చేయూత కొత్త పెన్షన్లపై పరిశీలన ప్రారంభం

– ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పరిశీలన
– 25 లోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నప్పటికీ పెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పరిశీలన ప్రక్రియను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తొలి దశలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి పెన్షన్లు మంజూరు చేసేలా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దరఖాస్తుదారుల అర్హతను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయి అధికారులు, మున్సిపాలిటీల్లో సంబంధిత అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్కిల్ స్థాయి అధికారులు ఈ వెరిఫికేషన్‌లో పాల్గొంటారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేకంగా చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌ను రూపొందించారు. నియమిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు, అర్హత ప్రమాణాలను పరిశీలించి తమ వెరిఫికేషన్ నివేదికను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతీ దరఖాస్తుదారుడి సామాజిక, ఆర్థిక పరిస్థితి, నివాస స్థితి, పెన్షన్ కేటగిరీ, పథకానికి సంబంధించిన ఇతర అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దరఖాస్తుతోపాటు అవసరమైన పత్రాలు సమర్పించకపోతే అర్హత నిర్ధారణకు అవసరమైన పత్రాలను సంబంధిత అధికారి సేకరించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అర్హతను నిర్దారించుకుని వెరిఫికేషన్ నివేదికను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హులైన జాబితాను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు సంబంధిత డీఆర్‌డీవోలకు పంపుతారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ అనంతరం లబ్దిదారుల జాబితాను సంబంధిత అధికారులు పరిశీలించి జిల్లా స్థాయికి పంపిస్తారు. అనంతరం తుది జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు. ఆ తర్వాత సంబంధిత మండల, మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు చేయూత కొత్త పెన్షన్లకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేసి నిర్దేశిత విధానం ప్రకారం లబ్దిదారులకు అందజేస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *