24 గంటల కరెంట్ హామీ ఏమైంది..?

  • మన రైతుల పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్ కు విద్యుత్ అమ్ముకుంటారా..?
  • కనీసం 7, 8 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది..
  • లో వోల్టేజ్ తో మోటార్లు, ట్రాన్స్ ఫార్మ‌ర్లు  కాలిపోతున్నాయి..
  • గత ప్రభుత్వ హయాంలో రోలింగ్ స్టాక్ ఉంటే..
  • ఏడాదిలో 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌ .
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీష్‌రావు ధ్వజం
  • 20 గంటల నాణ్యమైన విద్యుత్, పెండింగ్ కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ 
  • నంగునూరు మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 1 : మన రాష్ట్రంలో  రైతులకు కరెంట్ సక్రమంగా లేక పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌కు సింగరేణి విద్యుత్ అమ్ముకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు (BRS Deputy Floor Leader Harish Rao) ధ్వజమెత్తారు. గురువారం ఆయన నంగునూరు మండలంలోని పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాలలో పర్యటించారు. అనంతరం నర్మెట సబ్ స్టేషన్ ను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై మీడియాతో మాట్లాడారు.. పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాలలో రైతులను నేరుగా కలిసిన సమయంలో ప్రతీ రైతు విద్యుత్ లో వోల్టేజ్తో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని ఫిర్యాదు చేశారన్నారు.  ఈ పరిస్థితిని తెలుసుకునేందుకు సంబంధిత నర్మెట సబ్ స్టేషన్ కు వెళ్లి పరిశీలించగా ఏ రోజూ రైతులకు 10 గంటల కరెంటు రావడం లేదని, కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా వస్తున్నట్లు తెలిసిందన్నారు.

కేసీఆర్  ప్రభుత్వంలో 22 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే గగ్గోలు పెట్టి విమర్శ చేసిన కాంగ్రెస్ వాళ్లు నేడు అందులో సగం గంటలు కూడా ఇవ్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అంక్షాపూర్ లో ఓ యువ రైతు తన ఎనిమిది ఎకరాల పొలం కరెంటు లేక ఎండిపోతోందని తన గోడును వెళ్లబుచ్చాడన్నారు.  పాలమాకులలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే ఇప్పటికీ ఇవ్వలేదు, కరెంటు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా నంగునూరులో 3, గట్లమల్యాలలో 2 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి మూడు రోజులైనా కొత్తవి ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒక్క మండలంలోనే వారంలో 41 ట్రాన్స్ ఫార్మర్లు, 100 నుంచి 200 మోటార్లు కాలిపోయినట్లు రైతులు తెలిపారని అన్నారు. దానికి కారణం ఏమిటని తెలుసుకోగా సబ్ స్టేషన్లో లోవోల్టేజీ సమస్య గుర్తించామన్నారు. ఈ నాసిరకం లో వోల్టేజ్ కరెంటు వల్లే రైతుల మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లు కాలిపోవడం వల్ల రైతులకు దనపు భారం, ఆర్థిక భారం పడుతోందన్నారు.  ఇది పూర్తిగా చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమన్నారు.  ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు దీనిపై రివ్యూ చేయడం లేదని ప్రశ్నించారు.

మన రాష్ట్రంలో కరెంటు లేదు కానీ.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌‌కు అమ్ముతామని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు అని ప్రశ్నించారు. మీరు చెప్పిందేమో 24 గంటల కరెంటు, కానీ ఇస్తున్నది కేవలం తొమ్మిది గంటలే. అందులోనూ మధ్యమధ్యలో ట్రిప్ అవుతోంది. మెటీరియల్ లేదనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సంవత్సర కాలంగా పెండింగ్ లో పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ నెల కనెక్షన్లు ఆ నెలకే రిలీజ్ చేసేవాళ్లం. అప్పుడు 4,500 రూపాయలు ఉన్న డీడీ చార్జీలను ఈ కాంగ్రెస్ వాళ్లు 9,000 రూపాయలకు పెంచారు. అయినా డీడీలు కట్టిన రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా ఎదురుచూపులు చూసేలా చేస్తున్నారు.

మూడు రోజులు ట్రాన్స్ ఫార్మర్ లేకపోతే రైతుల పంటలు ఏమవ్వాలి? మీ ఇంటెలిజెన్స్ కు ఇవేవీ కనబడటం లేదా అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి గాలిలో తిరిగితే రైతుల సమస్యలు ఎట్లా తెలుస్తాయి.. నేల మీదకు వచ్చి రైతుల దగ్గరకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండి నీరు కిందికి జారడం లేదు. కాబట్టి లో-వోల్టేజ్ లేకుండా రాత్రి పూట కలుపుకుని కనీసం 20 గంటల కరెంటును రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంటు రెండు గంటలు తగ్గితే.. లాగ్ బుక్కుల కోసం సబ్ స్టేషన్ల చుట్టూ ఉరికి ఉరికి తిరిగారు. ఇప్పుడు ఎనిమిది గంటలే వస్తుంటే ఎందుకు తిరగడం లేదు? ఆయన ఇప్పుడు కూడా లాగ్ బుక్కుల కోసం తిరగాలని అన్నారు. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే.. రైతులకు 20 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలి, ట్రాన్స్ ఫార్మర్లకు రోలింగ్ స్టాక్ పెట్టాలి, కాలిపోయిన వెంటనే కొత్తది ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే విడుదల చేయాలి, అన్ని జిల్లాల్లోని స్టోర్లలో వ్యవసాయ విద్యుత్‌కు అవసరమైన ఎక్విప్ మెంట్‌ను ప్రభుత్వం స్టాక్ మెయింటైన్ చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *