యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు  రూ.2 కోట్ల  చేయూత  

  • విద్యకు చేసే సాయం తరతరాలకు ఉపయోగం
  • డిజిపి సి.వి.ఆనంద్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 1: యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (Young India Police School) నిర్మాణానికి కార్పొరేట్‌ సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని డిజిపి సి.వి.ఆనంద్ అన్నారు. విద్య కోసం అందించే సహాయం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని, దాని ప్రయోజనాలు భవిష్యత్‌ తరాలకు కూడా అందుతాయని పేర్కొన్నారు. మంచిరేవులలోని వైఐపీఎస్ అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి ఎంవైకే లాటిక్రెట్‌ (ఎంవైకే ఫౌండేషన్‌) రూ.2 కోట్ల  కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) లో భాగంగా ఈ విరాళాన్ని అందించింది. ఎంవైకే లాటిక్రెట్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ మురళీ యాదమ గురువారం డిజిపి కార్యాలయంలో సి.వి. ఆనంద్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించడమే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లక్ష్యమన్నారు. విద్యా సంస్థల నిర్మాణానికి కార్పొరేట్‌ సంస్థలు, దాతలు, ఇతర భాగస్వాములు అందిస్తున్న సహకారం ప్రాజెక్టుకు మరింత బలాన్నిస్తుందని చెప్పారు. విద్యారంగానికి ఇచ్చే విరాళం, చేయూత  ఎప్పటికీ విలువైనదేనని, సమాజ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని డిజిపి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *