేసుకున్నారు. 2020లో కరోనా నేపథ్యంలో వేలం వేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. 2024లో కొలను శంకర్‌రెడ్డి రూ.30.01లక్షలకు, గతేడాది లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *