వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక

– రూ.18,250 కోట్లతో 65 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు 
– అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: రాబోయే వానాకాలం సీజన్‌లో రూ.18,250 కోట్ల అంచనా విలువతో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1 నాటికే రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో శనివారంనిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధరగా నిర్ణయించింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రాధాన్య సన్న రకాలకు (బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎమ్-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ-సోనా, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎమ్-7715) క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నది.

దిగుబడి అంచనాలు

ఈ వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 119.57 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌర సరఫరాల సంస్థ ద్వారా 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 20 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయనున్నారు. తెలంగాణ బియ్యానికి దేశీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు.

రవాణా, నిల్వ ఏర్పాట్లు

ఈ సీజన్‌కు అవసరమైన 16.25 కోట్ల గన్నీ సంచులను వేగవంతంగా సేకరించాలని, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా సరిహద్దు చెక్ పోస్టులను మరింత బలోపేతం చేయాలన్నారు.

సకాలంలో చెల్లింపులు

తూకం, నాణ్యత పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు నగదు చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంచాలకుడు శ్యామ్ ప్రసాద్, అదనపు సంచాలకుడు రోహిత్ సింగ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *