ఆదివాసీలకు దిక్సూచి కొమురం భీం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కొమురం భీం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో గురువారం జరిగిన కొమురం భీం విగ్రహావిష్కరణ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసీ సమాజానికి కొమురం భీం ఒక దిక్సూచి అని, ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకమని మంత్రి పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కొమురం భీం, బిర్సా ముండా, జ్యోతిరావు పూలే వంటి మహనీయులు తమ పోరాటాలతో సమాజంలో మార్పునకు బాటలు వేశారని సీతక్క అన్నారు. వారు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే అణగారిన వర్గాలకు హక్కులు, రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు అందాయని గుర్తు చేశారు. అలాంటి మహనీయులను మన హృదయాల్లో నిలుపుకొని, వారి ఆశయాలను ఆచరణలో కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు ఇతర సామాజిక వర్గాలతో కలిసిమెలిసి జీవిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారన్నారు. ఆదివాసీ పోరాటాలు దేశ చరిత్రలో కీలకమైనవని, అణచివేతకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటాలు హక్కుల సాధనకు మార్గం చూపాయని పేర్కొన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీతక్క అన్నారు. సమస్యలను ఐక్యంగా ప్రభుతం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సాధించుకోవాలని సూచించారు. పరస్పర సహకారం, ఐక్యతతోనే ఆదివాసీ సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విగ్రహావిష్కరణకు ఆదివాసీ సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ జై కొమురం భీ అని నినదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు సహా అధిక సంఖ్యలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *