వాళ్ల‌తో పోలిస్తే మా పాల‌న భేష్‌

– 5.35 లక్షల మంది రైతులకు రుణ మాఫీ పూర్తి చేశా
– సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్
– మహిళలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి స్టాల్స్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌
– అసెంబ్లీకి వచ్చి తమ పాలనపై చర్చించాలి
– నకిరేకల్ సభలో కేసీఆర్, కేటీఆర్‌లకు సీఎం సవాల్ 

నకిరేకల్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5:  పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే తమ వెయ్యి రోజుల ప్రజా పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి వేగంగా ముందుకు సాగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో శ‌నివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 25.35 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ పూర్తి చేశామని తెలిపారు. గత 32 నెలల్లో రూ. 36,000 కోట్లు రైతు భరోసా, రూ. 90,000 కోట్లు వరి రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి రూ. 11,000 కోట్లు చెల్లించామని, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కేటాయిస్తున్నామని చెప్పారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 72,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వంలో ఉద్యమకారులకు, బలహీనవర్గాల నాయకులకు పదవులు కట్టబెట్టామన్నారు. రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్, ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు.

విపక్షాలకు సవాల్

ఫామ్‌హౌస్‌లకే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి తమ పాలనపై చర్చించాలని కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. న‌కిరేక‌ల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ల‌కు ప్రభుత్వ విప్ వేముల వీరేశం,
ఎంపీలు చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ బీర్ల అయిల‌య్య‌, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామెల్, పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు 

నకిరేకల్ లో ముఖ్యమంత్రి రేవంత్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిట‌ల్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.9.85 కోట్లతో నిర్మించే తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి, నకిరేకల్ మండలం కడపర్తిలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్లతో నిర్మించే ట్రాన్స్‌ఫార్మర్, 33/11 కేవీ సబ్‌స్టేషన్, 33 & 11 కేవీ విద్యుత్ లైన్లు కంట్రోల్ రూమ్ పనులకు శంకుస్థాపన చేశారు. కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో రూ.2.74 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్, లైన్ల ప్రారంభోత్సవం, నకిరేకల్ మండలంలో రూ.20 కోట్లతో నిర్మించే సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన. రూ45.60 కోట్లతో చేపడుతున్న కింది రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన: నకిరేకల్–గురజాల రోడ్ నుండి బైరౌనిబండ వరకు లి బైరౌనిబండ నుండి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్ వరకులి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్డు విస్తరణ/అభివృద్ధి పనులునకిరేకల్‌లో ?1.10 కోట్లతో నిర్మించనున్న ‘ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన’ భవనానికి శంకుస్థాపన చేశారు.

ఎస్‌ఎల్‌బీసీనే శాశ్వ‌త ప‌రిష్కారం : మంత్రి ఉత్తమ్ 

దక్షిణ తెలంగాణ ప్రాంతంలో జల కష్టాలకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గమే (ఎస్‌ఎల్‌బీసీ) శాశ్వత పరిష్కారమని, ఫ్లోరైడ్ బాధితులకు ఈ ప్రాజెక్టు సంజీవని లాంటిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నకిరేకల్‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతులకు నీళ్లందిస్తామని స్పష్టం చేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వేగవంతం చేసి జూన్ 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. దిండి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రూ.1,800 కోట్లు మంజూరు చేశారని, ఈ ప్రాజెక్టుతో పాటు బ్రాహ్మణ వెల్లంల, పెండింగ్ కాలువల పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ ఆయకట్టుకు అవసరమైన సాగునీటిని సమృద్ధిగా విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని, పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోటగా నిలుస్తుందని, సంక్షేమం, అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *